Tuesday, August 18, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!

ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!

- Advertisement -

గడచిన పదేండ్లలో ప్రపంచ వృద్ధి రేటులో పెద్ద మార్పు లేదు. కానీ అదే సమయంలో కొంత మంది సంపద విపరీతంగా పెరిగింది. ధనవంతుల సంఖ్యలో కూడా అదే తీరు. పేదలు మరింతగా పేదలౌతున్నారు. ఎందుకిలా జరుగు తోంది? యుబిఎస్ అనే పెద్ద స్విస్ బ్యాంకు 2026 సంవత్సర ప్రపంచ సంపద నివేదికను ఇటీవలే విడుదల చేసింది. దానిలో కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి. ఒక బిలియన్ అమెరికన్ డాలర్లు(వంద కోట్ల డాలర్లు, ప్రస్తుత విలువ ప్రకారం రూ.9,562 కోట్ల 34లక్షల,50వేలు) అంతకు మించి సంపద ఉన్నవారి సంఖ్య 2025లో ప్రపంచంలో 3,302 మంది ఉన్నారు. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 383 మంది(13.1శాతం) పెరిగారు. వీరిలో వెయ్యి మందికి పైగా అమెరికా, 562 మంది చైనా, 211 మంది మనదేశంలో ఉన్నారు. తరువాత స్థానాల్లో జర్మనీ 193, రష్యాలో 122 మంది తేలారు. సగటున వీరి సంపద అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 25శాతం పెరిగింది. ప్రపంచ వృద్ధి రేటుకు ఎన్నోరెట్లు ఎక్కువ. దక్షిణ కొరియా, హంగరీలో పెరుగుదల రేటు రెట్టింపు కాగా, చిలీలో 80, చెక్, మెక్సికోలలో 60, బ్రెజిల్, గ్రీస్‌లలో యాభై శాతానికి మించి ఉంది. ఈ వివరాలు 2025 ఏప్రిల్ నుంచి 2026 ఏప్రిల్ సమాచారం మేరకు వెల్లడించారు. దక్షిణ కొరియాలో ఏడాది కాలంలో బిలియనీర్లు 31 నుంచి 52కు పెరిగారు.

అయితే ప్రపంచ మంతటా అలాగే ఉందా? కొన్ని దేశాల్లో స్ధిరంగా, కొన్నిచోట్ల తగ్గారు. చిలీలో పెరగకపోగా థాయ్‌లాండ్‌లో 25 నుంచి 22కు, సౌదీ అరేబియాలో19 నుంచి 16కు తగ్గారు. గతంలో లక్ష రూపాయల సంపద ఉంటే లక్షాధికారి అని పిలిచారు. ఇప్పుడు వారి స్థానంలో మిలియనీర్ (అంటే కనీసం పది లక్షలు)లు వచ్చారు. ఇది కూడా అమెరికన్ డాలర్లలో లెక్కవేస్తున్నారు. ఇలాంటి వారు గతేడాది 1.5శాతం మంది పెరిగారు. దీన్నే మరో విధంగా చెప్పాలంటే రోజుకు 2,680 మంది కొత్తగా మిలియనీర్లు అయ్యారు. తూర్పు ఐరోపాలో ఈ వృద్ధి రేటు ఎక్కువగా ఉంది. గతేడాది మొత్తం పదిలక్షల మంది కొత్తగా మిలియనీర్ల జాబితాలో చేరితే వారిలో సగం మంది ఒక్క అమెరికాలోనే ఉన్నారు. ప్రపంచంలో అధిక సంపద ఉన్న దేశం అమెరికా అన్న సంగతి తెలిసిందే. అయితే అక్కడి జనాలందరూ ధన వంతులా అన్నది అసలు సమస్య. సగటు ఆదాయం, సగటు సంపదకూ, మధ్యగత రాబడి, సంపదకూ తేడా ఉంది. దాన్ని అర్ధం చేసుకుంటే వాస్తవ పరిస్థితి తెలుస్తుంది. ప్రపంచంలో అత్యంత ధనికుడు ఎలన్ మస్క్ అమెరికాలో ఉన్నాడు. అయితే అమెరికన్లందరూ ఎలన్ మస్క్‌లు కారు. మనదేశంలో అంబానీ, అదానీలు ఎలా ధనవంతులో జనం అందరి స్థితి అది కాదని తెలిసిందే. యుబిఎస్ నివేదిక 30 ధనిక ఆర్థిక వ్యవస్థలున్న దేశాల గురించి సగటున ఒక వ్యక్తి సంపద ఎంత అని విశ్లేషించింది.

ఒక దేశ సంపద విలువను జనాభాతో భాగిస్తే సగటు ఎంతో తెలుస్తుంది. ఒకడి దగ్గర లక్ష, మరొకడి దగ్గర వెయ్యి రూపాయలుంటే సగటు ఇద్దరి రూ.50,500 అవుతుంది. లొట్టలేసుకుంటూ చెప్పే ఈ అంకెలతో రెండవ వాడికి ఏమైనా ప్రయోజనం ఉంటుందా! ఈ లెక్కన స్విట్జర్లాండ్ సగటు సంపదలో మొదటి స్థానంలో ఉంటే అమెరికా రెండవది. మీడియన్ సంపద (మధ్యగత)ను చూస్తే అదే అమెరికా 28వ స్థానానికి దిగజారింది.మరో మాటలో చెప్పాలంటే 27 దేశాలు మెరుగ్గా ఉన్నాయి. దీన్ని ఎలా అర్ధం చేసుకోవాలి. ఒక ఊరిలో పది మంది ఉంటే ఒక్కొక్కరి దగ్గర వెయ్యి రూపాయలు ఉన్నాయను కుందాం. సగటున చూసినా, మధ్యగతంగా చూసినా వెయ్యి రూపాయలే ఉంటాయి. అంటే సంపద అందరి దగ్గరా సమంగా ఉన్నట్లు. అదే ఊరిలోని మరో పది మందిలో ఒకడి దగ్గర లక్ష ఉండి తొమ్మిది మంది వద్ద వెయ్యి ఉంటే సగటున ఒక్కొక్కరి దగ్గర 10,900 ఉన్నట్లు మధ్యగత సంపద వెయ్యే ఉంటుంది. రెండవదే వాస్తవం. అందుకే సగటు సంపదలో అమెరికా రెండవది, మధ్యగతంలో 28వది. మరో ఉదాహరణగా బ్రిటన్‌‌ను చూద్దాం. ముప్ఫయి దేశాల జాబితాలో సగటులో 21, మధ్యగతంలో 13వదిగా ఉంది. దీని అర్ధం ఏమిటంటే అమెరికా కంటే సాధారణ పౌరుల పరిస్థితి బ్రిటన్‌లో మెరుగ్గా ఉంది, అసమానతలు తక్కువగా ఉన్నట్లు. మరికొన్ని వివరాలను చూద్దాం.అమెరికన్ డాలర్ల ప్రాతిపదికన సంపద విలువ.

దేశం మధ్యగత సగటు గినీ
చైనా 27,273 75,731 70.9
భారత్ 3,755 16,500 80.2
పాక్ 2,076 5,226 74.4
బంగ్లా 3,842 9,786 75.0
నేపాల్ 1,685 4,672 77.6
శ్రీలంక 8,615 23,991 77.2

ఎగువన ఉన్న అంకెలు చెబుతున్నదేమిటి? గినీ కోయఫిషియంట్ ప్రాతిపదికన 0 నుంచి 100వరకు పాయింట్లను చూస్తే ఎంత తక్కువ ఉంటే అంతగా అసమానతలు తక్కువగా, ఎంత ఎక్కువ ఉంటే అంతగా ఎక్కువ ఉన్నట్లు పరిగణిస్తారు. ఇదే విధంగా సగటుతో పోల్చినపుడు మధ్యగత ఎక్కువగా ఉంటే జనాల రాబడి లేదా సంపద ఎక్కువగా ఉన్నట్లు. ఈ వివరాల ప్రకారం చైనాలో కూడా సంపద అసమానతలు ఉన్నాయి. మనదేశం, ఇతర ఇరుగుపొరుగు దేశాలతో పోల్చితే తక్కువగా గిని ఉందంటే అర్ధం అసమానతలు తక్కువగా ఉన్నట్లు పరిగణిస్తున్నారు. మనం అగ్ర స్థానంలో ఉన్నాం. అమెరికాలో 77 ఉంది. ప్రజాస్వామిక దేశాలలో ఇంతగా అసమానతలు ఉండటం ఏమిటి? అక్కడే తొలి ట్రిలియనీర్-ఎలన్‌మస్క్ అవతరించాడు. మన నేతలు జీడీపీ చూశారా ‘యుపిఏ హయాంకంటే మేం పెంచాం’ అని గొప్పలు చెప్పుకుంటున్నారు. జీడీపీ అంటే సంపద కాదు, ఒక ఏడాదిలో వస్తువులు, సేవల ద్వారా సృష్టించిన ఉత్పత్తి విలువ. తాము 2024 నాటికి ఐదులక్షల కోట్ల డాలర్ల స్థాయికి జీడీపీని పెంచుతామని మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంది. మోడీ అధికారంలోకి వచ్చినపుడు 2014లో 2.04లక్షల కోట్లుగా ఉన్నది 2026లో 4.15లక్షల కోట్లకు(అంచనా) చేరింది. ఇప్పుడు 2029 నాటికి ఐదు లక్షల కోట్లకు చేరుస్తామని కొత్త గడువు చెప్పారు.

సోవియట్ యూనియన్ రద్దయిన తరువాత రష్యాలో ఉన్న ప్రభుత్వ సంపదలన్నింటినీ కొంతమంది పెద్దలు కొట్టేశారు. అమెరికా నయా ఉదారవాద పెట్టుబడిదారీ మేధావులు ఇచ్చిన సలహాల మేరకు ఇది జరిగింది. పుతిన్ ఇతర నేతలు వారి సలహాను పాటించారు గనుక రష్యా పోటీకి రాకుండా ఉండేందుకు ధనికదేశాల్లో ఒకటిగా పరిగణించి రాజీమార్గంగా జి7 కూటమిని జి8గా కూడా మార్చారు. అయితే ఆ ప్రయోగం వికటించింది. ఆర్థిక అసమానతలు చాలా ఎక్కువగా ఉన్న దేశాలలో ఇప్పుడు రష్యా ఒకటి. ఇక గల్ఫ్ దేశాలలో ఐక్య అరబ్ రిపబ్లిక్(యుఏయి) అసమానతలు విపరీతంగా ఉన్న సమాజం. దాని జనాభాలో కేవలం 13శాతం మంది మాత్రమే పౌరులు, మిగిలిన వారంతా వలస కూలీలే. ఆధునిక బానిసదేశంగా దాన్ని పరిగణిస్తారు. సంపదల అసమానతల గురించి ఫ్రెంచి ఆర్థికవేత్త గాబ్రియెల్ జక్‌మాన్ చేసిన విశ్లేషణ ప్రకారం అమెరికాలో కేవలం 19 మంది ధనికుల వద్ద 14శాతం వరకు జాతీయ ఆదాయం పోగుపడింది. దాని చరిత్రలో ఎన్నడూ సంపద ఇలా కేంద్రీకతం కాలేదు.

పదిశాతం ధనికుల వద్ద 50 శాతం ఆదాయ వృద్ధి ఉండగా దిగువ 50శాతం మంది వద్ద 15 నుంచి 20శాతమే ఉన్నట్లు కూడా జక్‌మాన్ చెప్పాడు.అమెరికా ఆర్థిక వ్యవస్థ వినిమయ ఖర్చు మీద ఆధారపడేట్లు చేశారు. పదిశాతం మంది ధనికులు యాభై శాతం ఖర్చు చేస్తుండగా ఇటీవలి కాలంలో దిగువ 60శాతం వాటా తగ్గిపోతున్నట్లు తేలింది.పారిశ్రామిక వద్ధి తగ్గటం, దిగుమతుల మీద ఆధారపడటం, కార్మికులకు వేతనాల పెరుగుదల మందగించటంతో రాబడి తగ్గటం వంటి కారణాలు అత్యధికుల్లో వినిమయం పడిపోవటానికి దారి తీస్తున్నది.1950 దశకంలో అమెరికా జీడీపీలో ఉత్పాదకరంగం వాటా 25శాతం ఉండగా ఇప్పుడు పదిశాతానికి పడిపోయింది.ఫైర్ రంగం అంటే ఫైనాన్స్, ఇన్సూరెన్స్, రియలెస్టేట్ వాటా 1947లో పదిశాతం ఉండగా ఇప్పుడు 21శాతానికి చేరింది. ఈ రంగం వృద్ధి కార్పొరేట్ కంపెనీలు, వాటిలో పని చేసే నిపుణులకు తప్ప సాధారణ కార్మికులకు రాబడి పెరగదు. తలసరి జీడీపీ పెరగవచ్చుగానీ జనాల జీవన ప్రమాణాలు ఆమేరకు పెరగటం లేదు.

ప్రపంచ ఇనీక్వాలిటీ లాబ్ (అసమానతల ప్రయోగశాల) సమాచారం ప్రకారం ప్రస్తుతం మన దేశంలో ఒక శాతం మంది చేతుల్లో 40.1శాతం సంపద పోగుపడగా రాబడిలో వారి వాటా 22.6శాతం ఉంది.(కొందరి అంచనా మేరకు 2022లో 25శాతం ఉంది) బ్రిటీష్ వారి ఏలుబడిలో 1922 నుంచి 1947 వరకు రాబడిలో ఎగువ ఒకశాతం వాటా 20-21శాతం మధ్య ఉందని అంచనా. అది స్వాతంత్య్రం తరువాత 1961నాటికి 13శాతానికి తగ్గింది.1991 నుంచి అమలు చేసిన నూతన ఆర్థిక విధానాల ఫలితంగా బ్రిటీష్ కాలం నాటి కంటే సంపద, రాబడి కేంద్రీకరణ ఎక్కువైంది. అమెరికాలో పాతకాలం నాటి రాక్‌ఫెల్లర్, ఫోర్డ్, జెపి మోర్గాన్ వంటి వారిని వెనక్కు నెట్టి ఇప్పుడు ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్, మార్క్ జుకర్‌బెర్గ్ వంటివారు ఎలా ముందుకు వచ్చారో మనదేశంలో టాటా, బిర్లా, గోయంకాలను దాటి అంబానీలు, అదానీలు దూసుకుపోవటాన్ని మనం చూడవచ్చు. ప్రపంచంలో ఆదాయ అసమానతల పెరుగుదల గురించి ఎంత చెప్పుకున్నా తరగదు. అమెరికాలో 2025 వివరాలను చూసినపుడు ఒక కంపెనీ సిఇఓ-కార్మికుడి వేతన వ్యత్యాసం ఆకాశానికి అంటినట్లు తేలింది. టెస్లా కంపెనీలో ఒక కార్మికుడి మధ్యగత ఆదాయం కంటే దాని అధిపతి ఎలన్ మస్క్‌కు 25లక్షల రెట్లు ఉందన్నది నమ్మలేని నిజం.

అమెరికా కార్మిక సంఘాల సమాఖ్య ఎఎఫ్‌ఎల్-సిఐఓ వార్షిక వేతన నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. స్టాండర్డ్ అండ్ పూర్ 500 కంపెనీల జాబితాను పరిశీలించినపుడు మధ్యగత వేతనంతో పోల్చితే ఉన్నతాధికారులకు 285రెట్లు అదనంగా ఇస్తున్నారు. ఇదే కంపెనీల సిఇఓల వేతనం 1,700శాతం ఎక్కువ. ఈ వ్యత్యాసం అన్ని రంగాలలో ఒకే విధంగా లేదు. ఉత్పాదకరంగంలో ఏడాదికి సగటున ఒక సిఇఓ 69.6 కోట్ల డాలర్లు పొందుతుండగా కార్మికుడు 93వేల డాలర్లు మాత్రమే తీసుకుంటున్నాడు.అధ్యక్షుడు ట్రంప్ రెండవసారి అధికారానికి రావటానికి ముందు కంటే గతేడాది అతగాడి రాబడి 254 రెట్లు పెరిగింది. వరల్డ్ లిబర్టీ ఫైనాన్సియల్ ట్రంప్ కుటుంబ క్రిప్టో కరెన్సీ కంపెనీ, దాన్నుంచి గతేడాది 220 కోట్ల డాలర్ల ఆదాయాన్ని పొందాడు. ఈ మొత్తం ఒక సాధారణ అమెరికన్ కార్మికుడి రాబడితో పోల్చితే 43,154 రెట్లు ఎక్కువ. స్టాక్‌మార్కెట్‌లో మన కార్పొరేట్, పెద్ద కంపెనీల సిఇఓల వేతనం సాధారణ కార్మికుడి మధ్యగత వేతనం కంటే రెండువందల రెట్లు ఎక్కువ, అమెరికా తరువాత అంత తేడా ఉన్న ఘనత మనదే, ఎటువైపు పయనిస్తున్నట్లు!

ఎం కోటేశ్వరరావు
8331013288

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -