స్నేహమంటే ఈర్ష, ద్వేషం, స్వార్థం లేనిది. రక్తసంబంధం కాకపోయినా హృదయాలను కలిపే ఆత్మీయ బంధం. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, కష్టసుఖాల్లో తోడుగా ఉంటూ, నమ్మకం, ప్రేమ గౌరవంతో జీవితాంతం ఒకరికి ఒకరు అండగా ఉండే అనురాగ బంధం. జీవిత ప్రయాణంలో మనకు తోడుగా నిలిచే అమూల్యమైన బంధం. నిజమైన స్నేహితుడు మనం ఆనందంగా ఉంటే పంచుకుంటాడు, బాధలో ఉంటే భుజం తడతాడు. మన విజయాన్ని తన విజయంగా భావిస్తాడు. ఇలా కష్టంలో, సుఖంలో, ఆనందంలో, బాధలో.. అన్ని వేళల్లో మనకు తోడుగా నిలిచే ఓ స్నేహం జీవితంలో ఉండటం చాలా అవసరం. అలాంటి స్నేహితులు ఉన్నవారు జీవితంలో ఏదైనా సాధించగలుగుతారు. అందుకే ‘దోస్త్ మేరా దోస్త్ తూహై మేరా జాన్’ అంటాడు ఓ సినీ కవి. ఈరోజు స్నేహితుల దినోత్సవం సందర్భంగా స్నేహం గురించి, గొప్ప స్నేహితుల గురించి తెలుసుకుందాం…
స్నేహం ఎంతో విలువైనది. మన జీవితాన్ని ఆనందంగా మార్చడంలో స్నేహబంధం ఎంతో ఉపయోగపడుతుంది. నిజమైన స్నేహితులు కష్టసుఖాల్లో తోడుగా ఉంటారు. జీవితంలోని ప్రతి సమయంలో అండగా ఉంటారు. ఒక మనిషి తన సంతోషాన్ని పంచుకోవాలనుకున్నప్పుడు ముందుగా గుర్తుకొచ్చేది స్నేహితుడే. ఏదైనా సాయం కావాలంటే గుర్తుకొచ్చేది కూడా స్నేహితుడే. మనం సందేహంలో ఉన్నప్పుడు నిజమైన స్నేహితుడు మనకి సరైన మార్గాన్ని చూపి మంచి సలహాలు ఇస్తాడు.
స్నేహితులు అవసరం
ప్రతి మనిషికి జీవితంలో స్నేహితుడు అవసరం. ఎందుకంటే తనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు చెప్పుకోవడానికి ఓ మనిషి కావాలి. కుటుంబ సభ్యులతో, జీవిత భాగస్వామితో చెప్పుకోలేని అనేక విషయాలు కేవలం స్నేహితులతో మాత్రమే పంచుకోగలం. ఎన్ని సాధించినా, ఏం చేసినా పంచుకోవడానికి ఓ స్నేహితుడు లేనపుడు జీవితం ఒంటరిగా అనిపిస్తుంది. సంపదతో అన్నీ కొనొచ్చు కానీ నిజమైన స్నేహితుడిని కొనలేం. అది కేవలం మన మనసుతో మాత్రమే సంపాదించుకోగలం.
ఒకప్పటి స్నేహం
ఒకప్పుడు స్నేహితులంటే అందరూ ప్రత్యక్షంగా కలుసుకొని సరదాగా కాలం గడిపేవారు. కలిసి చదువుకునే వారు, ఆడుకునే వారు, మాట్లాడుకునేవారు. ఒకరి ఇళ్ళకు మరొకరు వెళ్లి కుటుంబ సభ్యులతో కూడా అనుబంధాన్ని పెంచుకునేవారు. వయసు పెరిగే కొద్దీ ఉద్యోగాలు, బాధ్యతల రీత్యా దూరంగా ఉండాల్సి వస్తే ఉత్తరాలైనా రాసుకునేవారు. ఒక స్నేహితుడికి కష్టం వస్తే స్వయంగా ఇంటికి వెళ్లి ఓదార్చి అతని సమస్య పరిష్కారం కోసం ఎంతో ప్రయత్నించేవారు.
