వాట్సాప్‌లో వార్త చూడగానే పుష్పకుమార్ ఎగిరిగంతేశాడు. తన ఆరాధ్యదైవం, అవతారపురుషుడైన పెద్దాయన పేరిట డిల్లీ యూనివర్సిటీలో ఒక పొలిటికల్ సైన్స్ కోర్సు ప్రారంభించారు. ఏ దేశానికైనా ఇంతకన్నా కావాల్సిందేమి ఉంటుందను కున్నాడు! పెద్దాయన జ్ఞానం, భవిష్యద్దర్శనంతో గతంలో వెల్లివిసిరిన విజ్ఞానాన్ని తవ్వితీయడం, పరిపాలనాదక్షత, ఎలాంటి ఎన్నికల్లో నైనా అవలీలగా గెలవటం ఇవన్నీ భవిష్యత్ తరాలకు ఎలా అందుతాయో అని తాను ఎంతో మదనపడేవాడు! ఆ సమస్య ఇక పరిష్కా రమైనట్లే! సమాజానికే కాదు, తన సమస్యకు పరిష్కారం దొరికింది. శిశుమందిర్‌లో పదో తరగతి పూర్తి చేసిన తన కుమారునికి ఏ చదువు చెప్పించాలా అని ఇప్పటివరకూ ఆలోచించాడు! ఇప్పుడిక అవసరంలేదు!
భార్య, స్నేహితులు, శ్రేయోభిలాషులు చెబుతున్నా వినకుండా కుమారున్ని ఢిల్లీ తీసుకెళ్లి పెద్దాయన కోర్సులో చేర్చాడు. కొడుకు జయ్ విజయవంతంగా పూర్తిచేశాడు. కట్ చేస్తే… పుష్పకుమార్ ఉంటున్న కాలనీకి ఎన్నికలు వచ్చాయి. వాట్సప్, యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం, లాంటి సోషల్ మీడియా వేదికల్లో జయ్ పేరు మోగిపోతుంది. జయ్ గొప్ప పరిపాలనా దక్షుడని, గొప్ప చదువులు చదివాడని, 54 ఇంచుల ఛాతీ గలవాడని.. ఇలా ఎన్నో గొప్పతనాలతో ప్రచారం జరిగింది. ఈ సోషల్ మీడియా ప్రచారానికి దిమ్మతిరిగి కాలనీ వాసులు, జయ్‌ని, అతని పానల్‌ని భారీ మెజార్టీతో గెలిపించారు.
కాలనీ ఆఫీసు మెట్లకు మొక్కి మరీ జయ్ తన పరిపాలన ప్రారంభించాడు.కాలనీ పక్కనే ఒక మురుగుకాలవ ఉంది. వర్షాలకు అది పొంగి కాలనీలోకి వరద పారింది! దాంతో కాలనీ వాసులకు విషజ్వరాలు వచ్చాయి. కాలనీ అధ్యక్షుడు జయ్ వెంటనే పటిష్టమైన చర్యలు చేపట్టాడు. తాను ఇంట్లోని ఆరో అంతస్తులోకి వెళ్లిపోయాడు. అక్కడి నుంచి ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో పెట్టాడు! విష జ్వరాలకు కారణమైన వైరస్ రాత్రి పూట మేలుకుంది. కాలనీ అంతా విస్తరిస్తుందని అందుకని రాత్రంతా కాలనీలోనే ఇళ్లలో అన్ని లైట్లు వేసి ఉంచాలని, వైరస్ ఇంట్లోకి రాకుండా ప్రతి ఇంటి డోర్ వద్ద చెంబులూ, తప్పేలా వాయించాలని పిలుపునిచ్చాడు. కాలనీ వాసులు తూ.చ. తప్పకుండా జయ్ చెప్పింది అమలు చేశారు. వైరస్‌చావలేదు, కానీ వైరస్ సోకిన ఇరవై మంది కాలనీ వాసులు చనిపోయారు.
కాలనీ మొత్తానికి ఒక పల్లెటూరులోని రైతుల సహకార సంఘం నుండి పాలు, పెరుగు, నెయ్యి వచ్చేవి. జయ్ వాటిని ఆపమని ఆదేశాలిచ్చాడు. ప్రశ్నించిన కాలనీ వాసులను అక్కడ కల్తీ జరుగుతుందని, అమెరికా డెయిరీ ఉత్పత్తులు తెప్పించుకుందామని, కల్తీ జరగదని, ఆ డెయిరీ తన స్నేహితుడిదేనని, వీడియోకాల్లో మాట్లాడి ఒప్పందం చేసుకున్నాడు. జిఎస్‌టితో పాటు పాత రేట్లకి రెండింతలు పెట్టి, కాలనీ వాసులు అమెరికా డెయిరీ ఉత్పత్తులు కొంటున్నాడు. కాలనీచుట్టూ వాకింగ్ ట్రాక్ అనీ, పార్క్, స్కూలు, గుడి హాస్పటల్ కోసం స్థలం ఖాళీలు ఉంచారు. కాలనీ మధ్యలో కొంత స్థలం వదిలారు! అక్కడ చెట్లు నాటాలని కాలనీ వాసుల ఆలోచన! మొత్తం ఖాళీ స్థలాలను జయ్ తన స్నేహితుడు రియల్టర్ అయిన శేఖర్‌కి గజానికి ఒక్క రూపాయి చొప్ప్పున 99 సంవత్సరాలకు లీజుకి ఇచ్చేశాడు! కాలనీలో కొందరు పెద్దలు ఇదేంటని ప్రశ్నించారు. వారిని కాలనీ అభివృద్ధి ద్రోహులని పోలీసులకి ఫిర్యాదుచేసి జైల్లో వేయించాడు.
జయ్ చదువుకున్న స్కూలు కాలనీలోనే ఉంది! ఒకసారి ఆ స్కూలుకి యూనిఫారంతో వెళ్లి 7వ తరగతి గదిలో కూర్చని, బ్లాక్ బోర్డు వైపు చూస్తూ వలవలా ఏడ్చాడు. తన తండ్రి తరచు స్కూలుకి పంపటానికి పడ్డ కష్టాలను, గద్గద స్వరంతో వివరించాడు! అదంతా కాలనీ సోషల్ మీడియాలో మారుమోగింది. కాని అదే స్కూల్‌లో ఉన్న జయ్ టీచర్లు తలలు బాదుకున్నారు! కారణమేమంటే జయ్ ప్రతి రెండు రోజుల్లో ఒక రోజు బంక్ కొట్టేవాడు! స్కూలుకి వచ్చి రోజు తోటి స్టూడెంట్స్‌ను కొట్టేవాడు! సందర్భానుసారం డ్రస్సులను, వేషాలను ధరించటంలో జయ్ దిట్ట! కాలనీలో కొత్తగా కిరాణం షాపు ప్రారంభించడానికి జయ్‌ని ఆహ్వానించారు! జయ్ ఒక గన్నీ బ్యాగు తీసుకుని వచ్చి దాని ఉపయోగాలు వివరించి, ప్రారంభోత్సవం చేసి కిరాణా సమాన్లు గన్నీ బ్యాగులో వేసుకుని వెళ్లిపోయాడు. వేసవి కాలం వచ్చిందని, కాలనీలో స్విమ్మింగ్ పూల్ ప్రారంభించడానికి జయ్‌ని ఆహ్వానించారు. ప్రారంభానికి జయ్ స్విమ్ సూట్‌తో వచ్చాడు.
కాలనీలో నుండి ఆర్టీసీవారు రెండు సిటీ బస్సులు ప్రారంభించారు. కాలనీలో మొత్తం 8 స్టాప్‌లు ఉన్నాయి. ప్రతిరోజు ఒక స్టాప్ వద్ద సిటీబస్‌కి జెండా ఊపి ఎనిమిది రోజులపాటు సిటీ బస్సులకి జయ్ ప్రారంభోత్సవం చేశాడు. కాలనీలో ఎక్కడికి వెళ్లినా, ఎవరితో మాట్లాడినా ‘మన కాలనీ చాలా ప్రమాదంలో ఉంది. పక్క కాలనీ వారు మన కాలనీని ఆక్రమించాలని కుట్రలు పన్నుతున్నారని’ విపరీతంగా ప్రచారం చేస్తుంటాడు.ఈ మధ్య కొత్త ప్రచారం మొదలు పెట్టాడు. కాలనీలో తాను చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేక పక్కకాలనీ వారితో ఈ కాలనీ ద్రోహులు కొందరు చేతులు కలిపి, తనను మర్దర్ చేయాలని కుట్ర పన్నుతారని, నేరుగా కాలనీ యూట్యూబ్‌లోనే ప్రకటించారు! తనను మర్డర్ చేయాలని కుట్ర పన్నుతున్నారని జయ్ ప్రకటించిన తర్వాత జయ్‌పట్ల సానుభూతి పెరిగింది. గతంలో ఉన్న కాలనీ ఓటరు లిస్టులో కాలనీ ద్రోహులున్నారని, వారు మొదటి నుండి ఈ కాలనీ వాసులు కాదని, అందువల్ల వారిని ఓటరు లిస్టులో నుంచి తొలగించాలని కొందరు కాలనీ సంక్షేమ మండలికి ఫిర్యాదు చేశారు. తక్షణమే కాలనీ సంక్షేమ మండలి సమావేశమై ఒక కమిటీ వేసింది.
ఈ కమిటీ సమావేశమై ఫిర్యాదులను స్వీకరించి, కాలనీ ఓటరు లిస్టులో కొందరి పేర్లు తొలగిస్తున్నట్లు ప్రకటించింది! తొలగించిన వారిలో కాలనీకి పొలము ఇచ్చినవారు, కాలనీ ప్లాను డిజైన్ చేసి ఇంజనీర్లు, కాలనీలో ఇళ్లు కట్టిన మేస్ర్తీలు, కాలనీలో రోడ్లు వేసి అక్కడే నివాసం ఉంటున్న పనివారు, కాలనీలో కరెంటు కోసం, నల్లా కనెక్షన్‌కోసం ధర్నా చేసిన వారు కూడా ఉన్నారు!
ఇదంతా జరిగిన నెల రోజులకు కాలనీ సంక్షేమ మండలి ఎన్నికలు జరిగాయి! జయ్ అఖండ మెజార్టీతో మళ్లీ గెలిచాడు. విజయోత్సవ సభలో “మీరు గెలవటంలో గల రహస్యం ఏమిటి?” అని విలేకర్లు జయ్‌ని ప్రశ్నించారు. ఢిల్లీ యూనివర్సిటీలో కొత్తగా పెట్టిన రాజకీయ తత్వశాస్ర్తాన్ని నేను చదువుకున్నాను. అదే ఇక్కడ అమలు చేశాను. అందుకే మళ్లీ గెలిచాను!” అని వివరించాడు జయ్!
– ఉషాకిరణ్
కొత్త రాజకీయ తత్వశాస్త్రం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



