Wednesday, August 26, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమోడీని టెర్రరిస్టుతో పోల్చిన మమ్దానీని కలవడానికి ప్రయత్నిస్తారా?

మోడీని టెర్రరిస్టుతో పోల్చిన మమ్దానీని కలవడానికి ప్రయత్నిస్తారా?

- Advertisement -

నిబంధనల ప్రకారమే రేవంత్‌‌రెడ్డికి అనుమతి ఇవ్వలేదు : కేంద్ర మంత్రి కిషన్‌‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

భారత ప్రధాని మోడీని టెర్రరిస్టుతో పోల్చిన న్యూయార్క్‌ మేయర్ మమ్దానీ…అలాంటి వ్యక్తిని కలవడానికి సీఎం రేవంత్‌‌రెడ్డి ప్రయత్నిస్తారా? అని కేంద్ర మంత్రి జి కిషన్‌‌రెడ్డి ప్రశ్నించారు. నిబంధనల ప్రకారమే కేంద్రం రేవంత్‌‌రెడ్డి అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. యూనివర్సీటీలను తీసుకొస్తామంటూ చెప్పే రేవంత్… ముందు తెలంగాణ విద్యా వ్యవస్థ అభివృద్ధిపై మాట్లాడాలని సూచించారు. మంగళవారం ఢిల్లీలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. విద్యారంగానికి బడ్జెట్ లో 15 శాతం నిధులు, విద్యార్థులకు స్కూటీలు, విద్యా భరోసా కార్డులు ఇస్తామంటూ హామీ ఇచ్చారని, వాటి సంగతేంటని ప్రశ్నించారు. ప్రతి మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ ఏమైందని నిలదీశారు. తన అసమర్థత, ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, మాటలతో గారడీ చేయడం తప్పితే, ఎక్కడ కూడా నిర్మాణాత్మక నిర్ణయం తీసుకోలేదన్నారు. తన అమెరికా పర్యటనపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అర్థరహితమైనవన్నారు. ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి స్థాయి వ్యక్తులు అన్ని అనుమతులు తీసుకున్నాకే విదేశీ పర్యటన ఖరారు చేసుకుంటారని తెలిపారు. ‘ఆదరబాదరాగా లండన్ వెళ్లి.. అక్కడి నుంచి రేవంత్ రెడ్డి అమెరికా వెళ్లాలనుకున్నారు. ఆయన విదేశాలకు వెళ్లక ముందే మీ స్థాయికి తగ్గట్టు విదేశీ పర్యటన లేదు. అందుకే అనుమతులు ఇవ్వట్లేదని విదేశాంగ శాఖ స్పష్టంగా చెప్పింది. దీనిపై ఆలోచించి నిర్ణయం తీసుకుని, అధికారులతో చర్చించి క్లియరెన్స్ తీసుకోవాల్సి ఉంది. కానీ, రేవంత్ రెడ్డి… తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ఈ నెపాన్ని కేంద్ర ప్రభుత్వంపై నెడుతున్నారు’ అని చెప్పారు. అమెరికా పర్యటన విషయంలో ఆయన క్లారిటీ ఇవ్వకుండా ఇలా మాట్లాడటం సరికాదన్నారు. గతంలో తాను కెనడా వెళ్లేందుకు, రష్యా వెళ్లేందుకు కూడా అనుమతులు రాలేదన్నారు. ఇలాగే అనేక కేంద్రమంత్రులకు విదేశీ పర్యటనల విషయంలో అనుమతులను నిరాకరిస్తుంటుందని ఆయన స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -