అమెరికా ప్రతిపాదనను సమీక్షిస్తాం : ఇరాన్ వెల్లడి
కొనసాగుతున్న ఉద్రిక్తతలు
లెబనాన్‌పై ఇజ్రయిల్ దాడి.. ఐదుగురు మృతి
టెహ్రాన్: పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతుండగా అమెరికా ప్రతిపాదనను ఇరాన్ ఇంకా సమీక్షిస్తోందని, ”సరైన సమయంలో” స్పందిస్తాంమని ఆ దేశ ప్రభుత్వ మీడియా తెలిపింది. అయితే, ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయి శనివారం మీడియాతో మాట్లాడుతూ, ప్రతిపాదనను సమీక్షిస్తున్నాం, కానీ అమెరికా ఒత్తిడి చేస్తుందని విమర్శించారు. వారు గడువు నిర్దేశించినంత మాత్రాన అయిపోదు, మా పని మేము చేసుకుపోతాం, గడువులు, అల్టిమేటాలను పట్టించుకోం అని బఘాయి స్పష్టం చేశారు. అయితే అమెరికా ప్రతిపాదనలను ఇరాన్ నిశితంగా పరిశీలిస్తున్నదని తెలుస్తోంది. మరోవైపు అమెరికా ఇరాన్‌పై ఒత్తిడి పెంచెందుకు మరిన్ని ఆంక్షలను విధించింది. ఇరాన్ సైన్యానికి ఆయుధాలు, డ్రోన్‌ల తయారిలో ఉపయోగించే ముడి పదార్ధాలను సరఫరా చేయకూడదని చైనా, హాంకాంగ్‌తో సహా పలు దేశాలు,సంస్థలపై కఠిన ఆంక్షలు విధిస్తున్నామని అమెరికా ట్రెజరీ ప్రకటించింది. అలాగే ఇరాన్‌తో ఇతర వస్తువులు, ఉత్పత్తులు వాణిజ్యం జరిపే దేశాలపై కూడా త్వరలో ఆంక్షలు ఉంటాయని తెలిపింది. అయితే ట్రంప్ కొద్ది రోజుల్లో చైనాలో పర్యటించాల్సిన సమయంలో ఈ ప్రకటన చేయడం గమనార్హం. అయితే ఈ విషయంపై ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ స్పందిస్తూ వలసవాదం, దోపిడికి చోటు లేదన్నారు. ఇరాన్ పరస్పర గౌరవం, భాగస్వామ్య ప్రయోజనాల ఆధారంగా ఇతర దేశాలతో స్నేహపూర్వక సంబంధాలను విస్తరించడానికి ఇరాన్ కట్టుబడి ఉందన్నారు.
కొనసాగుతున్న ఇజ్రాయిల్ దాడులు..
కాల్పుల విరమణ ఒప్పందం ఉన్పప్పటికీ దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయిల్ వైమానిక దాడులను కొనసాగిస్తుంది. శనివారం ఇజ్రాయిల్ సైన్యం హిజ్బుల్లా ఉన్న సమీప ప్రాంతాలను ఖాళీ చేయాల్సిందిగా హెచ్చరించింది. అనంతరం దాడులకు తెగబడింది. జ్రారియే పట్టణంపై వైమానిక దాడులు చేసింది. దీంతో పట్టణంలో పలు నివాశాలు, భవనాలు ధ్వంసం అయ్యాయి.
అమెరికా వైఖరి అంతర్జాతీయ శాంతికి
ముప్పు : ఇరాన్
ఐక్యరాజ్యసమితిలో ఇరాన్ శాశ్వత ప్రతినిధి అమీర్-సమృద్ ఇరావాని, హర్మూజ్ జలసంధి సమీపంలో సైనిక చర్యల ద్వారా కాల్పుల విరమణను ఉల్లంఘించిందని విమర్శించారు, ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్, ఐరాస భద్రతా మండలి అధ్యక్షుడికి రాసిన లేఖలో, జాస్క్ పోర్ట్, హార్మూజ్ జలసంధి సమీపంలో రెండు ఇరాన్ చమురు ట్యాంకర్లపై అమెరికా సైనిక చర్య, ఇరాన్ తీర ప్రాంతాలపై దాడులతో పాటు, ”కాల్పుల విరమణ స్పష్టమైన ఉల్లంఘన” , ”ఐరాస చార్టర్ ఆర్టికల్ 2, పేరా 4 స్థూల ఉల్లంఘన” అని ఇరావాని తెలిపారు. పర్షియన్ గల్ఫ్, హోర్ముజ్ జలసంధిలో కొనసాగుతున్న అమెరికా సైనిక కార్యకలాపాలు ప్రాంతం దాటి విస్తరించి అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు కలిగించే ”భయంకరమైన పరిస్ధితులను” కలిగిస్తున్నాయని ఆయన హెచ్చరించారు.
అగ్నిప్రమాదంలో
భారతీయ నావికుడు మృతి..
హర్మూజ్ జలసంధి సమీపంలో నౌకలో అగ్ని ప్రమాదం జరిగింది. దీనిలో ఒక భారతీయ నావికుడు మరణించాడని, అనేక మంది గాయపడ్డారని మీడియా కథనాలు తెలిపాయి. క్షతగాత్రులను దుబారులోని ఆసుపత్రిలో చేర్పించారు. వీరిని దుబారులోని భారత కాన్సులేట్ అధికారులు కలిసి అవసరమైన సహాయసహకారాలు అందిస్తున్నారు. అయితే ఈ సంఘటన శుక్రవారం జరిగిందని తెలుస్తుంది. దీనిలో 17 మంది భారతీయ సిబ్బందిని రక్షించారని, అగ్నిప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా నిర్ధారించలేదని మీడియా తెలిపింది.



