Thursday, July 9, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంమౌలిక సదుపాయాలపై అమెరికా టార్గెట్

మౌలిక సదుపాయాలపై అమెరికా టార్గెట్

- Advertisement -

ఇరాన్‌లోని పలు ప్రాంతాల్లో పేలుడు శబ్దాలు దాడుల్లో 14 మంది ఇరానీయులు మృతి
గల్ఫ్‌లో అమెరికా సైనిక స్థావరాలు, వ్యూహాత్మక సౌకర్యాలపై టెహ్రాన్ ఎదురు దాడి

నవతెలంగాణ – జనరల్ డెస్క్
మధ్యప్రాచ్యంలో రెండో రోజూ దాడులు కొనసాగాయి. ఇరాన్‌తో కుదిరిన ఎంఓయూకు కాలం చెల్లిపోయిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన తర్వాత పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అమెరికా సేనలు బుధవారం రాత్రి నుంచి ఇరాన్ లక్ష్యాలపై పెద్ద ఎత్తున దాడులు చేశాయి. దీనికి ప్రతిగా ఇరాన్ కూడా కువైట్, బహ్‌రైన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై విరుచుకుపడింది. మొత్తంగా మంగళ, బుధ వారాలలో 170 ఇరాన్ లక్ష్యాలపై అమెరికా దాడులు జరిపింది. అమెరికా క్రూయిజ్ క్షిపణి ఒకటి గురువారం ఉదయం అఖాలా కౌంటీలోని అగ్ తపే ఖాన్ బ్రిడ్జిపై పడింది. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. వదంతులను నమ్మవద్దని, ప్రశాంతంగా ఉండాలని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) ప్రజలను కోరింది. ఇదిలావుండగా అహ్వజ్ సమీపంలో అమెరికా-ఇజ్రాయిల్ సేనలు జరిపిన దాడిలో ముగ్గురు మరణించగా పలువురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. క్షతగాత్రులకు వైద్య బృందాలు అవసరమైన చికిత్స అందిస్తున్నాయి.

ఇరాన్‌షహర్ విమానాశ్రయంపై ఉదయం దాడి జరిగిందని, ఓ ఉద్యోగి చనిపోయాడని సమాచారం అందింది. విమానాశ్రయానికి చెందిన ఆపరేషన్స్ సౌకర్యాలు, వాతావరణ కేంద్రం దెబ్బతిన్నాయి. ఇరాన్‌షహర్ నగరంలోని పలు ప్రాంతాలలో బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత పేలుడు శబ్దాలు వినిపించాయి. ఇరాన్ దక్షిణ ప్రాంతంలోని బుషహర్ రాష్ట్రంలో కూడా అనేక పేలుళ్లు సంభవించాయి. బుషహర్‌లో ఇరాన్ అణు విద్యుత్ ప్లాంటు ఉన్న విషయం తెలిసిందే. ఇరాన్‌లో ప్రస్తుతం పనిచేస్తున్న అణు ప్లాంటు అదొక్కటే. చైనా-రష్యా మధ్య వాణిజ్యం కోసం వినియోగిస్తున్న రైల్వే బ్రిడ్జి పైన అమెరికా దాడి చేసింది. బుధవారం రాత్రి నుంచి అమెరికా జరిపిన దాడులు ఇరాన్ దక్షిణ కోస్తా వెంబడి ఉన్న నగరాలను వణికించాయి. కొన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. హార్ముజ్ జలసంధిలో ప్రయాణించే వాణిజ్య నౌకలను ఇరాన్ లక్ష్యంగా చేసుకోకుండా కట్టడి చేసేందుకే తాము ఈ దాడులు జరుపుతున్నామని అమెరికా సైన్యం చెబుతోంది.

గల్ఫ్‌లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా…
బహ్‌రైన్, ఖతార్, కువైట్‌లలోని అమెరికా స్థావరాలు, వ్యూహాత్మక సౌకర్యాలపై దాడులను కొనసాగించామని ఇరాన్ తెలిపింది. ముఖ్యంగా కువైట్‌లోని అరిఫ్‌జాన్, అలీ అల్ సలేమ్, బహ్‌రైన్‌లోని జుఫెయిర్, షేక్ ఇసాలలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. కువైట్‌లో పాట్రియట్ గగనతల రక్షణ వ్యవస్థ, ఖతార్‌లో ఉపగ్రహ యంటీనా, బహ్‌రైన్‌లో ఇంధన నిల్వ సౌకర్యాలపై పెద్ద ఎత్తున డ్రోన్ దాడులు చేశామని వివరించింది. ఖతార్‌లోని ఉపగ్రహ యాంటీనా ముందస్తు హెచ్చరిక ప్రాంతంగా పనిచేస్తోంది. బహ్‌రైన్‌లోని ఇంధన నిల్వ సౌకర్యాలను అమెరికా సైన్యం వాడుకుంటోంది. బహ్‌రైన్‌లో గురువారం మూడు దఫాలుగా సైరన్లు మోగించి ప్రజలను అప్రమత్తం చేశారు. సురక్షిత ప్రాంతాలలో తలదాచుకోవాలని కోరారు. కువైట్‌పై ఇరాన్ జరిపిన దాడిలో ఓ వ్యక్తి గాయపడ్డాడు. ఇరాన్ ప్రయోగించిన నాలుగు క్షిపణులు, పది డ్రోన్లను విజయవంతంగా తటస్థం చేశామని కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి చెప్పారు.

ఒప్పందం కోసం వేడుకుంది : ట్రంప్
వరుస దాడులతో బెంబేలెత్తిన ఇరాన్ ఒప్పందం కోసం తమను వేడుకున్నదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు. ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ ఇరాన్ నాయకత్వం తనను సంప్రదించిందని, ఒప్పందం కుదుర్చుకోవాలని కోరిందని అన్నారు. ఎంఓయూపై సంతకం చేసిన తర్వాత హార్ముజ్ జల సంధిపై.. ముఖ్యంగా ఉత్తరాన ఉన్న రవాణా మార్గంపై తాను ఆశించిన భద్రతా ఏర్పాట్లను అమలు చేయడంలో అమెరికా విఫలమైంది. ఒమన్ కారిడార్ నిర్వహణను అమెరికాకు అనుకూలంగా మార్చాలన్న ట్రంప్ కోరిక నెరవేరలేదు. తన సార్వభౌమత్వ హక్కుల విషయంలో రాజీ పడే ప్రశ్నే లేదని ఇరాన్ కరాఖండీగా చెప్పేసింది. హార్ముజ్ జలసంధిపై ఇరాన్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. అదీకాక ఇరాన్ వద్ద అనూహ్య వ్యూహాలు ఎన్నో ఉన్నాయి. గత సంఘర్షణల సమయంలో ఇరాన్ వీటిని వాడలేదు.

భవిష్యత్తులో జరిగే యుద్ధాలలో ఈ వ్యూహాలకు ఇరాన్ పదును పెట్టడం ఖాయంగా కన్పిస్తోంది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌పీటీ) నుంచి వైదొలిగే అంశాన్ని ఇరాన్ పార్లమెంట్ ఇప్పటికే పరిశీలిస్తోంది. వాషింగ్టన్ కనుక దుందుడుకుగా వ్యవహరిస్తే ఇరాన్ తన అణు సిద్ధాంతంలో మార్పులు చేసుకునేందుకు వెనుకాడదు. అంకారాలో నాటో సదస్సు ముగిసిన తర్వాత ట్రంప్ బెదిరింపులకు పాల్పడ్డారు. ఎంఓయూ కథ ముగిసిందని, ఖర్క్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటామని, ఇరాన్ ఓడరేవుల దిగ్బంధాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. దీనిపై ఇరాన్ తీవ్రంగానే స్పందించింది. తమ ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని స్పష్టం చేసింది. హార్ముజ్ నిర్వహణలో విదేశీ జోక్యాన్ని అనుమతించబోమని తేల్చి చెప్పింది. అమెరికా తాజా దాడులను కూడా టెహ్రాన్ సమర్ధవంతంగా ఎదుర్కొంటోంది.

అమెరికా మెడలు వంచుతాం
సరికొత్త వ్యూహాలతో ఇరాన్ అడుగులు
ఇస్లామబాద్‌లో కుదిరిన అవగాహనా ఒప్పందానికి (ఎంఓయూ) కాలం చెల్లిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఇరాన్అ-మెరికా సంతకాలు చేసిన ఎంఓయూ అమలు ఇప్పుడు ప్రశార్థకమవుతోంది. ఎంఓయూను అమెరికా బరితెగించి ఉల్లంఘిస్తూ పదే పదే సైనిక చర్యలకు పాల్పడుతోంది. ఇలాంటి పరిస్థితులలో అమెరికా మెడలు వంచడానికి, ఎంఓయూ అమలయ్యేలా చూడడానికి ఇరాన్ వద్ద ఉన్న మార్గాలు ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. ఎంఓయూ కింద అంగీకరించిన స్వీయ నియంత్రణల నుంచి ఇరాన్ వైదొలగడం వీటిలో ఒకటి. అదే జరిగితే ఇరాన్ ఎలాంటి పరిమితులకు లోబడి ఉండాల్సిన అవసరం ఉండదు. అమెరికా దురాక్రమణకు ధీటుగా స్పందించవచ్చు. ఇరాన్ ఇప్పటికే ఆ దిశగా అడుగులు వేసింది. అమెరికా సైన్యం ఇరాన్ దక్షిణ తీర ప్రాంతాలు, ద్వీపాలలోని 30 ప్రదేశాలను లక్ష్యంగా చేసుకొని దాడులు జరిపితే ఐఆర్‌జీసీ క్షిపణులు, డ్రోన్లతో వాటిని సమర్ధవంతంగా తిప్పికొట్టింది. మొత్తంమీద 85 కీలక అమెరికా సైనిక స్థావరాలపై దాడి చేసింది. ఓ ఆధునిక ఎంక్యూ-రీపర్ డ్రోన్‌ను కూల్చివేసింది. మొట్టమొదటి సారిగా ఒమన్ తీరంలో మోహరించిన అమెరికా నౌకాదళాన్ని నేరుగా లక్ష్యంగా చేసుకుంది.

ఇస్లామిక్ విప్లవ ఆశయాలను పరిరక్షిస్తాం : ఇరాన్
పలు రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకొని గత రెండు రోజులుగా అమెరికా సేనలు జరుపుతున్న దాడులలో 14 మంది మరణించగా 78 మంది గాయపడ్డారని ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది. రెండు రైల్వే బ్రిడ్జిలు సహా వివిధ లక్ష్యాలపై అమెరికా జరిపిన దాడులను ఇరాన్ విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. హార్ముజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న నౌకలపై ఇరాన్ దాడులు చేసినందుకు ప్రతిగానే తాము ఈ దాడులకు పూనుకున్నామంటూ అమెరికా చేస్తున్న వాదనను తోసిపుచ్చింది. అందులో ఎంతమాత్రం నిజం లేదని చెప్పింది. విచక్షణా రహితంగా వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడి లక్ష్యాలను, ఆశయాలను ఎట్టి పరిస్థితులలోనూ నెరవేరనివ్వబోమని ఇరాన్ సైన్యం స్పష్టం చేసింది. అంతిమ విజయం సాధించే వరకూ ఇస్లామిక్ విప్లవ ఆశయాలను పరిరక్షిస్తూనే ఉంటామని తెలిపింది. అమెరికా దాడులు కొనసాగిన పక్షంలో మధ్యప్రాచ్యంలోని ఇతర అమెరికా సైనిక స్థావరాలపై కూడా దాడులు చేస్తామని, మిగిలిన గల్ఫ్ దేశాల పైనా దాడులు తప్పవని హెచ్చరించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -