Saturday, May 9, 2026
E-PAPER
Homeకవర్ స్టోరీఅమ్మ దేవత కాదు... నిలువెత్తు మనషి

అమ్మ దేవత కాదు… నిలువెత్తు మనషి

- Advertisement -

ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నా, ఎన్ని వేల పదాలు ఉన్నా.. వాటన్నింటిలో అత్యంత మధురమైనది, పవిత్రమైనది ‘అమ్మ’ అనే రెండక్షరాల పదం. ఈ సష్టిలో జీవం పోసే శక్తి అమ్మది. మనిషికి ప్రాణం పోసి, తన రక్తాన్ని పాలుగా మార్చి పెంచి పెద్దచేసే తల్లి, ఒక వ్యక్తి జీవితంలో తొలి గురువు, మార్గదర్శి, రక్షకురాలు. మాత దినోత్సవం క్యాలెండర్‌ తేదీ లేదా సెలవు రోజు మాత్రమే కాదు. ప్రపంచంలోని ప్రతి తల్లి నిస్వార్థ ప్రేమను, అపార త్యాగాన్ని గుర్తించి, గౌరవించే ఒక పవిత్రమైన సందర్భం.

2026లో ఈ వేడుక మే 10, ఆదివారం వచ్చింది. ఈ రోజు మనం అమ్మ పట్ల కతజ్ఞత చాటుకుంటూ, ఆమె శ్రమకు విలువనిచ్చేలా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అమ్మను దేవతగా పూజించే సంస్కతి మనది, కానీ ఆ దేవత వెనుక ఉన్న మనిషిని, ఆమె పడే వేదనను గుర్తించడంలో మనం ఎక్కడో వెనుకబడి ఉన్నామని పిస్తుంది. ఈ నేపథ్యంలో మాత దినోత్సవం చరిత్రను, సామాజిక ప్రాధాన్యతను లోతుగా విశ్లేషించుకోవాలి. మాత దినోత్సవ నేపథ్యం
మాత దినోత్సవం వెనుక ఒక బలమైన చరిత్ర ఉంది. ఇది కేవలం పండుగలా మొదలవ్వలేదు, ఒక సామాజిక ఆవశ్యకతగా, స్త్రీల హక్కుల పోరాటంగా ఆరంభమైంది. మాత దినోత్సవం చారిత్రక మూలాలు నిజానికి స్త్రీవాద, శాంతి ఉద్యమాలతో ముడిపడి ఉన్నాయి.

1870లో జూలియా వార్డ్‌ హోవే మదర్స్‌ డే ప్రొక్లమేషన్‌ (వీశ్‌ీష్ట్రవతీర సay జూతీశీషశ్రీaఎa్‌ఱశీఅ) ద్వారా తల్లులు యుద్ధాలకు వ్యతిరేకంగా ఏకమవ్వాలని పిలుపు నిచ్చింది, సమాజాన్ని మార్చడం కోసం తల్లులందరూ రాజకీయంగా కూడా చైతన్యం అవ్వాలని ఆమె ఆకాంక్షించారు. అమెరికాకు చెందిన అన్నా జార్విస్‌ తల్లి, ఆన్‌ రీవ్స్‌ జార్విస్‌, సమాజ సేవకురాలు. ఆన్‌ రీవ్స్‌ జార్విస్‌ అమెరికా అంతర్యుద్ధం సమయంలో గాయపడిన సైనికులకు సేవ చేస్తూ, తల్లుల ఆరోగ్యం, పరిశుభ్రత, పిల్లల పెంపకంపై అవగాహన కల్పించడానికి ‘మదర్స్‌ డే వర్క్‌ క్లబ్స్‌’ నిర్వహించేవారు. అన్నా జార్విస్‌ తన తల్లి ఆన్‌ రీవ్స్‌ జార్విస్‌ సేవలను గౌరవించడానికి, కోరికను నెరవేర్చడానికి ఈ ఉద్యమాన్ని ప్రారంభించింది.

అధికారిక గుర్తింపు: 1905లో తల్లి మరణించిన తర్వాత, అన్నా జార్విస్‌ తన తల్లితో పాటు, ప్రపంచంలోని తల్లులందరి సేవలు గౌరవించాలని, కోరికలు నెరవేర్చాలని, నివాళి అర్పించాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. 1908 మే నెలలో, పశ్చిమ వర్జీనియాలోని గ్రాఫ్టన్‌ అనే పట్టణంలో ఉన్న సెయింట్‌ ఆండ్రూస్‌ మెథడిస్ట్‌ చర్చిలో మొదటి మాత దినోత్సవ వేడుక జరిగింది. ఈ ప్రయత్నానికి మంచి స్పందన లభించింది. అన్నా జార్విస్‌ తన ప్రచారాన్ని కొనసాగించి, అమెరికా ప్రభుత్వానికి ఆ రోజు సెలవు దినంగా ప్రకటించాలని కోరారు. అన్నా జార్విస్‌ పట్టువదలని పోరాటం వల్ల చివరకు 1914లో అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్‌ మే నెల రెండో ఆదివారాన్ని అధికారిక మాత దినోత్సవంగా ప్రకటించారు. అప్పటి నుంచి మాత దినోత్సవం ఒక కుటుంబ వేడుకగానే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా తల్లుల నిస్వార్థ ప్రేమను, వారి త్యాగాలను గుర్తించే ప్రత్యేక దినంగా గుర్తింపు పొందింది.

కాలక్రమేణా మాత దినోత్సవం గ్రీటింగ్‌ కార్డులు, గిఫ్టుల వ్యాపారంగా మారడం చూసి అన్నా జార్విస్‌ తీవ్రంగా ఆవేదన చెందింది. ‘నేను అమ్మల పట్ల హదయపూర్వకమైన ప్రేమను వ్యక్తం చేయమన్నాను, బహుమతులతో వ్యాపారం చేయాలని కాదు’ అని వ్యాపారీకరణను గట్టిగా వ్యతిరేకించింది. చివరకు, ఈ సెలవు దినాన్ని రద్దు చేయమని ప్రచారం చేసింది. ప్రపంచవ్యాప్తంగా మాత దినోత్సవ వేడుకలు మాతత్వానికి సరిహద్దులు లేవు. భౌగోళిక సరిహద్దులు దాటి మాతత్వం ఒకే భాష మాట్లాడుతుంది. అయితే దేశాల సంస్కతిని బట్టి వేర్వేరు తేదీల్లో దీనిని జరుపుకుంటున్నారు. భారతదేశం, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్‌, జర్మనీ, దక్షిణాఫ్రికా వంటి 100 దేశాలకు పైగా దేశాలు మే నెల రెండో ఆదివారాన్ని మాత దినోత్సవంగా పాటిస్తున్నాయి. అందుకే ఈ రోజే అంతర్జాతీయ మాత దినోత్సవంగా గుర్తింపు పొందింది. యునైటెడ్‌ కింగ్డమ్‌, ఐర్లాండ్‌ దేశాలు ఈస్టర్‌ పండుగకు మూడు వారాల ముందు అంటే మార్చి నెలలో జరుపుతారు. దీనిని ‘మదరింగ్‌ సండే’ అని పిలుస్తారు.

ఈజిప్ట్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, సౌదీ అరేబియా, ఇతర అరబ్‌ దేశాలు వసంతకాలం ప్రారంభం రోజు మార్చి 21న అమ్మల రోజు జరుపుకుంటారు. రష్యా, కొన్ని తూర్పుయూరప్‌ దేశాలలో ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’తో కలిపి మదర్స్‌ డే నిర్వహిస్తారు. మెక్సికో, లాటిన్‌ అమెరికాలోని కొన్ని దేశాల్లో ప్రతి ఏటా తేదీ మారకుండా మే 10నే జరుపుకుంటారు. ఫ్రాన్స్‌, స్వీడన్‌ వంటి దేశాల్లో మే నెల చివరి ఆదివారం జరుపుకుంటారు. థాయిలాండ్‌లో అక్కడి రాణి పుట్టినరోజు ఆగస్టు 12న మాత దినోత్సవం జరుపుకుంటారు.

మాత దినోత్సవం ప్రధాన ఉద్దేశాలు
ఈ దినోత్సవం జరుపుకోవడం వెనుక ఐదు ముఖ్యమైన ఉద్దేశాలు కనిపిస్తాయి.
1. అమ్మ నిస్వార్థ ప్రేమను గుర్తించడం. ఆ నిష్కల్మషమైన ప్రేమను స్మరించుకోవడం.
2. అమ్మల త్యాగాలకు నివాళి పలకడం.
3. అమ్మతో కుటుంబ బంధాలు బలోపేతం చేయడం.
4. సమాజ నిర్మాణంలో తల్లి పాత్ర గుర్తించడం.
5. జన్మనిచ్చిన తల్లికే కాకుండా, తల్లి స్థానంలో ఉండి పెంచి పెద్ద చేసిన ప్రతి మహిళకు కతజ్ఞతలు తెలపడం. తెలుగు సమాజంలో అమ్మ వాస్తవిక స్థితి

నేటి తెలుగు రాష్ట్రాల్లో మాత దినోత్సవం జరుపుకునే తీరులో ”ద్వంద్వ స్థితి” కనిపిస్తుంది. సాంకేతికత పెరిగిన తర్వాత, ప్రేమ కంటే ప్రదర్శన ఎక్కువవుతున్నది. తమతో ఒకే ఇంట్లో ఉన్న అమ్మకు మంచి నీళ్లు ఇవ్వడానికి, ఆమెతో ప్రశాంతంగా ఐదు నిమిషాలు మాట్లాడటానికి సమయం ఇవ్వని వాళ్లు కూడా మాతదినోత్సవం రోజు ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ స్టేటస్‌లలో అమ్మతో ఉన్న ఫొటోలు పెట్టి, పెద్ద పెద్ద సందేశాలు రాయడం ఒక ఫ్యాషన్‌ అయింది. అమ్మ కంటే ‘అమ్మను గౌరవిస్తున్నట్లు కనిపించడం’ ముఖ్యం అయిపోయింది. ముసలితనంలో అమ్మకు ఇచ్చే భరోసా తగ్గిపోయింది. ఉరుకుల పరుగుల జీవితంలో సిటీల్లో ఉంటున్న పిల్లలు, తమ పిల్లలను చూసుకోవడానికి మాత్రమే అమ్మను పిలిపించుకుంటున్నారు. చాలా సందర్భాల్లో అమ్మ ఉచిత పనిమనిషిగా లేదా పిల్లలను చూసుకునే ఆయాగా మారిపోతున్నది. ఆ అవసరం తీరిపోయాక లేదా ఆమెకు ఆరోగ్యం క్షీణించాక వారికి భారమైపోతున్నది.

ఉపాధి కోసం పిల్లలు వేరే నగరాలకు, దేశాలకు వెళ్లడం వల్ల, అనేకమంది అమ్మలు ఒంటరితనంతో కుమిలి పోతున్నారు. ఈ దూరంలో అప్పుడప్పుడు ఫోన్‌ కాల్స్‌ మాత్రమే మిగులుతున్నాయి. ఖరీదైన గిఫ్ట్‌ ఇచ్చి, అమ్మను పక్కన పెట్టేయడం ఈ రోజుల్లో ఎక్కువగా కనిపిస్తుంది ఇప్పుడు, ఇంట్లో అందరూ ఉన్నా, అమ్మను చూసుకునే తీరిక లేక లేదా సమస్యల కారణంగా ఆశ్రమాలకు పంపించే ధోరణి పెరిగింది. ఇది మన సమాజంలో అమ్మ పట్ల ఉన్న గౌరవానికి విరుద్ధమైన పరిణామం.
పిల్లలు ఆర్థికంగా ఎదిగిన తర్వాత కూడా తల్లిదండ్రులను భారంగా భావించే ధోరణి పెరుగుతున్నది. పేయింగ్‌ గెస్ట్‌ సౌకర్యాలతో కూడిన లగ్జరీ వద్ధాశ్రమాలు పెరుగుతున్నాయి. మేము బిజీగా ఉన్నాం, అక్కడైతే నీకు తోడు ఉంటారు అని చెప్పి అమ్మను అక్కడికి పంపడం ఒక సామాజిక అంగీకారంగా మారిపోతోంది. కానీ ఇది అమ్మలంతా ఆమోదించట్లేదు. కొందరు అమ్మల మనసుపై చేసే అతిపెద్ద గాయంగా మారిపోతున్నది.

అంతా చీకటిగానే ఉందా? లేదు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇప్పటికీ చాలా కుటుంబాల్లో అమ్మను దైవంగా భావించే సంస్కతి సజీవంగానే ఉంది. పిల్లలు తల్లిదండ్రుల కోసం తమ కెరీర్‌ను త్యాగం చేసే వాళ్ళూ, తల్లి సంతోషమే తమ సంతోషమని భావించే యువత ఇంకా సమాజంలో ఎంతోమంది ఉన్నారు. అమ్మ దేవత కాదు మనిషి సమాజం అమ్మను ఒక ‘దేవత’గా చిత్రించి ఆమెపై లేనిపోని భారాలను మోపుతున్నది. అమ్మ ఎప్పుడూ త్యాగం చేయాలి, ఆమెకు కోపం రాకూడదు, ఆమెకు అలసట ఉండకూడదు అనే నియమాలు ఆమెను యంత్రంలా మారుస్తున్నాయి. ఇంట్లో అమ్మ చేసే పనులకు విలువ కట్టలేము. కానీ ఆ పనిని మనం గుర్తించడం కూడా లేదు. ఆమె శ్రమను కేవలం కర్తవ్యం అని పిలిచి బాధ్యత నుంచి తప్పుకోవడమే.

అమ్మకు కూడా సొంత హాబీలు, ఆశలు, విరామం తీసుకునే హక్కు ఉంటాయని గుర్తించాలి. అమ్మ త్యాగం ఆమెకు శిక్ష కాగూడదని ఆమె కూడా ఒక మనిషి అని గుర్తించాలి. అంతేకాదు, ఆమె కుటుంబం కోసమే కాదు తనకోసం తాను జీవించే హక్కు ఆమెకు ఉందని సమాజం అంగీకరించాలి. ఆధునిక అమ్మ సవాళ్లు
నేటి తల్లి బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆమె ఉద్యోగం చేస్తూనే ఇంటిని చక్కబెడుతుంది. కానీ ఈ క్రమంలో ఆమె ఎదుర్కొంటున్న మెంటల్‌ లోడ్‌ ఎవరూ గుర్తించడం లేదు. ‘పర్ఫెక్ట్‌ మదర్‌’ అనిపించుకోవాలనే ఒత్తిడిలో ఆమె తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నది. గ్రామీణ ప్రాంతాల్లో తల్లులకు సొంతంగా ఆస్తులు ఉండవు. ఆదాయం ఉండదు. కొడుకుల మీదో, భర్త మీదో ఆధారపడతారు. ఈ ఆర్థిక పరాధీనత వల్ల, వయసు మళ్ళిన తర్వాత ఇంట్లో అమ్మ మాట చెల్లుబాటు కావడం లేదు. ఇది వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది.

అమ్మను దేవతగా, నిస్వార్ధ త్యాగమూర్తిగా చిత్రించడం వల్ల ఆమెకు కూడా అలసట, కోరికలు, హక్కులు, తన కోసం సమయం ఉంటాయని సమాజంతో పాటు ఆమె కూడా మరిచిపోతున్నది. అమ్మ అంటే త్యాగం చేయాలనే ఆలోచన ఆమెను బంధించే సాధనం అని ఆమె గుర్తించాలి. మంచి తల్లి భావన వదిలించుకోవాలి. మాతత్వం ఆమె ఎంపిక కావాలి కానీ సామాజిక ఒత్తిడి కాకూడదని స్త్రీ ముందు ఒక మనిషి ఆ తర్వాతే తల్లి అని అందరూ గుర్తించాలి. ఆధునిక అమ్మ ఆర్థికంగా స్వతంత్రురాలు అయిందేమో కానీ మానసికంగా ఒంటరి అవుతున్నది. చదువు, ఉద్యోగం ఆమెకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాయి, కానీ యాంత్రిక జీవనం ఆమెలోని సహజమైన ప్రశాంతతను దూరం చేస్తున్నది.

ప్రవర్తనలో రావాల్సిన మార్పు
వ్యాపారీకరణ వల్ల మాత దినోత్సవం అసలు స్ఫూర్తి పోయి వస్తు వినియోగం వైపు మళ్ళింది. తెలియకుండానే మనం ఆ ఉచ్చులో పడిపోతున్నాం. ఇది ఒక రకమైన కత్రిమ సంతప్తి. అమ్మకు ఏదో ఒకటి కొని ఇచ్చేస్తే, బిడ్డగా నా బాధ్యత తీరిపోయింది అని మన మనసును మనమే సమాధానపరచుకోవడం. క్యాలెండర్‌ ప్రేమ ప్రకటించడం ద్వారా వ్యాపార ప్రపంచం మన జేబులను ఖాళీ చేస్తుంది కానీ అమ్మకు కావాల్సింది ఇవ్వదు. కొనే వస్తువు ఏదైనా ఆమెకు అవసరమైతే కొనడంలో తప్పు లేదు, కానీ అది మన ప్రేమకు కొలమానం కాకూడదు. వ్యాపార ప్రకటనల మాయలో పడకుండా, అమ్మకు మనం ఇచ్చే నిజమైన బహుమతి మన సమయం మాత్రమే అని గుర్తించాలి మాత దినోత్సవం మే 10న ముగిసిపోకూడదు. అది మన జీవితంలో ఒక భాగం కావాలంటే కొన్ని మార్పులు చేసుకోవడం అవసరం. అందుకోసం ఏం చేయొచ్చో చూద్దాం.

-ఇంట్లో అమ్మ చేసే పనులకు మనం విలువ కట్టడం లేదు. ఆమె శ్రమను ఆమె కర్తవ్యం అని ఆ బరువు బాధ్యత నుంచి తప్పుకోవద్దు. ఇంటి పనులు అమ్మ ఒక్కరే చేయకుండా, ఇంటి లోపలి పని సంస్కతి మార్చుకోవడం. జెండర్‌ ప్రాతిపదికన కాకుండా అవసరం ప్రాతిపదికన పనులు పిల్లలు, భర్త పంచుకోవడం. వంటగదిలో ఆమెకు సహాయం చేయడం ద్వారా ఆమె శారీరక శ్రమను తగ్గించడం చేయొచ్చు.
-నాణ్యమైన సమయం గడపడం. స్మార్ట్‌ఫోన్లను పక్కన పెట్టి రోజూ కనీసం 15 నిమిషాలు అమ్మతో మాట్లాడటం. ఆమె గత జ్ఞాపకాలు, ఆమెకు ఇష్టమైన పనుల గురించి అడిగి తెలుసుకోవడం. మీరిచ్చే ఖరీదైన బహుమతి కంటే ఎక్కువ ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఆ మాటలు ఇస్తాయి.
-ఇంటి నిర్వహణలో అమ్మ ఇచ్చే సలహాలు, సూచనలకు ప్రాధాన్యం ఇవ్వడం. ఆమెకు ఒక గుర్తింపు, గౌరవం ఇవ్వడం.
-అమ్మలు సాధారణంగా తమ ఆరోగ్యం గురించి పట్టించుకోరు. కాబట్టి పిల్లలు బాధ్యత తీసుకుని ఆమెకు కాలానుగుణంగా వైద్య పరీక్షలు చేయించి నేనున్నాను అని భరోసా ఇవ్వడం
-అమ్మకు బ్యాంకింగ్‌, ఆన్‌లైన్‌ పేమెంట్స్‌, ఇన్వెస్ట్‌మెంట్స్‌ గురించి నేర్పడం. తన ఖర్చుల కోసం ఆమె ఎవరినో అడగాల్సిన అవసరం లేకుండా చిన్నపాటి ఆర్థిక స్వేచ్ఛను కల్పించడం చేస్తే ఆ తల్లిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆధారపడటం తగ్గుతుంది. తలిదండ్రులను బాధ్యతగా కాకుండా అనుబంధంగా చూడటమే సాధించాల్సిన పెద్ద మార్పు.

విద్యా వ్యవస్థలో మార్పు: భావి తరాల బాధ్యత
ప్రతి బిడ్డకు మొదటి పాఠశాల ఇల్లు అయితే, మొదటి గురువు అమ్మ. ప్రస్తుత విద్యా వ్యవస్థ మార్కులు, ర్యాంకులు ఉద్యోగాల చుట్టూ తిరుగుతున్నది తప్ప, మానవీయ విలువలను నేర్పించడంలో విఫలమవుతున్నది. విద్యావ్యవస్థలో మార్పు వస్తే అమ్మను సమాజం చూసే కోణం మారుతుంది. పాఠ్యపుస్తకాల్లో ‘అమ్మ వంట చేస్తుంది – నాన్న ఆఫీసుకి వెళ్తున్నారు’ అనే పాత చిత్రాలు మార్చడం. ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచి ‘ఇంటి పనిలో సమానత్వం’ గురించి పాఠాలు ఉంచడం. చదువులో భాగంగా తల్లిదండ్రులను గౌరవించడం ఒక సంస్కారంగా నేర్పడం, వద్ధాప్యంలో వారు ఎదుర్కొనే శారీరక, మానసిక మార్పుల గురించి అవగాహన కల్పించడం వంటివి చేస్తే అమ్మను కూడా ఒక వ్యక్తిగా, ఆమెకు కూడా మనోభావాలు ఉంటాయని గుర్తిస్తారు. తల్లి ఇంట్లో చేసే పనిని ఒక వత్తిగా గౌరవించడం నేర్పితే, పిల్లల్లో ఆమె పట్ల చిన్న చూపు తగ్గుతుంది.

పాఠశాలల్లో వద్దాశ్రమాల్లోని తల్లుల వ్యధలను వినడం వంటివి ప్రాజెక్ట్‌ వర్క్స్‌గా ఇస్తే, తమ ఇంట్లో ఉన్న అమ్మ విలువ పిల్లలకు అర్థమవుతుంది. ఆ ఒంటరితనం ఎంత భయంకరంగా ఉంటుందో చిన్నప్పుడే గ్రహిస్తారు. అలా చేస్తే మాత దినోత్సవం రోజు ఇచ్చే గిఫ్టుల కంటే, నిత్యం ఇచ్చే గౌరవం పెరుగుతుంది.
ఏది ఏమైనా మన భావోద్వేగాలను మార్కెటింగ్‌ ఆయుధంగా వాడుకోవడమేనని గుర్తించి, అమ్మను దేవత స్థానం నుంచి దించి, ఒక మనిషిగా చూడడం మొదలు పెట్టినప్పుడు మనం ఆమెకు నిజమైన గౌరవం ఇచ్చినట్లవుతుంది. ఆమెకు కూడా అలసట ఉంటుంది, ఆమెకు కూడా ఆశలు ఉంటాయని గుర్తించడం, ఆమెకు కూడా విశ్రాంతి కావాలి అనే స్పహతో ఆమె శ్రమలో కుటుంబం భాగస్వామ్యం కావడం ముఖ్యం. అమ్మ పట్ల గౌరవం అనేది ఏడాదికి ఒకసారి వచ్చే మాత దినోత్సవం స్టేటస్‌లలో బహుమతుల్లో లేదు, మనం ప్రతిరోజూ ఆమె పట్ల చూపే నడవడికలో ఉంది. సమానత్వం, గుర్తింపుతో చెప్పే ఒక చిన్న మాట, ఇచ్చే ఒక చిన్న ఆత్మీయ కౌగిలింత.. ముందు ప్రపంచంలోని ఏ ఖరీదైన బహుమతైనా చిన్నదే అవుతుంది. ఈ మాత దినోత్సవం ప్రతి ఇంట్లో ఒక కొత్త మార్పునకు పునాది కావాలని కోరుకుందాం.

మాత దినోత్సవం కోసం వినూత్న ఆలోచనలు
-ఈ మే 10న అమ్మను ఆశ్చర్య పరచడానికి బొకేలు ఇవ్వడం, కేకు కట్‌ చేయించడం కాకుండా కొన్ని చిన్న ప్రయత్నాలు చేయొచ్చు. ఆ రోజు అమ్మకు సెలవు ఇచ్చి మీరే వంట చేసి ఆమెకు వడ్డించడం.
-మీ చేతితో రాసిన ఒక ఉత్తరాన్ని ఆమెకు ఇవ్వడం. అందులో ఆమె పట్ల మీకున్న కతజ్ఞతను వివరించడం.
-ఆమె ఎప్పటి నుండో చూడాలనుకున్న సినిమాకో, వెళ్లాలనుకున్న ప్రదేశానికో తీసుకెళ్లడం.
-ఆమె చిన్ననాటి ముచ్చట్లు, పెళ్లి నాటి జ్ఞాపకాలు లేదా ఆమె చదువుకున్న రోజుల గురించి అడిగి తెలుసుకోవడం.
-పాత ఫోటో ఆల్బమ్స్‌ తీసి, ఆనాటి ముచ్చట్లను ఆమెతో కలిసి నెమరువేయడం.
-ఆమె చిన్ననాటి స్నేహితులతో గెట్‌ టూ గెదర్‌ ఏర్పాటు చేయడం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -