Tuesday, August 18, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిహంతకులెవరు? శిక్ష‍లేవి?

హంతకులెవరు? శిక్ష‍లేవి?

- Advertisement -

ఒక మనిషిని తుపాకీతో చంపవచ్చు. కానీ, అతను సమాజంలో నాటిన ప్రశ్నలను చంపగలరా? మూఢనమ్మ కాలపై పోరాడుతూ శాస్త్రీయ ఆలోచనను ప్రజల్లోకి తీసుకెళ్లిన హేతువాది డాక్టర్‌ నరేంద్ర దభోల్కర్‌ హత్య జరిగి రేపటికి పదమూడేండ్లు. ఈ హత్య వెనుక ఉన్న కుట్రకు సంబంధించిన అనేక ప్రశ్నలు ఇంకా సమాధానం కోసం ఎదురు చూస్తుండగానే తాజాగా ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న సచిన్‌ అంధూరేకు బాంబే హైకోర్టు మంగళవారం బెయిల్‌ మంజూరు చేసింది. అప్పీల్‌ తేలేవరకు అతనికి విధించిన జీవిత ఖైదును సస్పెండ్‌ చేసింది. అంతకుముందే ఇదే కేసులో మరోదోషి శరద్‌ కలస్కర్‌కు ఏప్రిల్‌లో బెయిల్‌ లభించింది. దీంతో దభోల్కర్‌ హత్యలో దోషులుగా తేలిన ఇద్దరూ ప్రస్తుతం జైలునుంచి బయటకు వచ్చే వీలు ఏర్పడింది. హైకోర్టు అంధూరేను నిర్దోషిగా ప్రకటించ లేదు. కానీ, ఆయన దోష నిర్ధారణపై అప్పీల్‌ పెండింగ్‌లో ఉన్నందున శిక్షను సస్పెండ్‌ చేసి బెయిలిచ్చింది. ఇది దబోల్కర్‌ ‌కుటుంబానికే కాదు, దేశంలోని హేతువాద ఉద్యమానికి నిరాశ కలిగించే పరిణామం. 2013 ఆగస్టు 20 ఉదయం పూణెలో మార్నింగ్‌ వాక్‌కు వెళ్లిన దభోల్కర్‌ను మోటార్‌ సైకిల్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు కాల్చి చంపారు. అప్పటికి ఆయన వయసు అరవై ఏడు. మహారాష్ట్ర అంధశ్రద్ధ నిర్మూలన సమితి ద్వారా శాస్త్రీయ దృక్పథాన్ని ప్రజల్లో పెంపొందిం చేందుకు ఆయన నిరంతరం కృషి చేశారు.

మూఢనమ్మకాలు, మతం పేరుతో జరిగే దోపిడీ, మోసాలను ప్రశ్నించారు. దభోల్కర్‌ హత్య తర్వాత గోవింద్‌ పన్సారే, ఎం.ఎం. కల్బుర్గి, గౌరీ లంకేశ్‌ హత్యలు చోటు చేసుకోవడం మరింత ఆందోళన కలిగించాయి. హేతువాద స్వరాలను లక్ష్యంగా చేసుకున్న హింసపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ హత్యల్లో ఆరెస్సెస్‌, సంఘ్‌ ‌పరివార్‌ ప్రోద్బలం ఉందనే ఆరోపణలూ వచ్చాయి.
ముందు స్థానిక పోలీసులచే ఈ కేసు దర్యాప్తు కొనసాగినా 2014లో బాంబే హైకోర్టు ఆదేశాలతో సీబీఐ చేపట్టింది. అయితే దర్యాప్తు సాగినతీరు మొదటినుంచీ అనేక సందేహాలకు తావిచ్చింది. సీబీఐ తొలుత సారంగ్‌ అకోల్కర్‌, వినయ్‌ పవార్‌లను షూటర్లుగా పేర్కొంది. ఆ తర్వాత సచిన్‌ అంధూరే, శరద్‌ కలస్కర్‌లే కాల్పులు జరిపారని తన వాదన ను మార్చింది. ఇప్పుడు హైకోర్టు అంధూ రేకు బెయిల్‌ ఇవ్వడానికి దర్యాప్తు లోని లోపాలనే ప్రధానంగా పరిగణిం చింది. ప్రత్యక్ష సాక్షులు అంధూరేను గుర్తించినది ఘటన జరిగిన ఎనిమిదేండ్ల తర్వాత కావడం, సాధారణంగా నిర్వహించే టెస్ట్‌ ఐడెంటిఫికేషన్‌ పరేడ్‌ జరగక పోవడం, నిందితుడి ఫొటోలను చూపించి గుర్తింపు పొందిన విధానంపై కోర్టు తీవ్ర సందేహాలు వ్యక్తం చేయడం వంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి. అంతేకాదు, హత్యకు ఉపయోగించిన ఆయుధం కూడా స్వాధీనం కాలేదు. ఈ సాక్ష్యాల బలహీనత కారణంగా అప్పీల్‌లో అంధూరే నిర్దోషిగా తేలే అవకాశం ఉందని కూడా హైకోర్టు అభిప్రాయపడింది.

ఇదిలా ఉంటే దేశంలో ఏ తప్పుచేయని వారు, దేశద్రోహం, ఉపా కింద అరెస్టయి ఎంతోమంది జైళ్లలోనే మగ్గుతున్న పరిస్థితి ఉంది. ప్రొఫెసర్‌ ‌సాయిబాబా ఉదంతం తెలిసిందే కదా. సాక్ష్యాలు సరిగా లేవనే పేరుతో కోర్టు కేసును కొట్టిపారేసింది. అప్పటికే ఆయన జీవితం తొమ్మిందేండ్ల పాటు జైల్లోనే మగ్గింది. విచారణలోనే ఇంత శిక్ష అనుభవించిన ఆయన చివరకు జైళ్లోనుంచి బయటకు వచ్చాక కొద్ది రోజులకే చనిపోయారు. జేఎన్‌‌యూ విద్యార్థి ఉమర్‌ ‌ఖలీద్‌ ‌దేశద్రోహం కింద అరెస్టు గావించబడి జైళ్లోనే ఉన్నాడు. విప్లవ రచయిత వరవరరావు లాంటి వారు కూడా సుదీర్ఘ శిక్షను అనుభవించి పోలీసుల ఆంక్షల మధ్య జీవితం గడుపుతున్నాడు. మరోవైపు తన ఆశ్రమంలో మహిళలపై లైంగిక దాడులకు పాల్పడి, అనేకమందిని హత్యచేశాడన్న ఆరోపణలపై దోషిగా నిర్దారించబడిన డేరాబాబా లాంటి వారికి ఎన్నిసార్ల యినా బెయిల్‌ అభిస్తుంది. పెరోల్‌‌పై బయట తిరిగే స్వేచ్ఛ ఉంటుంది. దబోల్కర్‌ ‌లాంటి హేతువాది హత్యకు గురైతే కనీసం నిందితులను సరైన సాక్ష్యాలతో శిక్షించే పరిస్థితి లేకపోవడవం విచారకరం.

ఇక్కడ న్యాయవ్యవస్థను ప్రశ్నించడం ఉద్దేశం కాదు, కోర్టు తీర్పును గౌరవించాల్సిందే. ఈ కేసుపై దబోల్కర్‌ ‌కుటుంబం సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పడం న్యాయంపై ఇంకా వారికి నమ్మకం మిగిలే ఉంది. కానీ దర్యాప్తు నిజాయితీగా సాగివుంటే నిందితులకు ఈ రోజు బెయిల్‌ ‌వచ్చేది కాదు. అందుకే దర్యాప్తు సంస్థల పనితీరును కూడా కోర్టు ప్రశ్నించడం అవసరం. దీన్ని ఒక క్రిమినల్‌ కేసుగా చూడరాదు. హేతువాదం అంటే ఏ మతాన్నీ అవమానించడం కాదు, ప్రశ్నించే హక్కును, శాస్త్రీయ దృక్పథాన్ని, ఆధారాలతో ఆలోచించే స్వేచ్ఛను సమాజంలో బలపరచడం. అలాంటి ఆలోచనలను వ్యక్తం చేసే వ్యక్తి హత్యకు గురైనప్పుడు, హంతకుల వెనుక కుట్రను వెలికితీయడం ప్రభుత్వాల బాధ్యత. ఇప్పటికైనా నిందితులెవరు, వారి వెనుక ఉన్న శక్తులెవరు, హత్యకు ఉపయోగించిన ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయి, కుట్రకు ఎవరు సహకరించారు వంటి ప్రశ్నలకు సమాధానాలు దొరికేవరకు ఈ కేసుకు సంపూర్ణ న్యాయం జరిగినట్టుకాదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -