చూడటానికి చాలా చిన్నగా ఉన్నా నువ్వులలో ఉండే పోషకాలు అనంతం. వీటిలో ఉండే కాల్షియం కీళ్ల నొప్పులను తగ్గించి ఎముకలను దృఢంగా మారుస్తాయి. ఇందులోని ఆరోగ్యకరమైన కొవ్వులు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి. నువ్వుల్లో ఉండే విటమిన్-ఈ, జింక్ చర్మాన్ని కాంతివంతంగా ఉంచి, జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. వీటిలో ఉండే అధిక పీచు మలబద్ధకం సమస్యను దూరం చేసి గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. నువ్వులలోని మెగ్నీషియం రక్తంలో చక్కెర స్థాయిలను అదుపు చేయడంలో సహాయపడుతుంది. ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్న ఆ కమ్మటి నువ్వులతో నోరూరించే వంటకాలు మీ కోసం..
చిక్కీ
కావల్సిన పదార్థాలు: బెల్లం – కప్పు, నువ్వులు – ఒకటిన్నర కప్పు, నెయ్యి – చెంచా
తయారు చేసే విధానం: నువ్వులను దోరగా వేయించాలి. బెల్లంలో కొన్ని నీళ్లు పోసి.. వేడి చేయాలి. చిక్కగా పాకం తయారయ్యే వరకూ కలియతిప్పుతూనే ఉండాలి. అందులో నువ్వులు జతచేసి మొత్తం కలిసిపోయే వరకూ కలియబెట్టి సెగ తీసేయాలి. పళ్లెంలో నెయ్యి రాసి.. నువ్వుల మిశ్రమాన్ని సమంగా సర్దాలి. అది చల్లారక ముందే.. నచ్చిన ఆకృతిలో ముక్కలుగా కోసుకోవాలి. వేడి తగ్గి, గట్టిపడితే ముక్కలు చేసుకోవడం కష్టమవుతుంది.
పచ్చడి
కావల్సిన పదార్థాలు: టొమాటో ముక్కలు – కప్పున్నర, పుదీనా – పావు కప్పు, నువ్వులు – అర కప్పు, పచ్చిమిర్చి – ఎనిమిది, చింతపండు – చిన్న నిమ్మకాయంత, వెల్లుల్లి రెబ్బలు – నాలుగు, ఉప్పు – రుచికి తగినంత, నూనె – రెండు టేబుల్ చెంచాలు, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర – చెంచా చొప్పున, మెంతులు, పసుపు – అర చెంచా చొప్పున, ఇంగువ – పావు చెంచా, కరివేపాకు – రెండు రెబ్బలు
తయారు చేసే విధానం: నువ్వులు వేయించి చల్లారాక గ్రైండ్ చేయాలి. చింతపండును కడిగి నానబెట్టాలి. ప్యాన్‌లో చెంచా నూనె వేసి.. టోమాటో ముక్కలు, పసుపు, పచ్చిమిర్చి, పుదీనాలను వేయించాలి. అవి ఉడికిన తర్వాత సెగ తీసేయాలి. నువ్వుల పొడి ఉన్న జార్‌లో టొమాటో-పుదీనా మిశ్రమం, ఉప్పు, వెల్లుల్లి, చింతపండు వేసి గ్రైండ్ చేయాలి. కడాయిలో మిగిలిన నూనెను వేడిచేసి ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, మెంతులు, జీలకర్రలను ఒకదాని తర్వాత ఒకటిగా వేయాలి. అవి వేగాక ఇంగువ, కరివేపాకు వేసి దించేసి పచ్చడిలో కలపాలి.
నువ్వుల అన్నం
కావల్సిన పదార్థాలు: వండిన అన్నం – రెండు కప్పులు, నల్ల నువ్వులు – మూడు టేబుల్ స్పూన్లు, నువ్వుల నూనె – రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు – రుచికి తగినంత, మినప్పప్పు, శనగపప్పు – చెంచా చొప్పున, ఎండుమిర్చి – ఎనిమిది, ఆవాలు – ముప్పావు చెంచా, కరివేపాకు – రెండు రెబ్బలు, ఇంగువ – అర చెంచా
తయారు చేసే విధానం: మినప్పప్పు, శనగపప్పులను నూనె లేకుండా వేయించాలి. అవి కాస్త వేగాక నువ్వులు, ఎండుమిర్చి వేసి కలియతిప్పుతుండాలి. నువ్వులు చిటపటలాడుతున్నప్పుడు దించేసి.. చల్లారాక ఉప్పు చేర్చి గ్రైండ్ చేయాలి. కడాయిలో నూనె వేడయ్యాక ఆవాలు.. అవి వేగాక కరివేపాకు, ఇంగువలను జోడించాలి. మంచి వాసన వస్తుండగా సెగ తీసేసి అన్నం, నువ్వుల మసాలా జతచేసి కలిపితే.. ఘుమఘుమలాడే నువ్వులన్నం సిద్ధం.
నువ్వుల కాకరకాయ
కావల్సిన పదార్థాలు: కాకరకాయలు – 150 గ్రాములు, టొమాటో ముక్కలు – కప్పు, నువ్వులు – పావు కప్పు, పచ్చిమిర్చి – రెండు, ఉల్లి తరుగు – అర కప్పు, రాళ్లుప్పు, మెత్తటుప్పు – తగినంత, నూనె – మూడు చెంచాలు, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, కారం, పసుపు – చెంచా చొప్పున, కరివేపాకు – రెండు రెబ్బలు, ఇంగువ – పావు చెంచా, కొత్తిమీర తరుగు – గుప్పెడు
తయారు చేసే విధానం: నువ్వులను దోరగా వేయించి పొడి చేయాలి. కాకరకాయల్లో కాస్త పసుపు, చింతపండు, రాళ్లుప్పు వేసి ఉడికించి, ఆ నీళ్లు వార్చేయాలి. కడాయిలో నూనె వేడయ్యాక.. ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ వేగాక ఉల్లి తరుగును వేయించాలి. అది లేత గోధుమ రంగులోకి మారాక.. టొమాటో ముక్కలు.. అవి ఉడికాక కాకరకాయ ముక్కలు, ఉప్పు, పసుపులను జతచేయాలి. అందులో కొన్ని నీళ్లు, నువ్వులపొడి, కారం జోడించి సన్న సెగ మీదుంచాలి. దగ్గరగా అయ్యాక కొత్తిమీర తరుగు చల్లి దించేయాలి.
కారం
కావల్సిన పదార్థాలు: నువ్వులు – కప్పు, ఎండు మిర్చి – పది, కరివేపాకు – రెండు రెబ్బలు, ధనియాలు – చెంచా, జీలకర్ర – అర చెంచా, చింతపండు – సగం నిమ్మకాయంత, ఉప్పు – రుచికి తగినంత, వెల్లుల్లి రెబ్బలు – నాలుగు
తయారు చేసే విధానం: కడాయిలో ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, చింతపండులను కలియతిప్పుతూ వేయించాలి. వాటిని పళ్లెంలోకి తీసి, నువ్వులు వేయాలి. అవి చిటపటలాడుతున్నప్పుడు దించేయాలి. ముందుగా ధనియాలు, జీలకర్ర మొదలైనవాటిని గ్రైండ్ చేయాలి. దాన్ని తీసి నువ్వులను పొడి చేయాలి. అందులో ఉప్పు, వెల్లుల్లి జోడించి ఇంకోసారి గ్రైండ్ చేయాలి. అంతా కలిపేసి.. తడి లేని, గాలి చొరబడని సీసాలో భద్రం చేసుకోవాలి. వేడన్నంలో ఈ నువ్వుల కారం, నెయ్యి వేసుకుని తింటే సూపర్‌గా ఉంటుంది.


