Wednesday, August 19, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఅమీతుమీకి సిద్ధమే

అమీతుమీకి సిద్ధమే

- Advertisement -

భూతల దాడులనూ తిప్పికొడతాం
మా దాడులు శత్రువును ఆశ్చర్యపరుస్తాయి : ఇరాన్‌
టెహ్రాన్‌ :
అమెరికాతో కుదుర్చుకున్న ఎంఓయూ గడువు ముగిసిపోవడంతో ఇక దేనికైనా సిద్ధమేనని ఇరాన్‌ ప్రకటించింది. అమెరికాతో అమీతుమీకి సిద్ధంగా ఉన్నామని, మరింత దూకుడుగా పోరు జరుపుతామని తెలిపింది. ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ (ఐఆర్‌జీసీ) రాజకీయ బ్యూరో అధినేత బ్రిగేడియర్‌ జనరల్‌ యదోల్లా జవానీ ప్రభుత్వ టీవీతో మాట్లాడుతూ దేశ రక్షణ కోసం అవసరమైన ఏ చర్యనైనా తీసుకునేందుకు తమ సేనలు సంసిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ‘యుద్ధాన్ని ప్రారంభించింది శత్రువే. మా ప్రయత్నాలు రక్షణాత్మకంగానే ఉంటాయి. అయినప్పటికీ అవి దాడి చేసే దిశగా కూడా ఉండవచ్చు’ అని అన్నారు. దాడి ఏ విధంగా ఉంటుందో ఆయన చెప్పలేదు కానీ ప్రత్యర్థులను వ్యూహాత్మకంగా ఆశ్చర్యపరుస్తాయని వ్యాఖ్యానించారు. ఒకవేళ అమెరికా భూతల దాడులకు తెగబడితే వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగానే ఉన్నామని చెప్పారు.

ఉద్రిక్తతలు పెంచుదాం : సైన్యానికి పిలుపు
యుద్ధానికి శాశ్వతంగా ముగింపు పలికేందుకు జరుగుతున్న ప్రయత్నాలు నిలిచిపోవడంతో పూర్తి స్థాయిలో దూకుడు ప్రదర్శించాలని నిర్ణయించామని ఇరాన్‌ సీనియర్‌ అధికారి ఒకరు రాయిటర్స్‌ వార్తాసంస్థకు తెలిపారు. ‘హార్ముజ్‌ జలసంధిలోనూ, ఇతర ప్రాంతాలలోనూ ఉద్రిక్తతలను పెంచడానికి ఇరాన్‌ సేనలు సంసిద్ధంగా ఉండాలి. ఎందుకంటే కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి, వాటికి అనుగుణంగా చర్యలు చేపట్టడానికి ఇరాన్‌ సిద్ధంగా ఉంటుంది’ అని చెప్పారు. దౌత్యం విఫలమైతే అమెరికా జరుపుతున్న నౌకా దిగ్బంధనాన్ని ఛేదించడానికి సకాలంలో, కచ్చితమైన దాడి చేస్తామని అన్నారు.

నౌకపై దాడి
హార్ముజ్‌ జలసంధిలో ప్రయాణిస్తున్న ఓ నౌకపై దాడి జరిగిందని బ్రిటన్‌ మారీటైమ్‌ ట్రేడ్‌ ఆపరేషన్స్‌ ఏజెన్సీ (యూకేఎంటీఓ) తెలిపింది. హార్ముజ్‌ మీదుగా గమ్యస్థానానికి వెళుతున్న నౌకపై గుర్తు తెలియని ఆయుధంతో దాడి చేశారని వివరించింది. ఈ దాడి కారణంగా నౌక ఇంజిన్‌ గదికి నష్టం వాటిల్లిందని, ఒక వ్యక్తి గాయపడ్డాడని చెప్పింది. నౌకలోని మిగిలిన సిబ్బందిని ఒమన్‌ తీరగస్తీ దళం సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు జరుపుతున్నారని అంటూ హార్ముజ్‌లో ప్రయాణించే నౌకలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, అనుమానాస్పదంగా కన్పించే వాటిని గుర్తించి సమాచారం అందించాలని యూకేఎంటీఓ సూచించింది.

హామీలు అమలు చేస్తేనే హార్ముజ్‌ను తెరుస్తాం
తమతో కుదుర్చుకున్న తాత్కాలిక ఒప్పందంలో ఇచ్చిన హామీలన్నింటినీ అమెరికా నెరవేర్చనంత వరకూ హార్ముజ్‌ జలసంధి మూతపడే ఉంటుందని ఇరాన్‌ పార్లమెంట్‌ స్పీకర్‌, చర్చల ప్రతినిధి మహమ్మద్‌ బాఘర్‌ ఘలీబఫ్‌ స్పష్టం చేశారు. ఇరాన్‌ ఓడరేవుల దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని, విదేశాలలో స్తంభింపజేసిన ఇరాన్‌ ఆస్తులను విడుదల చేయాలని, చమురు ఆంక్షలను తొలగించాలని, అన్ని రకాల సైనిక చర్యలకు స్వస్తి చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. వీటన్నింటినీ అమలు చేస్తామని తాత్కాలిక ఒప్పందంలో అమెరికా హామీ ఇచ్చిందని గుర్తు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -