– మృతదేహం కోసం బాధిత కుటుంబం ఎదురుచూపులు
నవతెలంగాణ – నిజామాబాద్ డెస్క్ : నిజామాబాద్ నగరంలోని గాజులపేట్ కు చెందిన యువకుడు నీల సాయికుమార్ గుప్త (30) పూరి జగన్నాథ్ లోని గుండం లో ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. రెండు రోజుల క్రితం మృతిచెందగా ఆలస్యంగా వెలుగులోకి లోకి వచ్చింది. యువకుడి తల్లిదండ్రులు వృద్ధులు కాగా వారికి వెనుక ముందు ఎవరూ లేకపోవడంతో పుట్టడు శోకంలో మృతదేహం కోసం ఎదురుచూస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. నగరంలోని గాజులపేట కు చెందిన నీల సాయికుమార్ గుప్త (30) ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నారు. నిరుపేద కుటుంబం కావడంతో పని చేస్తేనే పూట గడిచే పరిస్థితి. వృద్ధ తల్లిదండ్రులు సాయికుమార్ మీదే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.
కాగా ఓ ట్రావెల్స్ సంస్థ వారు దేవాలయాల సందర్శనార్థం టూరిస్ట్ బస్సు తీయగా పలువురు కాలనీవాసులతోపాటు సాయికుమార్ కూడా వెళ్ళాడు. వివిధ ఆలయాల దర్శనాలు చేసుకుంటూ పూరి జగన్నాథ్ కు చేరుకున్నారు. అక్కడ దైవ దర్శనానికి ముందు స్నానం చేసేందుకు గుండంలో దిగగా ప్రమాదవశాత్తు నీటిమునిగి మృతి చెందాడు. ఈ ఘటన రెండు రోజుల క్రితం చోటు చేసుకోగా సదరు ట్రావెల్స్ సంస్థ నిర్వాహకులు ఇప్పటికీ అందుబాటులోకి రాకపోవడం. బస్సు డ్రైవర్ స్థానికుల ద్వారా సమాచారం ఇవ్వడంతో వారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఘటన చోటు చేసుకున్న ఇప్పటికీ మృతదేహం ఇంటికి చేరలేదని దీనంగా ఎదురు చూస్తున్నారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణ గుప్తా స్పందించి తమ కొడుకు మృతదేహాన్ని తెప్పించేందుకు చొరవచూపి తమను ఆదుకోవాలని యువకుడి తల్లిదండ్రులు కోరుతున్నారు.



