ప్రతి సంవత్సరం ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటున్నాం. భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జన్మదినం దీనికి నేపథ్యం. అయితే ఈ రోజును కేవలం ఒక క్రీడాకారుడిని స్మరించుకునే రోజుగా పరిమితం చేయడం సరైంది కాదు. 140 కోట్లకు పైగా జనాభా ఉన్న భారతదేశం ప్రపంచ క్రీడా రంగంలో తన పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకుంటుందా? ఈ ప్రశ్నకు సమాధానం కనుగొనాలంటే భావోద్వేగాల కంటే అంకెలను, పతకాల సంఖ్యను, పెట్టుబడులను, క్రీడాకారుల సంఖ్యను, మౌలిక సదుపాయాలను పరిశీలించాలి.
భారతదేశం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం. ఇంత పెద్ద జనాభా ఉదంటే సాధారణంగానే అపారమైన క్రీడా ప్రతిభ మనకు అందుబాటులో ఉందని అర్థం. కానీ జనాభా ఎక్కువగా ఉండటం మాత్రమే క్రీడా విజయాన్ని ఇవ్వదు. ప్రతిభ, గుర్తింపు, శిక్షణ, పోటీ, శాస్త్రీయ సహాయం, అంతర్జాతీయ స్థాయిలో ఎదగడం లాంటివి ఉన్నప్పుడే పతకాలు వస్తాయి. ఇక్కడే భారతదేశం ఓ ప్రధాన సమస్య ఎదుర్కొంటోంది. మన దేశంలో ప్రతిభకు కొరత లేదు. ప్రతిభను వ్యవస్థగా మార్చడంలోనే అనేక లోపాలున్నాయి.
140 కోట్ల జనాభా.. ఆరు పతకాలు
2024 పారిస్ ఒలింపిక్స్ భారత క్రీడా చరిత్రలో ఓ ముఖ్యమైన అధ్యాయంగా చెప్పుకోవచ్చు. భారతదేశం మొత్తం ఆరు పతకాలు సాధించింది. అందులో ఒకటి రజత పతక, ఐదు కాంస్య పతకాలు. అన్నీ కలిపితే ఆరు పతకాలు. నీరజ్ చోప్రా జావెలిన్ త్రోలో రజత పతకం సాధించారు. షఉటింగ్‌లో భారతదేశానికి మూడు పతకాలు రావడం ప్రత్యేకంగా గమనించదగిన విషయం. ఒకే ఒలింపిక్స్‌లో ఆరు పతకాలు రావడం విజయమే. కానీ ప్రపంచ క్రీడా శక్తుల ప్రమాణంతో చూస్తే ఇది భారతదేశ సామర్థ్యానికి పూర్తి ప్రతిబింబం కాదు. 140 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశానికి ఆరు ఒలింపిక్ పతకాలు. ఈ నిష్పత్తి మనకు ఒక విషయం చెబుతోంది. భారతదేశం ఇంకా ప్రతిభ కలిగిన దేశం నుంచి వ్యవస్థాపితంగా క్రీడా శక్తిగా మారాల్సి ఉంది.
అత్యుత్తమ పారా ఒలింపిక్ ప్రదర్శన
గతంలో భారత ఒలింపిక్ విజయాలు ప్రధానంగా హాకీ చుట్టూ తిరిగేవి. ఇప్పుడు పరిస్థితి మారింది. భారతదేశం పతకాలు సాధిస్తున్న క్రీడల పరిధి విస్తరిస్తోంది. షూటింగ్, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, బాక్సింగ్, వెయిట్‌లిఫ్టింగ్, ఆర్చరీ, టేబుల్ టెన్నిస్, పారా స్పోర్ట్స్ వంటి విభాగాల్లో భారతదేశం పోటీ సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. ఇది చాలా ముఖ్యమైన మార్పు. ఒకే క్రీడపై ఆధారపడే దేశం కంటే 10-15 క్రీడల్లో బలమైన దేశం ఒలింపిక్స్‌లో స్థిరంగా పతకాలు సాధించగలదు. భారతదేశ క్రీడా ప్రస్థానంలో అత్యంత ప్రేరణాత్మకమైన అంకెలు పారిస్ 2024 పారా ఒలింపిక్స్‌లో కనిపించాయి. భారతదేశం 7 స్వర్ణాలు ం 9 రజతాలు ం 13 కాంస్యాలు = 29 పతకాలు సాధించింది. ఇది భారతదేశానికి అత్యుత్తమ పారా ఒలింపిక్ ప్రదర్శన. 2020 టోక్యో పారా ఒలింపిక్స్‌లో భారత్ సాధించిన పతకాల సంఖ్య 19. అంటే 2024లో 29కి పెరిగింది. పతకాల సంఖ్యలో 10కి పెరిగింది. శాతంగా చూస్తే సుమారు 52.6% పెరుగుదల. ఇది సాధారణ పెరుగుదల కాదు. అదే సమయంలో భారత్ పారా బృందంలో పారిస్ 2024లో 84 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. 52 మంది పురుషులు, 32 మంది మహిళలు. ఈ అంకెలు ఒక ముఖ్యమైన సామాజిక మార్పును సూచిస్తున్నాయి. అవకాశం ఇచ్చినప్పుడు శారీరక వైవిధ్యం ఉన్న క్రీడాకారులు కూడా ప్రపంచ స్థాయిలో భారతదేశానికి పతకాలు తీసుకురాగలరు.
క్రీడలకు బడ్జెట్ ఇలా…
క్రీడా రంగానికి ప్రభుత్వ పెట్టుబడులు పెరుగుతున్నాయి. 2025-26 బడ్జెట్ అంచనాల్లో ఖేల్ ఇండియాకు రూ.1,000 కోట్ల కేటాయింపు ఉండగా, 2026-27 బడ్జెట్ అంచనాల్లో అది రూ.924.35 కోట్లుగా ఉంది. రూ.924 కోట్లతో ఎన్ని మైదానాలు? ఎన్ని కోచ్‌లు? ఎన్ని శిక్షణా కేంద్రాలు? ఎన్ని గ్రామీణ ప్రతిభలు? ఎంత మంది అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు? అంటే కేటాయింపు ఎంత అన్నదానికంటే ప్రతి రూపాయి ఫలితం ఏమిటి అనేది ముఖ్యం. క్రీడా బడ్జెట్‌ను పతకాలుగా మార్చే సామర్థ్యం పెరగాలి.
పెద్ద మార్పు అవసరం
భారతదేశంలో క్రికెట్‌కు ఉన్న ప్రజాదరణను ఎవరూ తిరస్కరించలేరు. క్రికెట్‌కు భారీ ప్రేక్షకాదరణ, భారీ ప్రసార మార్కెట్, ప్రైవేట్ పెట్టుబడులు, స్పాన్సర్‌షిప్‌లు, అత్యున్నత స్థాయి మౌలిక సదుపాయాలు లభిస్తున్నాయి. ఇది భారతదేశానికి బలం. అయితే క్రికెట్‌లో ఏర్పడిన ఆర్థిక శక్తిని ఇతర క్రీడల అభివృద్ధికి అనుసంధానం చేయాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో లక్షలాది గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లో పరుగుల ప్రతిభ, రెజ్లింగ్ ప్రతిభ, బాక్సింగ్ ప్రతిభ, విలువిద్య ప్రతిభ, వెయిట్‌లిఫ్టింగ్ ప్రతిభ ఉండవచ్చు. కానీ మైదానం లేకపోతే? కోచ్ లేకపోతే? పరికరాలు లేకపోతే? పోషకాహారం లేకపోతే? ఆ ప్రతిభ అంతా గణాంకాల్లోకి రాదు. అందుకే భారత క్రీడా విధానంలో ఒక పెద్ద మార్పు అవసరం. పతకం వచ్చిన తర్వాత క్రీడాకారుడిని వెతకడం నుంచి పతకం సాధించగల ప్రతిభను పది సంవత్సరాల ముందే గుర్తించడం వైపు వెళ్లాలి.
వ్యవస్థ మరింత బలపడాలి
ప్రపంచ స్థాయి క్రీడలో ఒక సెకను, ఒక సెంటీమీటర్, ఒక కిలోగ్రామ్ కూడా పతకాన్ని నిర్ణయించగలదు. అందుకే ఆధునిక క్రీడాకారుడికి కేవలం కోచ్ సరిపోడు. భారతదేశం ఈ వ్యవస్థను మరింత విస్తతంగా గ్రామీణ, జిల్లా స్థాయికి తీసుకెళ్లాలి. పారిస్ 2024 ఒలింపిక్స్‌లో 6 పతకాలు. పారిస్ 2024 పారా ఒలింపిక్స్‌లో 29 పతకాలు. 2026-27లో ఖేల్ ఇండియా కోసం రూ.924.35 కోట్ల బడ్జెట్ అంచనా. మనం ఇంకా ప్రపంచ అగ్ర క్రీడా దేశాల స్థాయికి చేరాల్సి ఉందని, సరైన అవకాశాలు, శిక్షణ లభిస్తే భారతదేశం ఎంతటి సామర్థ్యాన్ని చూపగలదో, రూ.924.35 కోట్లు భవిష్యత్తు కోసం ప్రభుత్వం పెట్టుబడి పెడుతున్నప్పటికీ ఆ పెట్టుబడిని ఫలితాలుగా మార్చే వ్యవస్థ మరింత బలపడాల్సి ఉంది.
ప్రతి పాఠశాలలో క్రీడా మైదానం
క్రీడల విజయాన్ని కేవలం ఒలింపిక్ పతకాల సంఖ్యతో కొలవడం కూడా తప్పు. ఒక గ్రామంలోని 100 మంది పిల్లలు ప్రతిరోజూ ఆడటం మొదలుపెడితే అది కూడా క్రీడా విజయం. ఒక పాఠశాలలో 50 మంది బాలికలు క్రీడల్లోకి వస్తే అది కూడా విజయం. ఒక పారా క్రీడాకారుడికి మొదటిసారి అంతర్జాతీయ స్థాయి మైదానం లభిస్తే అది కూడా విజయమే. క్రీడను అదనపు కార్యకలాపంగా కాకుండా విద్యలో భాగంగా చూడాలి. ప్రతి జిల్లాలో స్పోర్ట్స్ సైన్స్ కేంద్రం ప్రతిభను శాస్త్రీయంగా గుర్తించి శిక్షణ ఇవ్వాలి. గ్రామీణ ప్రతిభకు ప్రత్యేక నిధులు కేటాయించాలి. ఆర్థిక పరిస్థితి కారణంగా ప్రతిభ ఆగిపోకూడదు. మహిళలు, పారా క్రీడాకారులకు సమాన అవకాశాల, మౌలిక సదుపాయాలు, కోచింగ్, ప్రయాణం, పరికరాలు అందుబాటులో ఉండాలి. 10-15 సంవత్సరాల జాతీయ క్రీడా ప్రణాళిక ఒక ఒలింపిక్స్ కోసం కాదు. కనీసం 2-3 ఒలింపిక్ చక్రాల కోసం ప్రణాళిక రూపొందించాలి.
మన లక్ష్యం ఎలా ఉండాలి?
ఆగస్టు 29న ధ్యాన్‌చంద్‌ను స్మరించుకోవడం మాత్రమే జాతీయ క్రీడా దినోత్సవం కాదు. భారతదేశం తన క్రీడా సామర్థ్యాన్ని ఎంతవరకు వినియోగించు కుంటుందో లెక్కలు వేసుకునే రోజు కూడా. బడ్జెట్‌లో ఖేలో ఇండియా కేటాయింపు భారత క్రీడా రంగంలో ఒకేసారి విజయాన్ని, అవకాశాన్ని, లోపాన్ని చూపిస్తున్నాయి. భారతదేశానికి ప్రతిభ ఉంది. యువత ఉంది. ఆర్థిక సామర్థ్యం పెరుగుతోంది. క్రీడలపై ఆసక్తి పెరుగుతోంది. ప్రభుత్వ పెట్టుబడులు ఉన్నాయి. కానీ లోపం ఎక్కడ జరుగుతుందో ఆలోచించడం లేదు. భారతదేశం ప్రపంచ క్రీడా శక్తిగా ఎదగాలంటే మన లక్ష్యం కొంతమంది క్రీడాకారులు పతకాలు సాధించడం కాకూడదు. ప్రతి పాఠశాలలో క్రీడాకారుడు, ప్రతి జిల్లాలో శిక్షణా కేంద్రం, ప్రతి గ్రామంలో మైదానం, ప్రతి ప్రతిభకు అవకాశం, ప్రతి క్రీడలో ప్రపంచ స్థాయి పోటీ సామర్థ్యం మన లక్ష్యంగా ఉండాలి. అప్పుడు మాత్రమే 140 కోట్ల భారతదేశం తన జనాభా బలాన్ని క్రీడా శక్తిగా మార్చుకున్న దేశంగా ప్రపంచానికి కనిపిస్తుంది. అదే నిజమైన జాతీయ క్రీడా దినోత్సవం.
స్పోర్ట్స్ అకాడమీలు ఏర్పాటు చేయాలి
భారత్‌లో క్రికెట్ వంటి ఆటలతో పోలిస్తే జాతీయ క్రీడ హాకీకి కూడా చెప్పుకోదగిన ప్రోత్సాహం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించడానికి తగు చర్యలు తీసుకోవాలి. క్రీడా వ్యవస్థాపకతకు మనదేశం గొప్ప సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇటీవల మహిళా క్రీడాకారులు అంతర్జాతీయం క్రీడా వేదికలపై సత్తా చాటి పతకాల వేటలో ముందుండడం సానూకూలాంశం. ఇప్పటికే భారతదేశంలో శారీరక ఆరోగ్యం, క్రీడలను ప్రోత్సహించడానికి ప్రవేశపెట్టిన ‘ఫిట్ ఇండియా’, ‘టార్గెట్ ఒలింపిక్స్ పోడియం’, ‘ఖేలో ఇండియా’ లాంటి కార్యక్రమాలను క్రీడలను ప్రోత్సహించినా ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విరివిగా స్పోర్ట్స్ అకాడమీలను ఏర్పాటు చేయాలి. వీటిలో మౌలిక వసతులను కల్పించి, ప్రపంచస్థాయి శిక్షకులతో క్రీడాకారులకు శిక్షణ ఇవ్వాలి. ప్రతి మండలానికి ఒక క్రీడా పాఠశాలలను ఏర్పాటు చేసి గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలి.
పోషకాహార సమస్య
ఆటలకు శారీరక దృఢత్వం ముఖ్యం. కానీ, భారత్‌లో పోషకాహార సమస్య వేధిస్తోంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే -5 ప్రకారం ఐదు సంవత్సరాలలోపు పిల్లల్లో వయస్సుకు తగిన బరువులేనివారు 32.1శాతం ఉండగా, ఎత్తులేనివారు 35.5 శాతం ఉన్నారు. పిల్లల్లో ఊబకాయం సైతం పెరుగుతోంది. ఫలితంగా సజన, చురుకుదనం లేని బలహీన బాలభారతం తయారవుతున్నది. సమాజంలో వేళ్లూనుకున్న సామాజిక, ఆర్థిక అంతరాలు క్రీడాకారుల పాలిట పెనుశాపంగా మారాయి. ముఖ్యంగా ఆటలకు బీజం పడాల్సిన పాఠశాల స్థాయిలో సరైన ఆటస్థలం, తగిన ప్రోత్సాహం లేకపోవడం, శరీర దారుఢ్యానికి కావాల్సిన పౌష్టికాహారం, శిక్షణ సదుపాయాల కొరత, ఎంపికలో పారదర్శకత లోపించడం లాంటి ఇతర సమస్యలు క్రీడలకు ఆమోదయోగ్యమైన కౌమారదశలో క్రీడాస్ఫూర్తిని దెబ్బతీస్తున్నాయి. ఈ పరిణామాలు ఒలింపిక్ క్రీడలులాంటి అంతర్జాతీయస్థాయి క్రీడాపోటీలలో భారత్ పెద్దగా రాణించలేక పోవడానికి ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి.

మహిళా క్రీడా అభివృద్ధి
భారత మహిళా క్రీడాకారిణుల ప్రస్థానం కూడా గణనీయంగా మారింది. మేరీ కోమ్, సైనా నెహ్వాల్, పి.వి. సింధు, సాక్షి మాలిక్, మను భాకర్ వంటి క్రీడాకారిణులు అంతర్జాతీయ వేదికపై భారతదేశానికి గుర్తింపు తెచ్చారు. ఇక్కడ కేవలం పతకాల సంఖ్యను చూడటం సరిపోదు. ఒక గ్రామీణ బాలిక క్రీడల్లోకి రావడం అంటే కుటుంబం, పాఠశాల, మైదానం, కోచ్, పోటీ, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి అనే సామాజిక ప్రయాణం. అందువల్ల మహిళా క్రీడా అభివృద్ధి అనేది కేవలం క్రీడా విధానం కాదు. అది సామాజిక సాధికారత విధానం కూడా.
చదువుతోపాటు ఆటలకు
ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో ఒక స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేస్తామన్నారు. భవిష్యత్తులో ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చేలా హైదరాబాద్‌ను మార్చాలి. రాష్ట్రంలో యంగ్ ఇండియా పేరుతో ఏర్పాటు చేయనున్న సమీకత గురుకుల సముదాయాలు సైతం క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలి. గ్రామీణ క్రీడలకు పునర్వైభవం తీసుకురావాలి. ఆటల స్ఫూర్తిని చాటడానికి గ్రామ, మండల స్థాయిలో క్రీడా మైదానాలను ఏర్పాటు చేయాలి. యువతలో ఆటల పట్ల ఆసక్తి రేకెత్తించడానికి తరచూ టోర్నమెంట్లు నిర్వహించి విజేతలకు మంచి ప్రోత్సాహం అందించాలి. క్రీడాకారుల ఎంపికలో పారదర్శకతను తీసుకురావాలి. జాతీయ క్రీడా అభివృద్ధి నిధులను కార్పొరేట్ సంస్థల సాయంతో సమీకరించాలి. 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌కు పునాది ఇప్పుడే పడాలి. ఆటలకు పునాది బాల్యమే కావున అందుకు పాఠశాలలు వేదిక కావాలి. ప్రతి పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయులను తప్పక నియమించాలి. విద్య మూల్యాంకనంలో క్రీడలను కూడా భాగం చేయాలి.
మూడ్ శోభన్, 9949725951



