Sunday, May 10, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంశాంతి చర్చలు విఫలమైతేప్రాజెక్ట్‌ ఫ్రీడమ్‌ ప్లస్‌ : ట్రంప్‌

శాంతి చర్చలు విఫలమైతేప్రాజెక్ట్‌ ఫ్రీడమ్‌ ప్లస్‌ : ట్రంప్‌

- Advertisement -

దౌత్య పరిష్కారానికి మోకాలడ్డుతోంది అమెరికాయే : ఇరాన్‌
వచ్చే వారం ప్రారంభంలో తిరిగి సంప్రదింపులు ?

నవతెలంగాణ-జనరల్‌ డెస్క్‌
ఇరాన్‌తో శాంతి చర్చలు విఫలమైతే తన ప్రభుత్వం తిరిగి ‘ప్రాజెక్ట్‌ ఫ్రీడమ్‌’ను చేపడుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు. గల్ఫ్‌లో ఉద్రిక్తత లు పెరుగుతున్నాయని, హార్ముజ్‌ జలసంధిలో వాణిజ్య నౌకలు చిక్కుబడిపోయాయని, ఇలాంటి పరిస్థితులలో తన ప్రభుత్వం తిరిగి ‘ప్రాజెక్ట్‌ ఫ్రీడమ్‌’ను ప్రారంభించవచ్చునని ఆయన తెలిపారు. హార్ముజ్‌లో వాణిజ్య నౌకలు స్వేచ్ఛగా ప్రయాణించేందుకు వీలుగా వాటికి రక్షణ కల్పించేందుకు ట్రంప్‌ ప్రభుత్వం ‘ప్రాజెక్ట్‌ ఫ్రీడమ్‌’ను చేపట్టడం, పాకిస్తాన్‌ తదితర దేశాల అభ్యర్థనతో దానిని రెండు మూడు రోజులకే నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఇరాన్‌పై జరిపిన సైనిక చర్యలో అత్యద్భుత సైనిక ప్రయోజనాలు సాధించామని, ఇరాన్‌ ప్రతినిధులతో జరుగుతున్న చర్చలలో ఒప్పందం దిశగా పురోగతి సాధించామని, అందుకే ‘ప్రాజెక్ట్‌ ఫ్రీడమ్‌’ను నిలిపివేస్తున్నామని కూడా ఆయన చెప్పుకొచ్చారు. వర్జీనియాలోని స్టెర్లింగ్‌లో ఉన్న తన గోల్ఫ్‌ కోర్స్‌లో విందుకు హాజరయ్యేందుకు వెళుతూ శుక్రవారం ట్రంప్‌ విలేకరులతో మాట్లాడారు. ‘ప్రాజెక్ట్‌ ఫ్రీడమ్‌’ తిరిగి ప్రారంభ మైతే అది ‘ప్రాజెక్ట్‌ ఫ్రీడమ్‌ ప్లస్‌’గా విస్తృతమ వుతుందని ఆయన తెలిపారు.

ఒప్పందంపై సంతకాలు జరగకపోతే తాము వేరే దారిలో నడుస్తామని ట్రంప్‌ బెదిరిం చారు. ‘ప్రాజెక్ట్‌ ఫ్రీడమ్‌ మంచి దని నేను అనుకుంటున్నాను. అయితే ఆ పని చేయడానికి మాకు వేరేదారులు కూడా ఉన్నా యి. పనులు అనుకున్న విధంగా జరగక పోతే మేము తిరిగి ప్రాజెక్ట్‌ ఫ్రీడమ్‌ వైపు వెళతాము. అయితే అది ప్రాజెక్ట్‌ ఫ్రీడమ్‌ ప్లస్‌ అవుతుంది. అంటే ప్రాజెక్ట్‌ ఫ్రీడమ్‌తో పాటు ఇతర అంశాలు కూడా ఉంటాయి’ అని నర్మగర్భంగా చెప్పారు. ఇరాన్‌ ఉద్దేశపూర్వకంగానే చర్చలను జాప్యం చేస్తోందా అని ప్రశ్నించగా ఆ విషయం చెప్పలేనని అన్నారు. ఇదిలావుండగా చర్చల సందర్భంగా దౌత్య పరిష్కారం ప్రస్తావనకు వచ్చిన ప్రతిసారీ అమెరికా నిర్లక్ష్య ధోరణితో సైనిక సాహసానికి పాల్పడుతూనే ఉన్నదని ఇరాన్‌ విదేశాంగమంత్రి అబ్బాస్‌ అరాగ్చీ ఆరో పించారు. దౌత్య పరిష్కారానికి మోకాలడ్డుతోంది అమెరికా యేనని మండిపడ్డారు. ఇరాన్‌ ఎన్నటికీ ఒత్తిడులకు లొంగబోదని ఆయన సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో స్పష్టం చేశారు.

