Sunday, September 6, 2026
E-PAPER
Homeకవర్ స్టోరీఅక్ష‍రాస్యతలో మనమెక్కడ..?

అక్ష‍రాస్యతలో మనమెక్కడ..?

- Advertisement -

సెప్టెంబర్ 8న అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం
సమస్త మానవాళికి అక్షరాస్యత, శాంతి, సమర్ధవంతమైన సమాజం అవవసరం. అది ఏర్పాటు చేయాలనే ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం ఉన్న అన్ని దేశాలు ప్రతీ ఏడాది 1967 నుంచి సెప్టెంబర్ 8వ తేదీని ‘అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం’ (ఇంటర్నేషనల్ లిటరసీ డే)గా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది యునెస్కో, హోస్ట్ దేశంగా మెక్సికో సంయుక్తంగా 60వ అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం జరుపుతున్నారు. ఈ సందర్భంగా అందరికీ నాణ్యమైన, సమానమైన విద్య అందించేందుకు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే అక్షరాస్యతలో మన దేశం ఎక్కడుంది? అది వెదికేందుకో నేడు జెన్‌‌ జీ నడుంకట్టింది. దేశం సంపూర్ణ అక్షరాస్యతను సాధించేందుకు పునాదులైన పాఠశాలలను కాపాడండీ అంటూ బడిబాట పట్టింది.

2030 నాటికి విద్యా పరంగా ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలైన.. అందరికీ చదవడం, రాయడం, నాణ్యమైన విద్య, అసమానతల తగ్గింపు వంటి లక్ష్యాలను సాధించడానికి ‘లిటరసీ ఫర్ పీపుల్, ది ప్లానెట్ అండ్ ప్రోస్పరటీ’ అనే థీమ్‌తో ప్రపంచవ్యాప్తంగా నిర్వహించనుంది. జ్ఞాన సముపార్జన కోసం, నైపుణ్యాలు, విలువలు, మంచి వైఖరులు, మంచి ప్రవర్తన రూపొందించుకోవడం కోసం, సంస్కృతి పరిరక్షణ, శాంతి కొరకు విద్య అవసరమని గుర్తించి ప్రపంచ జనాభాకు అక్షరాస్యత అందించడానికి యునెస్కోతోపాటు ఆయా దేశాల ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు శతాబ్దాలుగా కృషి చేస్తున్నాయి. అందరికీ చదువు అనేది మానవహక్కుగా ప్రకటించారు. అయినప్పటికీ నేటికీ అనేక దేశాల్లో అందరికీ విద్య అందుబాటులో లేదు.
ప్రపంచ వ్యాప్తంగా పరిశీలిస్తే
21వ శతాబ్దం ప్రారంభంమై సుమారు 26 ఏండ్లు పూర్తి అవుతున్నా 2024 గణాంకాలు ప్రకారం ప్రపంచ జనాభాలో సుమారు 739 మిలియన్ల మందికి కనీసం ‘బేసిక్ లిటరసీ’ లేదు అని తెలుస్తోంది. ప్రతీ 10 మందిలో నలుగురికి చదవడం రాదు. 2023 సర్వే ప్రకారం సుమారు 272 మిలియన్ల మంది బడి ముఖం చూడలేదు అని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా సగటున 15 ఏండ్లు దాటిన వారిలో అక్షరాస్యత 87.7 శాతంగా ఉంది. అభివృద్ధి చెందిన దేశాల్లో అక్షరాస్యత 99 శాతంగా ఉండగా, సబ్ సహారా, ఆఫ్రికా, దక్షిణ ఆసియా దేశాల్లో అతి తక్కువ అక్షరాస్యత ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. యువతలో దాదాపు వంద శాతం అక్షరాస్యత కలిగిన దేశాలుగా ఉజెబికిస్తాన్, నార్వే, కొరియా, ఫిన్లాండ్, లిచిస్తాన్ వంటివి ముందువరుసలో నిలిచాయి. అతి తక్కువ అక్షరాస్యత (లోయస్ట్ లిటరసీ) కలిగిన దేశాలుగా 27 శాతం అక్షరాస్యతతో సౌత్ సూడాన్, 31 శాతంతో ఛాద్, 35 శాతంతో మాలి, 37 శాతం అక్షరాస్యతతో నైజర్ వంటి దేశాలు ప్రపంచ వ్యాప్తంగా దిగువ స్థాయిలో ఉన్నాయి. ఇక ‘రీజియన్’ ప్రకారం అక్షరాస్యత పరిశీలిస్తే తూర్పు ఆసియా, పసిఫిక్ ప్రాంతంలో ఉన్న దేశాలు 96 శాతం అక్షరాస్యత కలిగి ముందంజలో ఉన్నాయి. తదుపరి స్థానాల్లో 94 శాతం అక్షరాస్యతతో లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాలు, 74 శాతం అక్షరాస్యతతో సౌత్ ఏషియా దేశాలు, చివరిగా 66 శాతం అక్షరాస్యతతో సబ్ సహారా ప్రాంత దేశాలు ఉన్నాయి.

బడ్జెట్ కేటాయింపులు
ఇక ప్రపంచ వ్యాప్తంగా విద్య కొరకు అత్యధికంగా బడ్జెట్ కేటాయింపులు చేసే దేశంగా అమెరికా నిలిచింది. సుమారు 1.35 బిలియన్ అమెరికన్ డాలర్లు ఖర్చు చేస్తున్నారు. అదే సమయంలో దేశ జీడీపీలో అత్యధికంగా సుమారు 7.5 శాతం నిధులు విద్యకు కేటాయించిన దేశంగా స్వీడన్ నిలిచింది. ఒక్కో విద్యార్ధి విద్య కొరకు అత్యధికంగా ఖర్చు చేస్తున్న దేశంగా లక్సెంబర్గ్‌‌ని చెప్పుకోవచ్చు. ఇక మన ఇండియాలో ఈ 2026-27 బడ్జెట్‌లో విద్య కొరకు 1,39,289.48 కోట్ల రూపాయలు అనగా మొత్తం బడ్జెట్‌లో కేవలం 2.6 శాతం మాత్రమే విద్య కొరకు కేటాయించారు. అంటే మన పాలకులు విద్యకు ఎంతటి ప్రాధాన్యం ఇస్తున్నారో దీన్ని బట్టి తెలుస్తుంది.

వికసిత్‌ ‌భారత్‌ ఎలా సాధ్యం..?
సుమారు 145 కోట్ల మంది ఉన్న మనదేశ జనాభాకు ఈ కేటాయింపులు ఏమాత్రం సరిపోవు అని అందరికీ తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మొత్తం మీద విద్యారంగానికి ఖర్చు చేస్తున్న నిధులు జీడీపీలో 4.1 శాతంగా ఉంది. మరి మన పాలకులు 2047 నాటికి వికసిత భారత్ సాధిస్తామని లక్ష్యంగా పెట్టుకున్నారు. విద్య, క్రీడలు, ఆరోగ్యం కోసం కేవలం కొద్ది మొత్తంలో నిధులు కేటాయించిన పాలకులు ఈ లక్ష్యాన్ని ఎలా చేరుకుంటారో ఆలోచించాలి. కొఠారి కమిషన్ దేశ జీడీపీలో విద్య కోసం కనీసం 6 శాతం నిధులు కేటాయించాలని ఎన్నో ఏండ్ల కిందట సూచించింది. దీన్ని అమలు చేస్తే తప్ప దేశంలో అక్షరాస్యత పెరిగే అవకాశం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి సన్నాహాలు చేయాలనీ, కామన్ స్కూల్ సిస్టం అమలుకు ప్రణాళిక సిద్ధం చేయాలని ఈ అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం సందర్భంగా డిమాండ్ చేద్దాం. ప్రస్తుతం ‘పి.యం. కేర్ నిధులు’ల్లో నిల్వ ఉన్న 8,452 కోట్ల రూపాయలతో కొన్ని వేల పాఠశాలలకు అనేక సౌకర్యాలు కల్పించవచ్చు. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తే బాగుంటుంది.

మరింత లోతుగా పరిశీలిస్తే…
మన దేశంలో 7 ఏండ్లు దాటి చదివిన యువతలో ఉన్న అక్షరాస్యత 80.9 శాతంగా ఉన్నట్లు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పి.ఎల్.ఎఫ్.యస్) తెలిపింది. వీరిలో పురుషులు 87.2 శాతం అక్షరాస్యత కలిగి ఉండగా, మహిళలు 74.6 శాతంగా ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో అక్షరాస్యత 88.9 శాతం ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో అక్షరాస్యత 77.5 శాతంగా ఉంది. నేటికీ అనేక పాఠశాలలో తగినంత మంది ఉపాధ్యాయులు లేరు. మౌలిక సదుపాయాలు లేవు. నేటికీ మనదేశంలో సుమారు లక్ష పాఠశాలలు సింగిల్ టీచర్ స్కూల్‌గా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో దేశాభివృద్ధి ఎలా సాధ్యం..! మన దేశ తలసరి ఆదాయం పెరిగి, అభివృద్ధి చెందిన దేశంగా ఎప్పుడు మారుతుందో బిలియన్ డాలర్ల ప్రశ్న.?

దేశంలో పాఠశాలల దుస్థితి
యు.డి.ఐ.యస్.ఈ సర్వే ప్రకారం దేశంలో 14,71,473 పాఠశాలలు ఉన్నాయి. తాజాగా పార్లమెంట్ సమాచారం ప్రకారం దేశంలో 12,34,788 పాఠశాలలు ఉన్నాయి.‌ సరిపడా తరగతి గదులు లేక జార్ఖండ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో తరగతులు కిక్కిరిసిన విద్యార్థులతో నిండిపోతున్నాయి. జార్ఖండ్‌లో విద్యార్ధి – ఉపాధ్యాయ నిష్పత్తి 47:1గా ఉంది. దాదాపు దేశంలో లక్షకు పైబడి ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉండటం వల్ల ఒకే ఉపాధ్యాయుడు అన్ని తరగతులకు, అన్ని సబ్జెక్టులు బోధించడం కష్టమవుతుంది. దాని వల్ల పిల్లలకు నాణ్యమైన విద్య లభించడం లేదు. 1.19 లక్షల పాఠశాలలకు నేటికీ విద్యుత్ సౌకర్యం లేదని సమాచారం. నీతి ఆయోగ్ గణాంకాలు ప్రకారం దేశంలో 8592 పాఠశాలల్లో బాలికలకు మరుగుదొడ్లు లేవు. అందుకే బాలికలకు పై తగతులకు రాకుండా ‘డ్రాప్ అవుట్’ అవుతున్నారు. ఇక 61,000 పాఠశాలలు సరైన మూత్రశాలలు లేక మురికి కూపాలుగా ఉన్నాయి. 59,829 పాఠశాలల్లో ‘హేండ్ వాష్’ సౌకర్యాలు లేవు. నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో 44.9 శాతం పాఠశాలలకు ‘ఇంటర్నెట్’ సౌకర్యం లేదు. కంప్యూటర్ బోధకులు లేరు. దేశంలో దాదాపు 51% శాతం పాఠశాలల్లో సైన్స్ లేబరేటరీలు లేవు. దాదాపు 60 శాతం పాఠశాలల్లో వికలాంగులకు అవసరమైన ర్యాంప్, ప్రత్యేక మూత్రశాలలు లేకపోవడంతో వీరు చదువుకు దూరంగా ఉంటున్నారు. కనీసం గ్రామ సర్పంచ్లు కూడా వారి వారి గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సౌకర్యాలు విషయంలో శ్రద్ధ తీసుకోకపోడం బాధాకరం. దేశంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సౌకర్యాలు తెలుసుకునే ఉద్దేశంతో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు, యువత ఆగష్టు 19వ తేదీ నుంచి ‘స్కూల్ ఠీక్ కరో’ పేరుతో కార్యక్రమం చేపట్టారు. అయితే కొన్ని రాష్ట్రాల్లో పాఠశాలల్లోకి రానీయకుండా వీరిని అడ్డుకుంటున్నారు. దీనికి నేటి పాలకులే సమాధానం చెప్పాలి.

తెలుగు రాష్ట్రాలలో…
ఇక మనదేశంలో అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా ‘మిజోరాం 98.2 శాతం అక్షరాస్యతతో ముందు వరుసలో ఉంది. అలాగే అక్షద్వీప్ 97.3 శాతంతో తదుపరి స్థానంలో. ఆ తర్వాత కేరళ 95.3 శాతం అక్షరాస్యతతో నిలిచింది. అతి తక్కువ అక్షరాస్యతలో ఆంధ్రప్రదేశ్ 72.6%, తర్వాత 74.3 శాతంతో బీహార్ నిలిచింది. అయితే నాడు – నేడు కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో గత వై.యస్.ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పాఠశాలల్లో కొన్ని సౌకర్యాలు కల్పించింది. అమ్మ ఒడి పథకం ద్వారా తల్లుల అకౌంట్‌లో పది హేను వేల రూపాయలు జమచేసారు. గత ప్రభుత్వాలకంటే మెరుగైన సౌకర్యాలు కల్పించారు. కానీ ఒక్క ఆంగ్ల మాధ్యమమే పెట్టడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇక ప్రస్తుత కూటమి ప్రభుత్వం అమలులోకి వచ్చి, పిల్లలు ఎంతమంది ఉన్నా అందరికీ ‘తల్లికి వందనం’ పేరుతో తల్లుల ఖాతాలో ప్రతీ ఏడాది, ప్రతీ విద్యార్థికి 13 వేల రూపాయలు నగదు రూపంలో డబ్బులు జమ చేస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకం, ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోట్సులు, యూనిఫాం, షూలు వంటివి ఇవ్వడం ద్వారా విద్యాభివృద్ధికి కొంత కృషి చేస్తున్నారు. అయితే తరచూ ఉపాధ్యాయులచే ఆన్లైన్ పనులు, డేటా ఎంట్రీ, ప్రతీదీ అప్లోడ్ చేయించడం వంటి బోధనేతర పనులతో విద్యను కుంటుపడేటట్లు చేస్తున్నారు. అంతేకాదు ఒకే ఆంగ్ల మాధ్యమం కొనసాగింపు, 9 రకాల పాఠశాలలు ఏర్పాటు చేయడంతో విద్యా విధానం నత్తనడకన సాగుతోంది. పి-4, టెట్ వంటి సమస్యలు ఉపాధ్యాయులను వెంటాడుతూనే ఉంది. ఈ 2026-27 ఆర్థిక ఏడాదిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్లో 38,845 కోట్ల రూపాయల మాత్రమే కేటాయించారు. తెలంగాణ ప్రభుత్వం 26,674 కోట్ల రూపాయలు కేటాయించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, మధ్యాహ్న భోజన పథకంతోపాటు బ్రేక్ ఫాస్ట్ వంటివి ఏర్పాటు చేశారు. ఇక ఎప్పుడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాదిలో పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను, పాఠశాలలను ప్రోత్సాహిస్తూ వివిధ దినపత్రికలు, టీవీల ద్వారా అడ్వర్టైజ్ చేయించి కొంత మంచి ప్రయత్నం చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం టెట్ రద్దుకు, సి.పి.యస్ రద్దుకు తగు చర్యలు తీసుకుని, ఉపాధ్యాయులపై ఉన్న ఒత్తిడి తొలగించడం ద్వారా విద్యా ప్రమాణాలు మెరుగు పడటానికి దోహదం అవుతుంది. అలాగే విద్యా రంగంలో ఉన్న వివిధ సమస్యలు పరిష్కారం చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించడానికి, లిటరసీ ఫర్ ఆల్ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయవలసి ఉంది.

టీచర్ స్టూడెంట్ రేషియో
ప్రపంచ వ్యాప్తంగా టీచర్ స్టూడెంట్ రేషియో పరిశీలిస్తే.. అభివృద్ధి చెందిన దేశాల్లో 14:1 ప్రాధమిక స్థాయిలో, సెకండరీ స్థాయిలో 13:1 గా ఉంది. మన దేశంలో ప్రాధమిక స్థాయిలో 19:1 గా, సెకండరీ స్థాయిలో 21:1గా, ఇంటర్మీడియట్‌లో 23:1 గా, కళాశాల స్థాయిలో 19:1 గా ఉంది. ఇక నార్వే, గ్రీస్ దేశాల్లో ప్రతి పది మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండగా, అమెరికా, మెక్సికోలో 16 నుంచి 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండటం గమనించదగిన విషయం. భారత దేశంలో ఏకోపాధ్యాయ సింగిల్ టీచర్ స్కూల్స్ సుమారు 1,04,000 పైబడి ఉన్నాయి.‌‌ వీటిలో అధిక సంఖ్యలో ఆంధ్రప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలు మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.

స్ఫూర్తిదాయక ఉపాధ్యాయులు
ఈ ఏడాది ‘గ్లోబల్ టీచర్ ప్రైజ్ విన్నర్’గా మన భారతదేశం నుంచి ప్రముఖ విద్యా వేత్త ‘రౌబుల్ నాగి’ ఎన్నికవడం ప్రోత్సాహించతగినది. వీరు ముఖ్యంగా వెనుకబడిన గ్రామాల్లో, అల్ప ఆదాయం వర్గాల్లో సుమారు 800 విద్యా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పది లక్షల మంది విద్యార్థులకు చదువు అందించడంతోపాటు డ్రాప్ అవుట్ చిల్డ్రన్‌ను తిరిగి పాఠశాలకు రప్పించడం వంటివి చేసారు. గతంలో కేరళలో ‘శైలజా టీచర్’ కూడా స్ఫూర్తిదాయక టీచర్‌గా మన్నలను పొందారు. ఇటువంటివి దేశంలో సంపూర్ణ అక్షరాస్యత సాధనకు తోడ్పడుతాయి. ఉపాధ్యాయులకు ప్రేరణ కలిగిస్తాయి. ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వ విద్యారంగాన్ని, పాఠశాలలో ఎన్రోల్మెంట్ పెంచే డ్రైవ్ చేయడానికి మార్చి నెల నుంచే రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛందంగా కార్యక్రమం చేపట్టారు. ఇది మంచి ఫలితాలు ఇచ్చింది. ఉపాధ్యాయులతో పాటు ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు తీసుకోవడం అవసరం. డి.యస్.సి ద్వారా ఖాళీ పోస్టుల భర్తీకి త్వరగా నిర్ణయం తీసుకోవాలి. ముఖ్యంగా క్రీడలకు నిధులు, ప్రోత్సాహం కల్పించాలి. తల్లిదండ్రులు కూడా కేవలం పిల్లల మార్కులు, గ్రేడులపైనే కాకుండా, మానస వికాసానికి కృషి చేయాలి. విదేశాల్లో చదువులు, ప్యాకేజీలపై, జీతాలపై ఎక్కువగా దృష్టి సారించకుండా వారి ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలి.

విద్యా కార్పొరేటీకరణను అరికట్టాలి
నోబుల్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఫిన్లాండ్, దక్షిణ కొరియా, సింగపూర్, అమెరికా, బ్రిటన్ ముందు వరుసలో ఉన్నాయి. ప్రపంచ విద్యా ర్యాంకుల్లో దక్షిణ కొరియా, డెన్మార్క్, బ్రిటన్, జపాన్, కెనడా ముందు వరుసలో నిలబడగా మనదేశం 35వ ర్యాంకులో ఉంది. ఇకనైనా మన పాలకులు విద్యా రంగంలో పలు మార్పులకు శ్రీకారం చుట్టాలి. ప్రస్తుతం జెన్‌ ‌జీ దేశవ్యాప్తంగా విద్యా రంగంలో ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా ఒక దేశ అభివృద్ధి ఆ దేశ విద్యాభివృద్ధిపైనే ఆధారపడి ఉంటుంది అని గ్రహించాలి. ఇప్పుటికే దేశవ్యాప్తంగా విద్యారంగం ప్రైవేటీకరణ, కార్పోటీకరణ, కాషాయకరణ జరిగిపోయింది. విద్య వ్యాపారంగా మారిపోయింది. పోటీ పరీక్షలు, వివిధ రకాల పరీక్షలు లీక్ చేస్తూ పేద, మధ్యతరగతి విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్నారు. ఇకనైనా పాలకులు ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి సన్నాహాలు చేయాలి. బడ్జెట్లో నిధులు అధికంగా కేటాయించి ఖర్చు చేయాలి. 2020 యన్.ఈ.పిలో అసంబద్ధాలు సవరించాలి. అర్హులైన వారిని వైఎస్ ఛాన్సలర్‌గా నియమించాలి. విద్యా రంగంలో, విశ్వవిద్యాలయాల్లో కుల మత భాష వంటి వివక్షతను తొలగించాలి.

‌శాస్త్రీయ విద్య కావాలి
అందరికీ సమానమైన, నాణ్యమైన, శాస్త్రీయ, సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విద్య అందించాలి. మూఢ నమ్మకాలు, అంధ విశ్వాసాలు తొలగించి, శాస్త్రీయ స్పృహ కలిగిన పాఠ్యాంశాలను ప్రవేశపెట్టాలి. చరిత్రను వక్రీకరించే విధానం తొలగించి, సిలబస్‌ను వాస్తవాల ఆధారంగా తయారు చేయాలి. రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రభుత్వాలు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించే విద్యను అందించాలి. వీటన్నింటినీ గుర్తిస్తూ ఈ అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం జరుపుకోవడం సమంజసంగా ఉంటుంది. విద్యా హక్కు చట్టం, బాల కార్మిక నిరోధక చట్టం పటిష్టంగా అమలు చేయాలి. రాజ్యాంగ ఆదేశిక సూత్రాలు ప్రకారం అందరికీ నాణ్యమైన, సమానమైన హక్కుగా విద్యను అందించాలి. అంతేగానీ తమ ఓటు బ్యాంకు రాజకీయాలకు విద్యను ఓ సాధనంగా వాడుకోవడం సరైనది కాదు. జ్యోతిరావు పూలే, సావిత్రి బాయి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా గాంధీజీ, నెల్సన్ మండేలా, మరెందరో మహానుభావులు, సంఘసంస్కర్తలు, విద్యావేత్తలు అక్షరాస్యత ద్వారానే సుస్థిర అభివృద్ధి, సమసమాజం ఏర్పడుతుందని చెప్పిన మాటలను ప్రభుత్వాలు గుర్తు పెట్టుకోవాలి.

ఐ.ప్రసాదరావు, 9390509791

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -