Sunday, May 10, 2026
E-PAPER
Homeమానవిఅమ్మకు ఎనలేనంత ఓర్పు

అమ్మకు ఎనలేనంత ఓర్పు

- Advertisement -

మా నాన్న కృష్ణ మోహన్‌ రావు. రైల్వేలో పని చేసి రిటైర్‌ అయ్యారు. అమ్మ సీత. ఎంతో సహనం, ఓర్పుతో మమ్మల్ని పెంచి, ఇంటిని అంతే చక్కగా చూసుకునేది. ఎంతో మంది పిల్లల్ని తీర్చిదిద్దిన గొప్ప టీచర్‌ అమ్మ. వీరికి మేము ఇద్దరం ఆడపిల్లలం. మా చెల్లెలు సాయి రమ్య పెండ్లి తర్వాత ఆస్ట్రేలియాలో స్థిర పడింది. మేమిద్దరం అమ్మతో ప్రతి విషయాన్ని పంచుకునే వాళ్లం. ఆ స్వాతంత్య్రం అమ్మనే ఇచ్చింది. రోజంతా ఉద్యోగంలో స్కూల్‌ పిల్లలతో అలసి పోయినా, మా కబుర్లు ఓపిగ్గా వినేది. అమ్మ మాకు ఏ విషయమూ కూర్చోబెట్టి ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి అని ఎప్పుడూ చెప్పలేదు. తాను చేస్తూ ఉంటే చూసి నేర్చుకున్నాం. మాకు కొంచం ఊహ తెలిసే సరికి, అమ్మకు పనిలో సహాయం చేసేవాళ్ళం. అమ్మకి డిగ్రీ పూర్తి చెయ్యాలని ఎప్పటినుంచో ఉండేది. ఉద్యోగం, పిల్లలు ఈ హడావిడిలో కుదరలేదు. మా చదువులు పూర్తయ్యి ఉద్యోగాల్లో చేరాక మా అమ్మకే అమ్మగా మారాము. అమ్మ డిగ్రీ పొందాలనే కల నెరవేర్చాం. డిగ్రీ పట్టా పొందాక అమ్మ పొందిన సంతృప్తి, ఆనందం కన్నా మేము పొందిన ఆనందం అనిర్వచనీయం. చదువు పూర్తయ్యి నేను ఉద్యోగంలో చేరాక, నేను నా మొదటి జీతంతో మా అమ్మకు బంగారు కమ్మలు కొనిచ్చినప్పుడు అమ్మ ఎంతో గర్వపడింది. ఆమె కళ్లలో ఆనందం నాకు ఇంకా గుర్తుంది. ఇలా బోల్డన్ని అనుభవాలు ఉన్నాయి. పేరుకి తగ్గట్టు అమ్మకు ఎనలేనంత ఓర్పు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా అమ్మ మనోధైర్యం చెక్కు చెదరలేదు. జీవితంలో ధైర్యంగా ఎలా ఉండాలో, ఎలా సర్దుకుపోవాలో, ఎలాంటి సందర్బమైనా తడబడక ఎలా నిలబడాలో నేర్చుకున్నాం. ప్రస్తుతం తల్లి లాంటి అత్తగారితో నేనెంతో సంతోషంగా ఉన్నాను. మా అమ్మనుంచి నేర్చుకున్న సహనం, జీవితం విలువను, మా అత్తగారి దగ్గర నేర్చుకుంటున్న సమయస్పూర్తిని, పనితనాన్ని మా పిల్లలకు కూడా నేర్పాలని ప్రయత్నిస్తున్నా.
– డా.విద్యా భార్గవి, అసోసియేట్‌ ప్రొఫెసర్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -