ఆకాశమంత అనురాగం, అంతరి క్షమంత సహనం, ఎవరెస్టుతో వ్యక్తిత్వం, మహోన్నత ప్రేమ శిఖరం అమ్మ. మాతృమూర్తి త్యాగానికి ప్రత్యామ్నాయం లేదు. 1914లో అమెరికన్ అన్నా జార్వీస్ ప్రారంభించిన మాతృ దినోత్సవం ప్రతియేటా మే రెండో ఆదివారం, అనగా 10 మే 2026 రోజున ప్రపంచవ్యాప్తంగా “జాతీయ మాతృదినోత్సవం” లేదా “నేషనల్ మదర్స్ డే”గా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. జాతీయ మాతృ దినోత్సవం -2026 ఇతివృత్తంగా “గొప్ప భారం దించడం” అనబడే అంశాన్ని తీసుకొని తల్లి మోస్తున్న భారీ మానసిక, శారీరక ఒత్తిడిని తగ్గించడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వహించాలని ప్రచారం చేస్తున్నారు. అమ్మ ప్రేమను వ్యక్తం చేయడానికి అక్షరాలు చాలవు. నమమాసాలు మోసి, ప్రసవ వేదన భరించి, ఆలనాపాలనా చూసి, అన్నీ తానై సేవలు చేసిన తల్లికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం. మన ముందు నిలిచిన ఆది దేవుళ్లు అమ్మనాన్నలు మాత్రమే. నిస్వార్థతకు, నిజాయితీ కలిగిన ప్రేమకు, కొండంత త్యాగశీలతకు, అనిర్వచనీయ సురక్ష కవచాన్ని నిర్మించడానికి నిలువెత్తు నిదర్శనం అమ్మ. అమ్మకు పదవి విరమణ లేదు. పిల్లల కోసం తపించని రోజు ఉండదు. పిల్లల సేవలో అలసట ఎరుగదు. అమ్మ చనుబాల కన్న అమృతం లేదు. అమ్మ చేతి ముద్ద కన్న రుచి మరొకటి లేదు. బిడ్డ జీవితంలో ఉపాధ్యాయురాలు పాఠ్యాంశాలను నేర్పితే, అనంతజ్ఞాని వలె అమ్మ జీవిత పాఠాలను నేర్పుతుంది. బిడ్డకు తడబడే బుడిబుడి తొలి అడుగులు వేయడం నేర్పుతుంది. నిరక్షరాస్యులు తానైన అనంత లోకజ్ఞానాన్ని అమ్మ నూరి పోస్తుంది, తొలి పలుకులు నేర్పుతుంది. కలికాలం సుఖ సంతోషాలతో ఉండమని దీవిస్తుంది, దాని కోసం ఆరాటపోరాటాలు చేస్తుంది. అమ్మ కొంగు బిడ్డకు ఊతకర్ర, కొండంత అండ. చంక నెత్తుకొని లోకాన్ని పరిచయం చేస్తుంది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథిదేవోభవ అన్న పెద్దలు సైతం తొలి గౌరవం అమ్మకే ఇచ్చారు. కింద పడిన ప్రతి సారి లేచి నడవమని చెప్పకనే జీవన పోరాటాన్ని నేర్పతుంది. తల్లి నిస్వార్థ ప్రేమకు ప్రతీక. పిల్లల ఆనందమే తన ఆనందంగా భావిస్తూ, మానవత్వానికి ప్రతిరూపంగా నిలుస్తుంది అమ్మ. దయ, కరుణ, త్యాగం, నిస్వార్థం, ప్రేమల నిలువెత్తు కలబోత అమ్మ. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. అమ్మ చల్లని ఒడిలో మొదలైన జన్మ ఆసాంతం గెలుపోటముల తాపాల మిశ్రమమే. అనేక రకాల ప్రేమల్లో స్వచ్ఛమైనది తల్లి ప్రేమ. అమ్మంటే త్యాగమే కాదు, ఓ విలక్షణ వ్యక్తిత్వం, ఆశావహ దృక్కోణం. అమ్మ ఓ అనంత విశ్వవిద్యాలయం, ఓ తడారని ప్రేమామృతం. మనం ఏడుస్తున్నపుడు ప్రసవ వేదన మరిచి అమ్మ సంతోషపడే క్షణాలు మనం పుట్టిన తొలి గడియలు మాత్రమే. అమ్మ కడుపు చల్లగా, అమ్మ మనసు నిండుగా, అమ్మ ఒడి మెత్తగా, అమ్మ ప్రేమ స్వచ్ఛంగా ఉంటుందని మనందరికీ తెలుసు. కాలం మారుతోంది. తరాలు మారుతున్నాయి. విలువలు కొత్త రూపం దాల్చుతున్నాయి. ప్రేమకు నిర్వచనం మారుతున్నది. స్నేహా భావాలు బలహీన పడుతున్నాయి. అను బంధాలు పతనం అవుతున్నాయి. అన్నీ సంపద చుట్టు తిరుగుతున్నాయి. కాని అమ్మ ప్రేమ మాత్రం కాలకాలం సుస్థిరం, శాశ్వతం. నేటి వేగవంతమైన జీవన పోరాటంలో అమ్మతో నిత్యం గడపడం భారత కుటుంబాల్లో సహితం అసాధ్యంగా తోస్తున్నది. అమ్మను మది మందిరంలో ప్రతిష్టించుకొని, ఆమె దీవెనల మాటల మూటలను నెత్తిన పెట్టుకొని, అమ్మ ఆశయ సాధనకు కృషి చేద్దాం. అమ్మ ముఖంలో ఆనందాల సింగిడి వెలవడానికి నేడే కారణమవుదాం. అమ్మా… నీ పాదాలకు వందనం.(10 మే “జాతీయ మాతృ దినోత్సవం” )
బి. మధుసూధన్ రెడ్డి
అమ్మ ప్రేమకు ప్రత్యామ్నాయం ఉందా?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



