కరోనా మహమ్మారి దేశాన్ని కుదిపేసిన సమయంలో ప్రజల ఆపదలో అండగా నిలవాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన పిఎం కేర్స్ ఫండ్ ఇప్పుడు మరోసారి చర్చనీయాం శంగా మారింది. ఈ నిధికి దేశ ప్రజలు, ఉద్యోగులు, సంస్థలు పెద్దఎత్తున విరాళాలు అందించారు. ఆపదలో ఉన్న ప్రజలకు, ముఖ్యంగా కరోనా కారణంగా నష్టపోయిన కుటుంబాలకు ఈ సొమ్ము ఉపయోగపడు తుందనే నమ్మకంతో ప్రజలు తమ వంతు సహకారం అందించారు. అయితే తాజాగా వెల్లడైన ఖాతాల వివరాలు నిధి వినియోగంపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. పిఎం కేర్స్ ఫండ్‌ను 2020 మార్చి 27న ఏర్పాటు చేశారు. కరోనా వంటి విపత్తులను ఎదుర్కొనేందుకు అత్యవసర నిధిగా దీనిని ప్రభుత్వం ప్రచారం చేసింది. అయితే దేశంలో ఇప్పటికే ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి ఉన్నప్పటికీ ప్రత్యేకంగా మరో నిధి ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందనే ప్రశ్న అప్పట్లోనే వచ్చింది. అయినప్పటికీ కరోనా తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలు విరాళాల విషయంలో వెనుకాడలేదు.ఇప్పుడు బయటకు వచ్చిన 2023-24, 2024-25 సంవత్సరాల ఖాతాల ప్రకారం పిఎం కేర్స్ ఫండ్‌లో రూ.8,452 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇంత భారీ మొత్తం అందుబాటులో ఉన్నప్పటికీ, 2024-25లో కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల కోసం కేవలం రూ.87.85 లక్షలు మాత్రమే ఖర్చు చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇది సహజంగానే తీవ్ర ఆందోళన కలిగించే విషయం. కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల కోసం ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని ప్రకటించింది. వారికి విద్య, వైద్యం, వసతి, భోజనం వంటి సదుపా యాలతో పాటు 18 సంవత్సరాలు నిండిన తర్వాత రూ.10 లక్షలు అందిస్తామని హామీ ఇచ్చింది. అలాగే ఒక్కో విద్యార్థికి ప్రతి సంవత్సరం రూ.20 వేలు ఆర్థిక సహాయం అందించాల్సి ఉంది. 2024-25లో 3,383 మంది పిల్లలకు ఈ సహాయం అందాల్సి ఉండగా, లెక్కల్లో కనిపిస్తున్న రూ.87.85 లక్షల ఖర్చు ఆ హామీకి సరిపోతుందా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఒక్కో విద్యార్థికి రూ.20 వేల చొప్పున చెల్లించాలంటే సుమారు రూ.6.76 కోట్లు అవసరం. మరి మిగిలిన మొత్తం ఎక్కడికి వెళ్లింది? అర్హులైన పిల్లలందరికీ సహాయం అందిందా? ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి.
ఇక్కడ మరో ముఖ్యమైన అంశం దరఖాస్తుల సంఖ్య. 9 వేల మందికి పైగా పిల్లలు పిఎం కేర్స్ సహాయం కోసం దరఖాస్తు చేసుకోగా, కేవలం 4,543 దరఖాస్తులను అంగీకరించినట్లు సమాచారం. అర్హత ఉన్న పిల్లలెవరూ సహాయం నుంచి దూరం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. మహమ్మారి సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల భవిష్యత్తు ఒక పరిపాలనా గణాంకంగా కాకుండా మానవీయ సమస్యగా చూడాలి. పిఎం కేర్స్ నిధుల ఖర్చు ఏడాదికేడాది తగ్గడం కూడా గమనించదగ్గ విషయం. 2022- 23లో రూ.346 కోట్లు, 2023-24లో రూ.15 కోట్లు, 2024-25లో రూ.87.85 లక్షలు మాత్రమే ఖర్చయి నట్లు వివరాలు చెబుతున్నాయి. మరోవైపు 2023-24 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ.6,641 కోట్లు ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఉన్నట్లు లెక్కలు వెల్లడిస్తున్నాయి. ప్రజల విరాళాలతో ఏర్పాటైన అత్యవసర నిధిలో ఇంత భారీ మొత్తాన్ని నిల్వ ఉంచడం, అదే సమయంలో బాధితులకు పరిమిత స్థాయిలోనే సహాయం అందడం సమాధానం కోరే అంశమే.
దేశంలో వరదలు, తుపాన్లు, భూకంపాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. కేరళ, కర్నాటక, అసోం వంటి రాష్ట్రాల్లో ప్రజలు ప్రకృతి బీభత్సానికి గురై ఆస్తులు, ఉపాధి కోల్పోయారు. ఇలాంటి సందర్భాల్లో పిఎం కేర్స్ నిధి నుంచి ఎంత సహాయం అందింది? ఎంత మొత్తం బాధితుల పునరావాసానికి ఉపయో గించారు? అనే వివరాలు ప్రజలకు తెలియాలి. ప్రధానమంత్రి ఎక్స్-అఫిషియో ఛైర్‌పర్సన్‌గా, కేంద్ర మంత్రులు ట్రస్టీలుగా ఉన్న ఈ వ్యవస్థ ప్రజల నుంచి విరాళాలు స్వీకరిస్తున్న ప్పుడు జవాబుదారీతనం తప్పనిసరి. ప్రజల డబ్బుతో నడిచే వ్యవస్థ ప్రజలకు లెక్కలు చెప్పకపోవడం ప్రజా స్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. పిఎం కేర్స్ ప్రభుత్వ సంస్థ కాదని, సమాచార హక్కు చట్టం పరిధిలోకి రాదని ప్రభుత్వం చెబుతోంది. కానీ ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు నిధి నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో దాని ఆదాయ, వ్యయ వివరాలను ప్రజలకు పూర్తిగా వెల్లడించాల్సిన అవసరం ఉంది. నిధికి ఎంత మొత్తం విరాళంగా వచ్చింది, ఎవరి నుంచి వచ్చింది, ఎంత వడ్డీ వచ్చింది, ఎంత ఖర్చు చేశారు, ఎవరికి అందించారు, ప్రస్తుతం ఎంత మొత్తం ఉంది వంటి పూర్తి వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలి.
ముఖ్యంగా పెద్ద మొత్తాల్లో విరాళాలు అందించిన సంస్థల వివరాలు, నిధుల వినియోగంపై కూడా పారదర్శకత అవసరం. ప్రజల నుంచి సేకరించిన ప్రతి రూపాయి ప్రజల అవసరాలకు ఉపయోగపడాలి. ప్రకృతి వైపరీ త్యాల్లో బాధితులకు, తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు, పేదలకు, విద్యార్థులకు ఈ నిధి అండగా నిలవాలి. భారీ మొత్తాలను నిల్వ ఉంచడం కంటే అత్యవసర సమయంలో ప్రజలకు అందించడం ద్వారా మాత్రమే నిధి ఏర్పాటు చేసిన లక్ష్యం నెరవేరుతుంది. లేదంటే ఇది ఎవరి ‘కేర్’కోసమని కేంద్రాన్ని దేశం ప్రశ్నించాల్సి వస్తుంది.
ఇదేనా కేంద్రం ‘కేర్’?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


