ప్రారంభం కాని ప్రూనింగ్ పనులు
నవతెలంగాణ – మల్హర్ రావు
కాటారం సబ్ డివిజన్లో ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన,గిరిజనేతర పేద కుటుంబాలకు వేసవి కాలంలో తునికాకు సేకరణ ద్వారా రెండో ఆదాయం లభిస్తోంది. వ్యవసాయ పనులు ముగియగానే తునికాకు సేకరణపై దృష్టిని సారించి వేసవి ఆదాయం సమకూర్చు కోవడం ఏజెన్సీలోని పేద ప్రజల జీవన విధానం. కాని తునికాకు సేకరణపై ఇంకా ఎలాంటి స్పష్టత రాక పోవడంతో అసలు తునికాకు సేకరణ ఉంటుందో? లేదో? తెలియని అయోమయం ఏజెన్సీ ప్రజల్లో నెలకొంది.మహముత్తరం, మల్హర్ మండలాల్లో వేసవిలో సుమారుగా 5 లక్షల కట్టలకు పైగానే తునికాకును సేకరించాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
ప్రారంభం కాని ఆకు సేకరణ
ఇప్పటికే తునికాకు ప్రూనింగ్ పనులను చేయాల్సి ఉంది, కాని ఇంత వరకు మండలంలోని కొయ్యుర్ రేంజ్ పరిధిలో చేసినట్లు కనిపించడం లేదు.ఈ కారణంతో తునికాకు సేకరణపై సందేహాలు నెలకొన్నాయి.తునికాకులు లేత దశ నుంచి ముదురు దశకు చేరు కుంటే ఆకులు సేకరణకు ఉపయోగపడవని ఏజెన్సీ వాసులు అభిప్రాయ పడుతున్నారు. వేసవిలో పేదలకు రెండవ ఆదాయం తునికాకు సేకరణ ద్వారా వస్తోంది. తునికాకు సేకరణ ద్వారా వచ్చే ఆదాయంతో వేసవి కాలంలో ఆర్థిక ఇబ్బందులు లేకుండా కొందరు తమ కుటుంబాలను పోషించుకుంటారు. తునికాకు సేకరణ లేక పోతే ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేసవి కాలంలో ఎలాంటి పనులు లేక పోతే తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