స్నేహాలు ఇలా మారాయి…
సాంకేతికత వచ్చిన తర్వాత స్నేహం చేయటం, స్నేహాలను కొనసాగించడం కొంత వరకు సులభమయ్యింది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత స్నేహితులు ఎంత దూరంలో ఉన్నా వీడియో కాల్స్ ద్వారా మాట్లాడవచ్చు. ప్రపంచంలో ఏ మూలలో ఉన్నా స్నేహితులు పక్కనే ఉన్నారా అనే భావన కలిగేంతగా మార్పు వచ్చింది. అలాగే కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి కొత్త స్నేహాలు ఏర్పడడానికి కూడా అవకాశాలు పెరిగాయి.
స్నేహం ఎదుర్కొంటున్న సవాళ్లు
పెరిగిపోతున్న టెక్నాలజీ వల్ల స్నేహమంటే ఫేస్‌బుక్‌లో లైక్‌లు కొట్టడం, ఫాలోవర్లుగా ఉండడం, ఆన్లైన్ సందేశాలకే పరిమితమవుతుంది. ప్రత్యక్షంగా కలుసుకునే సమయమే తగ్గిపోతుంది. కనీసం మాట్లాడుకునే సమయం కూడా లేక మెసేజ్ల పైనే ఆధారపడుతున్నారు. అంతేకాదు ఆన్‌లైన్ స్నేహాలతో మోసపోవడం, ఆర్థికంగా నష్టపోవడం వంటివి కూడా ఈ మధ్య కాలంలో బాగా పెరిగాయి. ఇలాంటి స్నేహాల వల్ల ముఖ్యంగా అమ్మాయిలు ఎక్కువగా నష్టపోతున్నారు. అందరూ ఒక దగ్గర ఉన్నా వారి ఆలోచనలు మాత్రం ఎక్కడో దూరంగా ఉంటున్నాయి. ఇక నేటి తరానికి నిజమైన స్నేహం ఎలా దొరుకుతుంది?
అబ్బాయి అమ్మాయి మధ్య స్నేహం
నిజానికి స్నేహానికి లింగ బేధం లేదు. అది మనసుపై ఆధారపడి ఉంటుంది. అబ్బాయి అమ్మాయి స్నేహం కచ్చితంగా ప్రేమగా మారాల్సిన అవసరం లేదు. జీవితాంతం మంచి స్నేహితులుగా కోనసాగవచ్చు. అలాగే కొన్నిసార్లు ఇద్దరూ తమ అంగీకారంతో ఆ స్నేహం ప్రేమగా మార్చుకోవచ్చు. ఈ రెండు పరిస్థితులను సమాజంలో మనం చూస్తూనే ఉన్నాం.
ప్రపంచీకరణ ప్రభావం
ప్రపంచీకరణ ప్రభావం నేడు అన్ని బంధాలపైనా పడుతుంది. ప్రతీది సరుకుగా మారిపోయిన నేటి సమాజంలో బంధాలు కూడా ఓ సరుకుగా మారుపోతున్నాయి. అమ్మ, నాన్న, భార్య, భర్త, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, కూతురు, కొడుకు… ఇలా అన్ని బంధాలూ విలువలు కోల్పోతున్నాయి. దీనికి స్నేహం అతీతమేమీ కాదు. మనిషి ఏదో ఒక అవసరంతో స్నేహం చేయడం అనేది నేడు సర్వసాధారణంగా మారిపోయింది. చాలా వరకు స్నేహాలు ఆర్థికపరమైన విషయాల మీదే ఆధారపడి ఉంటున్నాయి. కొంతమంది స్నేహాన్ని తమ అవసరాలకి వాడుకుంటున్నారు. అలాగే కొందరు కులం, మతం, ప్రాంతం ఆధారంగా స్నేహాలు చేస్తుంటారు. కానీ ఇలా ఏర్పడిన స్నేహాలు నిజమైన స్నేహాలు కావు.
మరి ఏది నిజం?
మనం ముందే చెప్పుకున్నట్టు స్నేహం అనేది ఈర్ష్యా, ద్వేషాలకే కాదు కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా ఉన్నప్పుడే అది నిజమైన స్నేహం. కానీ అలాంటి స్వచ్ఛమైన స్నేహం దొరకడం నేడు చాలా కష్టం. కొందరు స్నేహితులు వ్యక్తిగత సమస్యల్లోనే కాదు వారు కోరుకున్న సమాజం, వారు సాధించాలనుకున్న లక్ష్యాలకు కూడా తోడుగా ఉంటారు. అలా ఉన్నప్పుడే అది నిజమైన స్నేహం. కానీ అలాంటి స్నేహాలు సమాజంలో బహు అరుదుగా ఉంటాయి. కానీ అందరి గుండుల్లో చిరకాలం అలా మిగిలిపోయి ఎందరికో స్ఫూర్తినిస్తుంటాయి. అలాంటి స్నేహితులలో మార్స్క్, ఏంగిల్స్ మొదటి స్థానంలో నిలుస్తారు. ఇటువంటి స్నేహాలు కదా నేటి సమాజానికి అవసరమైనవి..!
వయసుతో పని లేదు
ఈర్ష్యా, ద్వేషం, స్వార్థం ఈ మూడు లక్షణాలు లేకుండా ఎవరైతే స్నేహాలు చేస్తారో వారి స్నేహం జీవితకాలం కొనసాగుతుందని నా ఉద్దేశం. ఆ స్నేహితుడు లేదా స్నేహితురాలికి ఎటువంటి సమస్యలు ఎదురైనా వాళ్లకి తోడుగా ఉండాలి. అది ఆర్థిక సమస్య అయినా, సామాజిక సమస్య అయినా తోడుగా ఉండి పరస్పరం సహకరించుకుంటేనే అది చిరకాలం నిలిచిపోతుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే స్నేహం అంటే కేవలం బాల్యంలో మాత్రమే దొరికేది కాదు. అది ఎప్పుడైనా, ఏ వయసులోనైనా మనకు స్నేహం కుదరొచ్చు. కానీ ఈర్ష్యా, ద్వేషం, స్వార్థం లేకుండా ఉండటమే నిజమైన స్నేహం. అలాగే కొందరు తమ తల్లిదండ్రులను, అక్కను, అన్నను, చెల్లిని కూడా స్నేహితులుగా భావిస్తారు. అలా రక్తసంబంధీకులు కూడా మంచి స్నేహితులుగా ఉండొచ్చు. ఏది ఏమైనా మనకు ఎదురయ్యే అలజడులు, ఆనందాలు పంచుకునేందుకు మన జీవితంలో ఓ తోడు ముఖ్యం. అది ఎవరైనా కావొచ్చు.
కారల్ మార్క్స్-ఏంగిల్స్
నిజమైన స్నేహానికి గొప్పన నిర్వచనం కారల్ మార్క్స్, ఏంగిల్స్. మార్స్క్‌కు, ఏంగిల్స్ జీవితాంతం అన్ని వేళలా తోడున్నాడు. వ్యక్తిగత జీవితంలోనే కాదు ఆయన మార్స్క్ ఆశయాలను, లక్ష్యాలను ఈ ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఎంతో కషి చేశాడు. సమసమాజం కోసం తన స్నేహితుడు చేసిన కషిని ప్రపంచం ముందు ఉంచాడు. 1842లో ఒక పత్రికా సంపాదకుడిగా తన జీవితాన్ని ప్రారంభించాడు కార్ల్ మార్క్స్. 