వచ్చే వారం పాక్‌లో శాంతి చర్చలు ?
అమెరికా, ఇరాన్‌ దేశాలు వచ్చే వారం ప్రారంభంలో ఇస్లామాబాద్‌లో తిరిగి శాంతి చర్చలను ప్రారంభిస్తాయని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పత్రిక తెలిపింది. ఇరు పక్షాలు 14 సూత్రాల అవగాహనా పత్రం (ఎంఓయూ)పై మధ్యవర్తులతో మంతనాలు జరుపుతున్నాయి. ఘర్షణలకు ముగింపు పలకడానికి అవసరమైన కార్యాచరణను రూపొందించడానికి ఈ ఎంఓయూ దోహదపడుతుంది. ప్రతిపాదిత ఎంఓయూలో ఇరాన్‌ అణు కార్యక్రమం, హార్ముజ్‌లో ఉద్రిక్తతల నివారణ, ఇరాన్‌లో శుద్ధి చేసిన యురేనియం నిల్వలను వేరే దేశానికి తరలించడం వంటి అంశాలు కూడా ఉన్నాయని వాషింగ్టన్‌ పోస్ట్‌ పత్రిక తెలిపింది. వీటిలో అనేక ప్రధాన అంశాలు ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉన్నాయన్న విషయం తెలిసిందే. ఇరాన్‌పై గతంలో విధించిన ఆంక్షలను తొలగించే అంశంపై ఇరు పక్షాల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ అంశమే చర్చల ప్రక్రియను జాప్యం చేయవచ్చునని లేదా సంక్లిష్టం చేయవచ్చునని అంటున్నారు.

యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలతో హోరెత్తుతున్న జపాన్‌
యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలతో జపాన్‌ హోరెత్తి పోతోంది. వేలాది మంది ప్రదర్శకులు ప్లకార్డులు, జాతీయ పతాకాలు చేబూని ‘యుద్ధం వద్దు’ అంటూ నినాదాలు చేస్తున్నారు. జపాన్‌లో యుద్ధ వ్యతిరేక భావనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. గత సంవత్సరం అక్టోబరులో అధికారంలోకి వచ్చిన తర్వాత జపాన్‌ ప్రధాని సానే తకైచీ పలు చర్యలు చేపట్టారు. ఆయుధ ఎగుమతులపై దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఆంక్షలను ఎత్తివేశారు. పలు దేశాలలో జపాన్‌ సైనిక పాత్రను విస్తరించారు. ఉద్రిక్తతలు పెరుగుతున్న ప్రాంతంలో ఇలాంటి చర్య లు అవసరమేనని ప్రభుత్వం సమర్ధించుకుం టోంది. అయితే జపనీయులు మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు జపాన్‌ యుద్ధ సామర్ధ్యాన్ని పెంచుకుంటుంటే మరోవైపు నిరసనలు కూడా పెరిగిపో తున్నాయి. సాధారణంగా జపాన్‌ ప్రజలలో సంయమనం ఎక్కువ.

సామాజిక సామరస్యానికి విఘాతం కలిగించ రాదన్న అభిప్రాయం ప్రజలలో ఉంటుంది. అయినప్పటికీ ప్రజలు వీధులలోకి వచ్చి నిరసన తెలుపుతున్నారంటే యుద్ధ వ్యతిరేకత ఏ స్థాయికి చేరిందో అర్థమవుతుంది. భౌగోళికంగా చూస్తే పొరుగున ఉన్న చైనా, ఉత్తర కొరియా, సమీపాన ఉన్న రష్యా నుంచి జపాన్‌కు సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితులలో భద్రతాపరంగా మరింత క్రియాశీలక పాత్ర పోషించాలంటూ జపాన్‌ను మిత్రదేశమైన అమెరికా ప్రోత్సహిస్తోంది. కాగా ప్రాణాంతక ఆయుధాల ఎగుమతులపై అమలులో ఉన్న ఆంక్షలను ఏప్రిల్‌ 21న జపాన్‌ ఎత్తివేసింది. తీవ్రమైన భద్రతా వాతావరణంలో భాగస్వామ్య దేశాలు ఒకరికొకరు బాసటగా నిలవాల్సిన అవసరం ఉన్నదని వాదించింది. అయితే ఈ నిర్ణయం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రధాని నివాసం ఎదుట జరిగిన యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలో పెద్ద వారే కాకుండా యువతీ యువకులు కూడా భాగస్వాములవడం విశేషం.

అమెరికాలో ఇంధన కొరత పట్టించుకోని ట్రంప్‌ ప్రభుత్వం
బాల్టిమోర్‌ : ఇంధన కొరత అమెరికాను వెంటాడుతోంది. అయినప్పటికీ డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం దీనిని పట్టించు కోవడం లేదు. ఇంధన ప్రాజెక్టులపై దృష్టి సారించకుండా ఆఫ్‌షోర్‌ విండ్‌ డెవలపర్లకు (సముద్ర తీరంలో లేదా లోతైన సముద్ర జలాలలో పవన శక్తి నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ప్రాజెక్టు లకు రూపకల్పన చేసి, వాటిని నిర్మించి నిర్వహించే సంస్థలు) సుమారు రెండు బిలియన్‌ డాలర్ల పన్ను చెల్లింపుదారుల సొమ్మును ధారాదత్తం చేసేందుకు ట్రంప్‌ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. రాజకీయ దురుద్దేశంతో కూడుకున్న ఈ చర్య అమెరికన్లపై మోయలేని ఆర్థిక భారం మోప బోతోంది. అమెరికాలో ఆఫ్‌షోర్‌ ఇంధన ప్రాజెక్టుల కోసం అనేక సంవత్సరాలుగా క్షేత్ర స్థాయిలో పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టులు ఉద్యోగాలు కల్పిస్తాయని, ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయని ప్రచారం జరుగుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -