‘విద్యా సంస్థలు అంటే కేవలం ఉద్యోగాల కోసం శిక్షణ ఇచ్చే ప్రదేశాలు కాకూడదు. విద్యార్థి సంపూర్ణ వికాసానికి, హృదయ పరిపక్వతకు, వారిలోని సృజనాత్మకత, నైతిక విలువల పెంపుదలకు కేంద్రాలుగా వుండాలి. అప్పుడే విద్య యొక్క లక్ష్యం నెరవేరుతుంది’ అన్నారు డా. సర్వేపల్లి రాధాకృష్ణన్. ప్రఖ్యాత తత్వవేత్త, ఆదర్శ ఉపాధ్యాయుడు, దార్శనికుడు, భారత ప్రధమ ఉపరాష్ట్రపతి అయిన డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి అయిన సెప్టెంబర్ 5వ తారీకున ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే.
ఉపాధ్యాయ దినోత్సవం అనగానే చిన్ననాటి జ్ఞాపకాలు పలకరిస్తుంటాయి. ఒకప్పుడు ఉపాధ్యాయి దినోత్సవం అంటే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఒక పండుగలా వుండేది. ఇప్పటిలా ఆధునిక హంగులు లేకపోయినా అప్పటి వేడుకలు ఆప్యాయత, గౌరవంతో నిండి వుండేవి. ఆ రోజున సీనియర్ విద్యార్థులు టీచర్లుగా మారి జూనియర్లకి తరగతులు నిర్వహించేవారు. ఉపాధ్యాయుల కుర్చీల్లో కూర్చుని పాఠాలు చెపుతుంటే ఆ వ్యక్తిలోని బాధ్యతని, గౌరవాన్ని, కష్టాన్ని వారు అనుభూతి చెందేవాళ్ళు. దాని వల్ల వారికి ఉపాధ్యాయుల పట్ల గౌరవం, అభిమానం ఏర్పడేవి. ఉపాధ్యాయులు కూడా పిల్లల్ని ఎంతో అంకితభావంతో ప్రోత్సహించేవారు, అభినందించేవారు. విద్యార్ధులు తమకు ఇష్టమైన ఉపాధ్యాయులపైన కవితలు చదవటం, పాటలు పాడటం, వారి గురించి ప్రసంగించేవారు. వారి మధ్య ప్రేమ, అభిమానం, ఆప్యాయతలు పటిష్టం కావటానికి అవి ఎంతగానో దోహదపడేవి. అంతేకాదు, విద్యార్ధులు తమ పాకెట్ మనీతో ఉపాధ్యాయులకి ఇచ్చే చిన్న చిన్న గిఫ్ట్స్ వారికి ఎంతో అపురూపంగా అనిపించేవి.వారి మధ్య వున్న ఆ అనుబంధం కారణంగానే విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టకపోయినా, తప్పు చేసినా ఉపాధ్యాయులు వేసే దండన విద్యార్థుల మనసుకి బాధ కలిగించేది కాదు. దాన్ని వాళ్ళు పాజిటివ్‌గానే తీసుకునే వాళ్ళు, తమ పొరపాట్లని సరిదిద్దుకునే వాళ్ళు.
సర్వీసు ప్రొఫైడర్స్‌గా
ఇప్పటి పరిస్థితులు ఇందుకు పూర్తిగా భిన్నంగా వున్నాయి. ఉపాధ్యాయులు – విద్యార్ధుల మధ్య రిలేషన్ కేవలం వృత్తి పరమైందిగా మాత్రమే వుంటోంది. విద్యార్థులకి ఉపాధ్యాయుల పట్ల గౌరవం వుండటం లేదు. గురువులని కేవలం సర్వీసు ప్రొఫైడర్స్‌గా మాత్రమే చూస్తున్నారు. తరగతిలో సెల్‌ఫోన్స్ వాడటం, ఉపాధ్యాయులకి ఎదురు చెప్పటం, క్రమశిక్షణా నియమాలను ఉల్లంఘించటం వంటి లక్షణాలు విద్యార్ధుల్లో పెరుగుతున్నాయి. చాలా మంది ఉపాధ్యాయుల్లో కూడా వృత్తి పట్ల సరైన అవగాహన, అంకితభావం వుండటం లేదు. ఉపాధ్యాయ వృత్తిని కేవలం జీవనోపాధి కోసం చేస్తున్న ఉద్యోగంలా భావిస్తున్నారు. కేవలం పాఠాలు చెప్పటం, అసైన్‌మెంట్స్ ఇవ్వటం వరకే ఉపాధ్యాయులు పరిమితం అవటం వల్ల గురు – శిష్యుల బంధం యాంత్రికంగా మారుతోంది. వీటికి తోడు పెరుగుతున్న డిజిటల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పిల్లల మేధో వికాసంపై, మెదడు పనితీరుపై ఎక్కువ ప్రభావం చూపుతోందని శాస్త్రవేత్తల పరిశోధనలు వెల్లడి చేస్తున్నాయి. ఒకప్పుడు ఏది తెలుసుకోవాలన్నా తల్లితండ్రులు, ఉపాధ్యాయులపైనే విద్యార్థులు ఆధారపడేవాళ్ళు. కానీ ఈ రోజు ఒక్క క్లిక్‌తో ఇన్‌ఫర్మేషన్ మొత్తం అందుబాటులోకి వస్తోంది. దాంతో వాళ్ళు ఏ విషయానికీ ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం లేకపోతోంది. అదే వాళ్ళల్లో వయసుకి మించిన స్వేచ్ఛకి, ఎవరినీ లెక్క చేయకుండా ఎదురు తిరిగే స్వభావానికి కారణం ఆవుతోంది.
మరొకసారి సవాల్
ఈ మధ్య కాలంలో పాఠశాలలు, విద్యా సంస్థల్లో జరుగుతున్న హింసలకి కారణం కూడా విద్యార్థుల్లో పెరుగుతున్న ఈ విపరీత ధోరణులే అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇటీవలి కాలంలో సమాజాన్ని ఉలిక్కి పడేలా చేసిన నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్యే దీనికి ఉదాహరణ. ఈ ఉదంతం సమాజానికి మరొకసారి సవాల్ విసిరినట్టు అయింది. ఇంతకు ముందు కూడా పాఠశాలల్లో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. రూపారెడ్డి హత్యా ఉదంతంపైన అనేకమంది స్పందించారు. సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వెల్లడిచేశారు, ఎక్కువశాతం మంది తల్లిదండ్రుల పెంపకాన్ని, ఉపాధ్యాయుల – విద్యా సంస్థల అసమర్ధతని ఎండగట్టరు.
బాధ్యులు ఎవరు?
నిజానికి విద్యార్ధుల్లో ఉన్మాదం పెరగటానికి బాధ్యులు కేవలం వీళ్లేనా? మనం కూడానా? ఒక్క సారి అటు వైపు దృష్టి సారిద్దాం. ఒక పిల్లవాడి వ్యక్తిత్వ నిర్మాణం అన్నది ప్రధానంగా మూడు అంశాలపై ఆధారపడి వుంటుంది, కుటుంబ వ్యవస్థ, విద్యా వ్యవస్థ, సామాజిక వ్యవస్థ. పిల్లల ఆలోచన, భావోద్వేగాల పెరుగుదల అనేది ఈ మూడు వ్యవస్థలపైనే ఆధారపడి వుంది. ఈ మూడింటిలో ఏ ఒక్కటి సవ్యంగా లేక పోయినా దాని ప్రభావం పిల్లల వ్యక్తిత్వంపై వుంటుంది. కాబట్టి వీటి మధ్య సమన్వయం చాలా అవసరం. ప్రస్తుత సమాజంలో పిల్లలు లేదా విద్యార్థులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇక్కడే వుంది. ఒకప్పుడు తల్లిదండ్రులు – ఉపాధ్యాయుల మధ్య చక్కని సమన్వయం వుండేది. అందుకే ఆనాటి పాఠశాలలు, విద్యా సంస్థలు ఆదర్శ కేంద్రాలుగా పని చేశాయి. కానీ ప్రస్తుత సమాజంలో ఆ పరిస్థితులు లేవు.
కొరవడుతున్న సత్సంబంధాలు
ఒకప్పుడు తల్లి తండ్రుల – ఉపాధ్యాయుల మధ్య వుండే నమ్మకం, గౌరవం, ఆత్మీయతతో ముడిపడి వుండేవి. గురువు పిల్లవాడిని మందలించినా, శిక్షించినా అది వాళ్లని ప్రయోజకులుగా చేసే ఉద్దేశ్యంతోనే అనే భావన తల్లితండ్రుల్లో వుండేది. ఉపాధ్యాయులు కేవలం జీతం కోసం కాకుండా విద్య నేర్పటం అనేది పవిత్రమైన సేవగా భావించి పనిచేసేవారు. కేవలం పాఠాలకి మాత్రమే పరిమితం కాకుండా విద్యార్ధుల వ్యక్తిత్వ, మనోవికాసాల అభివృద్ధికి తోడ్పడేవారు. విద్యార్థుల మనస్తత్వాన్ని అర్ధం చేసుకోవటం, వారిలోని బలహీనతలను గుర్తించి అవసరమైన సపోర్ట్ అందించటం, విద్యతో పాటు వారిలో నైతిక విలువల్ని పెంపొందించటం.. ఇవన్నీ ఉపాధ్యాయులుగా తమ బాధ్యత అనుకునేవారు. విద్యార్థుల్ని మంచి పౌరులుగా తీర్చి దిద్దటమే తమ వృత్తి లక్ష్యంగా పనిచేసేవారు. మంచి సమాజానికి పునాదులు పడేది పాఠశాలల్లోనే అన్నది ఆనాటి ఉపాధ్యాయుల నమ్మకం. అందుకే ఆరోజుల్లో ఉపాధ్యాయులకి అత్యున్నత గౌరవస్థానం లభించింది.
పూర్తి భిన్నంగా వుంది
విద్యార్థుల కుటుంబ నేపథ్యం తెలుసుకుని, వారికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు కుటుంబ సభ్యుడిలా వారి కుటుంబానికి చక్కని సలహాలు ఇచ్చేవారు. విద్యార్థుల్ని ఉత్తమ పౌరులుగా, సమాజాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దటమే తమ ఉమ్మడి లక్ష్యంగా తల్లిదండ్రులు – ఉపాధ్యాయులు కలిసి పనిచేసే వారు. కానీ ప్రస్తుత పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా వుంది. ఎక్కువ శాతం తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగస్థులు కావటం వల్ల ఉపాధ్యాయుల్ని ప్రత్యక్షంగా కలవటానికి, సత్సంబంధాలు ఏర్పరచుకోవటానికి తగిన సమయం వారికి వుండటం లేదు. చాలా వరకు వాట్సాప్ అప్డేట్స్ పైనే ఆధారపడుతున్నారు. అంతే కాకుండా ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో చదివే పిల్లల తల్లిదండ్రులు తాము ఫీజులు కడుతున్నాం కాబట్టి ఉపాధ్యాయుల్ని సర్వీస్ ప్రొవైడర్లుగా ట్రీట్ చేయటం, పిల్లల పూర్తి బాధ్యత పాఠశాలదే అన్న ధోరణితో వ్యవహరిస్తున్నారు. ఉపాధ్యాయులు చెప్పే సూచనల్ని అర్ధం చేసుకునే ఓపిక, సమయం కూడా వాళ్ళకి వుండటం లేదు. ఉపాధ్యాయులు పిల్లల్ని మందలించినా, శిక్షించినా సహించలేకపోవటం అన్నది ‘అది గారంభం’ పెంపకంలో భాగమైపోయింది. కేవలం ర్యాంకులకి, మార్కులకి మాత్రమే నేటి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. దానివల్ల విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురౌతున్నారు.
భావోద్వేగాల్ని అర్థం చేసుకోక…
కొందరు ఉపాధ్యాయులు క్లాస్ రూమ్స్‌లో వాడే భాష, వారు ప్రవర్తించే తీరు అభ్యంతరకరంగా వుంటోంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు చెప్పే మాటల కంటే వారి ప్రవర్తన నుంచే ఎక్కువ నేర్చుకుంటారు. ఆ విషయాన్ని చాలా మంది ఉపాధ్యాయులు విస్మరిస్తున్నారు. చాలామంది ఉపాధ్యాయులకి విద్యార్థుల భావోద్వేగాల్ని అర్థం చేసుకునేంత పరిజ్ఞానం వుండటం లేదు. విద్యార్థుల బలహీనతల్ని ఎత్తి చూపటం, హేళన చేయటమేగానీ వారిని సరిదిద్దటం ఉపాధ్యాయులుగా తమ బాధ్యత అన్న కనీస అవగాహన ఉపాధ్యాయుల్లో వుండటం లేదు. వీటన్నిటి కారణంగానే పాఠశాలల్లో విద్యార్థులకి ఉపాధ్యాయుల పైన గౌరవం, అభిమానం ఏర్పడటం లేదు. వీటికి తోడు తల్లిదండ్రులు- ఉపాధ్యాయులు పిల్లల ముందే మొబైల్స్‌ని అతిగా వాడుతున్నారు. పిల్లల ముందు ఎటువంటి కంటెంట్‌ని చూస్తున్నాం అన్న ఇంగితం కూడా వారిలో వుండటం లేదు. ఇవన్నీ విద్యార్థులపైన ప్రభావం చూపుతున్నాయి.
బలహీన పడుతున్న కుటుంబ సంబంధాలు
కుటుంబ సభ్యుల మధ్య బంధాలు బలహీన పడడం వల్ల పిల్లల్లో నేరప్రవృత్తి, హింస పెరుగుతున్నాయని మానసిక నిపుణులు, సామాజిక సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.
తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగస్థులు కావటం వల్ల పిల్లలతో గడిపే సమయం తగ్గిపోతోంది. ఒక గంట సేపు పిల్లలతో గడపటానికి, వాళ్ళ ఆలోచనల్ని, భావోద్వేగాల్ని అర్థం చేసుకోవటానికి కూడా తల్లిదండ్రులు సమయాన్ని వెచ్చించలేక పోతున్నారు. ఇంట్లో వున్న కొద్ది సమయం కూడా ఎవరికి వారు స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా, టీవీలకి పరిమితం అయిపోతున్నారు. పిల్లల ముందే తల్లిదండ్రులు తీవ్రస్థాయిలో ఘర్షణలకి దిగటం కూడా పిల్లల మానసిక స్థితిని ప్రభావితం చేస్తోంది. పిల్లలకి ఇంట్లో ఆప్యాయతలతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణం లేకపోవటం, ఎక్కువ సమయం తల్లిదండ్రులకి దూరంగా వుండటం వారిని మానసికంగా ఒంటరితనానికి గురిచేస్తోంది. పిల్లల్లో అసహనం, తిరుగుబాటు ధోరణి పెరగటానికి గల ప్రధాన కారణాల్లో ఇది కూడా ఒకటి. దీనికి తోడు తల్లిదండ్రులు పిల్లలని శాసిస్తున్నారే గానీ వారి చర్యలపై సరైన పర్యవేక్షణ మాత్రం వుండటంలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇటు తల్లిదండ్రులుగాని, అటు ఉపాధ్యాయులు గానీ ఆ పిల్లలకి రోల్ మోడల్ కాలేకపోతున్నారు.
సామాజిక వ్యవస్థ విషయానికి వస్తే…
ఎక్కడ పడితే అక్కడ విద్యార్థులకి అందుబాటులో వుంటున్న డ్రగ్స్, అశ్లీలత, హింస, నేర ప్రవృత్తి వంటి వాటిని పిల్లల మెదడులోకి విస్తృతంగా ఇంజెక్ట్ చేస్తున్న సోషల్ మీడియా, ఓటిటి ఫ్లాట్ ఫామ్స్, సినిమాలపై ఈ మధ్య కాలంలో చర్చలు జరుగుతూనే వున్నాయి. కానీ ప్రయోజనం మాత్రం వుండటం లేదు. ప్రస్తుత సమాజంలో వయసు, జెండర్‌తో కూడా సంబంధం లేకుండా హింస ఏ స్థాయిలో పెరిగిపోతోందో మనందరం చూస్తూనే వున్నాం. ప్రతి నేరం వెనుక ఒక సినిమా నేపధ్యం వుంటూనే వుంది. అయినా ప్రభుత్వాలు గానీ, న్యాయవ్యవస్థ గానీ ఏ మాత్రం స్పందించటం లేదు.
ఇక్కడ మరొక ప్రశ్న
నిజానికి శిక్ష పడాల్సింది నేరం చేసిన విద్యార్ధులకా? వారిని నేరస్థులుగా మారుస్తున్న ఈ వ్యవస్థలోని శక్తులదా? విద్యార్థుల్ని మంచి పౌరులుగా తీర్చి తిద్దాలంటే మార్పు ఎక్కడ రావాలి? తల్లిదండ్రులు – ఉపాధ్యాయుల మధ్య పరస్పరం నమ్మకం, అవగాహన ఏర్పడటం అనేది ముఖ్యమైన అంశం. విద్యార్థి దశ అంటే కేవలం స్కూల్లో పాఠాలు నేర్చుకోవటం మాత్రమే కాదు, సమాజంలో మంచి పౌరులుగా కూడా రూపు దిద్దుకునే దశ. అందుకే తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమిష్టి కృషి వల్లే అది సాధ్యపడుతుంది.
దానికి అనుసరించాల్సిన అంశాలు
విద్యార్థిలోని ప్రత్యేక నైపుణ్యాల్ని, బలహీనతల్ని ఇద్దరూ ఒకేలా అర్ధం చేసుకోవాలి. తోటి పిల్లలతో పోల్చి వారిని ఒత్తిడికి గురిచేయకూడదు. విద్యార్ధులు మానసిక ఒత్తిడికి గురైనప్పుడు మేమున్నామన్న భరోసా వాళ్ళకి కల్పించగలగాలి. విద్యార్థి క్లాస్‌లో డల్‌గా వున్నా, చదువుపై ఆసక్తి చూపలేకపోయినా సమస్య మూలాల్ని తెలుసుకుని, చర్చించి, పరిష్కరించాలి.
కేవలం ర్యాంకులకి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వకుండా నైతిక విలువలు, క్రమశిక్షణ, సామాజిక బాధ్యత వంటి అంశాలపై కూడా వారిలో అవగాహన కల్పించాలి. ఉపాధ్యాయులు పిల్లల లోపాల్ని చెప్తున్నప్పుడు తల్లిదండ్రులు వాటిని సానుకూలంతో, సహనంతో వినాలి. అప్పుడే వాటిని వరిష్కరించగలుగుతారు. అవసరమైతే వారితో పాటు విద్యార్థిని కూడా కూర్చోబెట్టుకుని వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి సానుకూలంగా చర్చించటం వల్ల విద్యార్థికి తనపై తనకు విశ్వాసం కలగటమే కాకుండా తల్లిదండ్రులు- ఉపాధ్యాయుల మీద నమ్మకం, గౌరవం కూడా ఏర్పడతాయి. దానివల్ల వాళ్ళు ఏ విషయాన్నయినా ఉపాధ్యాయులతో నిస్సంకోచంగా చర్చించగలుగుతారు. అందుకే ఉపాధ్యాయులు ఎప్పుడూ అన్ని విషయల్లోనూ విద్యార్డులకి రోల్ మోడల్స్ అవ్వాలి. అప్పుడే విద్యార్థులు వారిని గౌరవిస్తారు. ‘ఒక దేశ భవిష్యత్తు ఆ దేశ పాఠశాలలు, తరగతి గదుల్లోనే నిర్మిత మవుతుంది’ అనే మాటను ఉపాధ్యాయులందరూ సమిష్టి కృషితో నిజం చేస్తారనే నమ్మకంతో వారందరికీ ‘ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు’.
గోపాలుని అమ్మాజి, 7989695883
హ్యూమన్ సైకాలజిస్ట్,
ఫ్యామిలీ కౌన్సిలర్


