‘అంతులేని కథ’ సినిమా చూసిన తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ జయప్రద కన్నా ఆకర్షించిన పాత్ర ఒక చలాకి అమ్మాయిది. అమెది చాలా టిపికల్ పాత్ర. ఆమె జీవితంలో దేనిని సీరియస్‌గా తీసుకోదు. లాభనష్టాల్ని బెరీజు వేసుకోకుండా జీవించే తత్వం ఆమెది. అయితే ఒక ఒంటరి మహిళ కూతురుగా ఉన్న ఆ అమ్మాయి ఈ సినిమాలో తన ఆఫీసు మేనేజర్ ప్రేమలో పడుతుంది. విచిత్రం ఏమిటంటే ఆ వ్యక్తి రహస్యంగా ఆమె తల్లిని కూడా ప్రేమిస్తుంటాడు. ఒక దశలో తన తల్లి, ప్రేమికుడు ఒంటరిగా ఉండడం చూసిన ఆమె తట్టుకోలేక పోతుంది. అయితే చాలా సందర్భాలలో దేనినైనా ఈజీగా తీసుకునే ఆ పాత్ర ఒక్కసారిగా ప్రేమలో మోసపోయానని తెలియడంతో ఆత్మహత్య చేసుకుంటుంది. అలాగే తన వ్యక్తిగత జీవితంలో కూడా తనను మనసారా ప్రేమించినట్టు నమ్మించినతను మరో హీరోయిన్‌తో తిరుగుతున్నాడని తెలిసి చివరకు ఆత్మహత్యకు పాల్పడుతుంది. ఈ రకంగా చూస్తే ఆమె జీవితంలో, సినిమాలలో పోషించిన పాత్రలు రెండు ఒకటిగానే మనకు కనిపిస్తాయి. ఆ నటి ”ఫటాఫట్ జయలక్ష్మి’‘.
జయలక్ష్మి 1958 సెప్టెంబర్ 16న నెల్లూరులో జన్మించింది. ఆమె చదువు కూడా అక్కడే సాగింది. అయితే ఆమె అసలు పేరు ”నీరజాక్షి”. ఇంట్లో అందరూ ”నీరజ” అని పిలిచేవారు. సినిమాలలో మొదట నీరజగానే పరిచయమైంది. 1972లో తన పుట్టినరోజు పండుగకు తండ్రి వెంట వచ్చిన నీరజాక్షిని చూసిన వాణిశ్రీ ”అమ్మాయి సినిమాలలో నటించేంత అందంగా ఉంది” అని తను నటిస్తున్న ఇద్దరు అమ్మాయిలు సినిమాలో ఒక చిన్న పాత్రకు సిఫార్సు చేసింది. అలా రంగానికి పరిచయమైంది. 1972లోనే ఆమె విన్సెంట్ మలయాళ చిత్రం ‘తీర్థయాత్ర’లో సుప్రియ పేరుతో నటించింది. ఆ తర్వాత ‘ఇది మనుష్యనో?’ (1973), 1974లో తమిళంలో కె. బాలచందర్ ‘అవల్ ఒరు తొడర్ కథై’లో జయలక్ష్మిగా గుర్తింపు పొందింది. మలయాళ చిత్ర రంగంలో ఆమె ”సుప్రియ”గా గుర్తింపు పొందినప్పటికీ, బాలచందర్ ఆమెను తమిళ ప్రేక్షకులకు ”జయలక్ష్మి”గానే పరిచయం చేశాడు.
తమిళ ప్రేక్షకులకు ‘అవల్ ఒరు తొడర్‌కథై’ చిత్రంలో ఆధునిక వస్త్రధారణతో, ఎంతో ఉత్సాహభరితమైన యువతిగా కనిపించిన జయలక్ష్మిని మర్చిపోవడం అంత సులభం కాదు. అదే మాదిరిగా తెలుగు ప్రేక్షకులు కూడా ‘అంతులేని కథ’ చిత్రంలో ఫటాఫట్ అంటూ ఈజీ గోయింగ్ యువతిగా జయలక్ష్మిని మర్చిపోలేరు. ప్రతి సందర్భంలోనూ ”ఫటాఫట్” అనడం వల్ల ఆమెకు అదే ఇంటి పేరయింది. అనంతరం తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషలలో సుమారు 60పైగా చిత్రాలలో నటించిన ఆమె, తన సమకాలీన అగ్రశ్రేణి నాయికల సరసన తనదైన విశిష్ట స్థానాన్ని సంపాదించుకుంది. ‘అవలై వరు తొడర్ కథై’ తర్వాత, ముల్లం ములరం, ఆరిలిరుంతు అరుబత్తు వరై వంటి చిత్రాలు ఆమె సినీ ప్రస్థానంలో మైలురాళ్లుగా నిలిచాయి. రజనీ, కమల్, ఎన్.టి.ఆర్., అక్కినేని, చిరంజీవి, చంద్రమోహన్ వంటి అగ్రతారలతో జంటగా నటించింది.
తెలుగులో ఆమె ‘జీవిత రంగం’ (1974), ‘స్వర్గం నరకం’ (1975), ‘జ్యోతి’ (1976), ‘భలే అల్లుడు’, ‘ఈనాటి బంధం ఏనాటిదో ‘ (1977), ‘రామచిలక’, ‘చిలిపి కృష్ణుడు’, ‘యుగపురుషుడు’ (1978), ‘కోరికలే గుర్రాలైతే’, ‘ముత్తైదువ’ (1979),” జాతర’, ‘కాళీ’, ‘అత్తవారిల్లు, ‘రాం రాబర్ట్ రహీం’ (1980) ‘న్యాయం కావాలి’, ‘తిరుగులేని మనిషి’ (1981) వంటి 20 సినిమాల్లో నటించింది. ‘ముల్లం ములరం’ చిత్రంలో రజనీకాంత్ భార్య పాత్రలో ఆమె ”నితంనితం నెల్లు సోరు… నీయై మనక్కం కదిరిక్కై” అనే ఒక్క పాటలోనే భావోద్వేగాలన్నింటినీ పలికించిన తీరు ఆమె అభిమానులు మరువ లేరు. తమిళంలో ఆమె ”ఎజైక్కుం కాలం వరం, మయాంగుకిరల్ ఒరు మధు, యరుక్కు మాప్పిళ్ళై యారో, పట్టిక్కట్టు రాజా (1975), మొగం ముప్పడు వరుషం, జయగా పయనం, సుమతిగా అన్నకిలి (1976), నామ్ పిరంధ మన్, నందా ఎన్ నిల,పెన్నై సొల్లి కుట్రమిల్లై,పెరుమైక్కురియవాల్, కల్పనగా పున్నియం సీతవాల్, అవర్ ఎనక్కే సొంతం, కవి కుయిల్ (1977)అతివిద రాగసియం, కామచ్చియిన్ కరుణై, వరువన్ వడివేలన్, ముల్లుమ్మలరుమ్, త్యాగం (1978), ఉరవుగల్ ఎండ్రమ్ వాఙ్గ, ఆరిలిరుంతు అరుబతు వరై, కిజక్కుమ్ మెర్కుమ్ సంధిక్కింద్రానా (1979), కాళి, నధియై తేది వంధా కాదల్ (1980), తిరుప్పంగళ్ (1981) మొత్తం 31 సినిమాల్లో నటించింది. మలయాళంలో సుప్రియగా ”తీర్థయాత్ర (1972), దర్శనం (1973) శ్రీదేవి (1977) ప్రత్యక్ష దైవం (1978), కన్నడంలో ఓండు హెన్ను ఆరు కన్ను” (1980)లో నటించింది.
2018లో ఇండియా టుడే రజినీకాంత్ సినీ జీవిత స్వర్ణోత్సవ సందర్భంగా ఒక ప్రత్యేక సంచికను వెలువరించిన సమయంలో ఆయన తన ఇంటర్వ్యూలో మీకు ఇష్టమైన నటి ఎవరని అడిగినప్పుడు, ఆయన ఫటాఫట్ జయలక్ష్మి అని, ఆమె ప్రతిభావంతమైన నటి మాత్రమే కాదని గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషిగా అభివర్ణించాడు. జయలక్ష్మిని అంచనా వేయడానికి రజనీ చెప్పిన ఈ మాటలు చాలు. అయితే ఆమె ఎం.జి.ఆర్. సోదరుడు ఎం.జి. చక్రపాణి కుమారుడు సుకుమారన్‌ను ప్రేమించింది. ఆ ప్రేమ విఫలం కావడంతో ఆత్మహత్య చేసుకున్నది. ఫిలిం న్యూస్ ఆనందన్ ఈ ఆత్మహత్యపై ఒక విశ్లేషణ చేశాడు.
అందుకు ఆయన రెండు కారణాలను పేర్కొన్నారు. ఒకటి: ప్రేమ వ్యవహారాల్లో ఇరుక్కోవటం, రెండు: ఆర్థికంగా దెబ్బతినటం. అయితే మొత్తం ఆత్మహత్యల్ని పరిశీలిస్తే, రెండవ కారణం గోరు చుట్టు మీద రోకటి పోటులాంటిదే తప్ప, అదే మూల కారణం కాదనిపిస్తోంది. అసలు సినిమారంగంలో ప్రేమించడం అన్నది ఒకరితో కాకుండా అంతకన్నా ఎక్కువమంది సినిమా తారలతో సంబంధాలు కలిగి ఉండటాన్ని పురుషాధిక్యతకు ఒక స్టేటస్ సింబల్గా తీసుకుంటారు. అయితే సరిగ్గా ఇదే అంశం ఏ సినీ తార విషయానికి వస్తే నటుడితోనో, దర్శక నిర్మాతలతోనో, సంగీత దర్శకుడితో సన్నిహితంగా ఉంటే అది ఆమె తప్పిదంగానే పేర్కొంటారు.
దేశంలోని ఒక్క భాష అని కాదు. అన్ని భాషల సినీ రంగంలో కూడా ఈ ప్రేమలు, సహజీవనాలు చివరికి ఎవరి దారులు వారు చూసుకునేట్టుగానే ముగిసిపోతాయి. కానీ ఈ తతంగంలో నష్టపోయేది మాత్రం మహిళనే.లక్షలాది మంది అభిమానుల హదయాలను గెలుచుకున్న జయలక్ష్మి, ఇన్నేండ్లు గడిచినా, తన అభిమానుల హదయాల్లో చెరగని ముద్రను అలాగే నిలుపుకున్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికీ ఆమె జ్ఞాపకాలు అభిమానులు నెమరు వేసుకుంటూనే ఉన్నారు. వాటిని చూసిన చాలామంది, ”ఈనాటికీ జయలక్ష్మి మా జ్ఞాపకాల్లో సజీవంగానే ఉన్నారు…” అంటూ పోస్ట్ చేస్తున్నారు. మమతన్నది వట్టి పిచ్చి. మనసన్నది మరో పిచ్చి. అరే ఏమిటి లోకం పలుగాకుల లోకం” అంటూ జయలక్ష్మి ఈ లోకం నుండి అర్ధాంతరంగా నిష్క్రమించింది. అందుకే ఆమె ఒక అసంపూర్ణ జీవన కథానాయక.
హెచ్ రమేష్ బాబు,
7780736386