1843లో అతని జీవితంలో రెండు గొప్ప పరిణామాలు చోటు చేసుకున్నాయి. వాటిలో మొదటిది జెన్నీతో వివాహం. మరొకటి ఏంగిల్స్‌తో స్నేహం. మార్క్స్ విషయంలో బాధను కలిగించే అతి పెద్ద విషయం ఏమిటంటే ఆర్థిక శాస్త్రంలో గొప్ప వ్యక్తిగా గుర్తింపు పొందిన అతను ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. మార్క్స్ ఇలా ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రతి సమయంలోనూ జెన్నీ అతనికి తోడుగా ఉంది. కట్టుకున్న భార్య కాబట్టి కష్టంలో తోడుగా ఉండడం గొప్ప విషయం ఏమీ కాదు. కానీ ఏంగిల్స్‌కు, మార్క్స్‌తో ఎటువంటి రక్తసంబంధం లేదు. కేవలం వాళ్ళ ఆలోచనలు మాత్రమే కలిసి వారి బంధం గొప్ప స్నేహంగా ఆవిర్భవించింది. మార్క్స్ చివరి దశ వరకు ఏంగిల్స్ అన్ని రకాలుగా సహాయం చేస్తూనే ఉన్నాడు. మార్క్స్ రచనలు చదివిన వారికి అతను ఎంతటి గొప్ప వ్యక్తే అర్థమవుతుంది. భౌతిక వాద భావాలను విశదీకరిస్తూ ‘ది హోలీ ఫ్యామిలీ’, ‘జర్మన్ ఐడియాలజీ’ అనే పుస్తకాలు రాశాడు. ఈ రెండు పుస్తకాలు కూడా ఈ స్నేహితులు ఇద్దరూ కలిసి రాసినవే. 1848లో మార్స్క్ తన ప్రాణ మిత్రుడు ఏంగిల్స్‌తో కలిసి మొత్తం సమాజ తత్వాన్ని గూర్చి తెలిపే ‘కమ్యూనిస్టు మేనిఫెస్టో’ అనే నివేదికను ప్రచురించాడు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఈ పుస్తకం నేడు ప్రతి కవ¶్యనిస్టుకు ఓ దిక్సూచిగా ఉంది. 1859లో మార్క్స్ ‘ద క్రిటిక్ ఆఫ్ పొలిటికల్ ఎకానమీ’ అనే ఒక గొప్ప పుస్తకాన్ని రాశాడు. దీని గురించి ఏంగిల్స్ మాట్లాడుతూ ‘డార్విన్ జీవ పరిణామ సిద్ధాంత సూత్రాన్ని కనుగొన్నట్లుగానే కారల్ మార్క్స్ చరిత్ర అభివద్ధి సూత్రాన్ని కనుగొన్నాడు’ అన్నా. మార్క్స్ తన చివరి రోజుల్లో ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. మార్స్క్ రచించిన దాస్ కాపిటల్ రెండు, మూడు సంపుటాలు అతను మరణించాక ఎంగిల్స్ సంపాదకత్వంలో 1885- 94 మధ్య ప్రచురించబడ్డాయి. అంటే వీరి స్నేహ బంధం ఎంత గొప్పదో చెప్పుకోవచ్చు.
గాంధీ-కల్లెన్‌బాచ్
మహాత్మాగాంధీ, కల్లెన్‌బాచ్ కూడా మంచి మిత్రులు. వీరి స్నేహం సౌత్ ఆఫ్రికాలో చిగురించింది. గాంధీజీ అహింసా వాద సిద్ధాంతాన్ని చూసి అతను చాలా ప్రభావితం చెందారు. ఇద్దరి మధ్య అనేక చర్చలు జరిగేవి. గాంధీతో పరిచయం కాక ముందు ధనవంతుల కుటుంబంలో పుట్టిన కల్లెన్‌బాచ్ విలాస వంతమైన జీవితాన్ని గడిపేవారు. గాంధీ స్నేహంతో ఆదర్శ జీవితం ప్రారంభించారు. అంతే కాదు స్నేహితుడి కోసం మాంసాహారాన్ని కూడా మానేశారు. గాంధీజీ ఆయన్ని తన ‘ఆత్మ సహచరుడు’గా అభివర్ణించారు. గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగొచ్చిన తర్వాత కూడా వీరిరువురూ ఉత్తరప్రత్యుత్తరాల ద్వారా తమ స్నేహాన్ని కొనసాగించారు.
భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్
భారత స్వాతంత్ర పోరాటంలో చురుగ్గా పాల్గొని దేశం కోసం ప్రాణాలర్పించిన వీర కిషోరాలు భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్‌లు. వీరు కూడా గొప్ప మిత్రులు. స్వతంత్ర ఉద్యమంలో ‘మాటకు మాట దెబ్బకు దెబ్బ’ అంటూ బ్రిటిష్ వారి గుండెల్లో సింహస్వప్నంగా నిలిచారు. ‘జీవితాన్ని ప్రేమిస్తాం, మరణాన్ని ప్రేమిస్తాం, మేము మరణించినా ఉరికంబాన్ని ఎగతాళి చేస్తాం, నిప్పు రవ్వల మీద నిద్రిస్తాం. మా రక్తం వృధా కాదు, మా త్యాగం వృధా పోదు’ అంటూ ధైర్యంగా ప్రకటన చేసిన గొప్ప మిత్రులే ఈ ముగ్గురు. దేశం కోసం ఒకటయ్యారు, దేశం కోసమే మరణించారు. ఉరితాడును ముద్దాడుతూ మనిషిని మనిషిగా ప్రేమించే ఓ నూతన ప్రపంచాన్ని వారు వాగ్దానం చేశారు. ఈ నేల విముక్తి కోసం, తెల్లవాళ్లను తరిమేయడం కోసం నవ యువ్వనాన్ని ఇంధనంగా మార్చి పూల దారులు వేశారు.
అమ్మాయిల స్నేహాలు
సాధారణంగా బాల్యంలో ఏర్పడిన స్నేహం జీవితకాలం కొనసాగడం చాలా అరుదు. స్కూల్లో ఏర్పడిన కొన్ని స్నేహాలు తర్వాత కనుమరుగైపోతాయి. కాలేజీలో మళ్లీ కొత్త స్నేహాలు మొదలవుతాయి. అతి తక్కువ మంది మాత్రమే బాల్య స్నేహాలను జీవితాంతం కొనసాగించగలుగుతారు. మరీ ముఖ్యంగా మహిళల్లో ఇలాంటి సమస్య ఎక్కువగా ఉంటుంది. పెండ్లి తర్వాత అమ్మాయికి పుట్టింట్లో ఉండే అవకాశం చాలా తక్కువ. దాని వల్ల చాలా మంది అమ్మాయిలు తమ బాల్య స్నేహాలను కొనసాగించడం అసాధ్యం. నేను ప్రత్యక్షంగా ఓ ఇరవై మంది మగవాళ్ళను, పదిమంది మహిళలను వాళ్ల బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో చెప్పమని అడిగితే వారిలో ఎక్కువ మంది మహిళలు ‘మా బాల్యంలో స్నేహితురాలు ఉండేది. మా పెండ్లయిన తర్వాత ఆరునెలలకో, ఏడాదికో ఒకసారి మాట్లాడుకుంటున్నాం. అంతకుముందు రోజూ మాట్లాడుకునేవాళ్లం’ అని చెప్పారు.
మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ – రాల్ఫ్ అబెర్నాతీ
వీరిద్దరు కూడా జీవితకాలం మిత్రులుగా ఉన్నారు. అమెరికన్ పౌర హక్కుల ఉద్యమంలో పాల్గొన్న ఇద్దరూ స్నేహితులయ్యారు. 1955లో జరిగిన మోంట్‌గోమెరీ బస్సు బహిష్కరణ సమయంలో ఈ ఇద్దరూ కలిసి ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. అట్లాగే వీరిద్దరూ కలిసి వర్ణ వివక్షపై అనేక పోరాటాలు నిర్వహించారు. వీరి వల్ల అమెరికాలో పౌర హక్కుల చట్టం, ఓటు హక్కు చట్టాన్ని తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు. సౌతర్న్ క్రిస్టియన్ లీడర్ షిప్ కాన్ఫరెన్స్ స్థాపనలో వీరిద్దరూ కీలక పాత్ర పోషించారు. అనేక సార్లు జైలు శిక్షలను అనుభవించినా, ప్రాణాపాయ పరిస్థితులు ఎదురైనా వెనకడుగు వేయకుండా ఒకరికి ఒకరు తోడుగా నిలిచారు.
– శరత్ సుదర్శి, 7386046936



