నవతెలంగాణ-హైదరాబాద్: చైనాకు ఇరాన్ చమురును రవాణా చేసిన సంస్థలపై అమెరికా కొత్త ఆంక్షలు విధించింది. ఇరాన్ చమురు రవాణాకు సహాయం చేసిన ముగ్గురు వ్యక్తులు, తొమ్మిది సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించినట్లు ట్రెజరీ పేర్కొంది. వీటిలో నాలుగు హాంకాంగ్ కు, నాలుగు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందినవి కాగా, తొమ్మిదవ కంపెనీ ఒమన్ కు చెందినది. వివిధ బినామీ కంపెనీలను వినియోగించి, ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్ జిసి) కు కేటాయించిన ఇరాన్ చమురును చైనాకు విక్రయించేందుకు, రవాణా చేయడానికి సాయమందించిన వ్యక్తులు, సంస్థలు లక్ష్యంగా ఆఫీస్ ఆఫ్ ఫారిన్ అసెట్స్ కంట్రోల్ (ఒఎఫ్ఎసి) ఈ కొత్త ఆంక్షలను విధించిందని ట్రెజరీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇరాన్ ప్రభుత్వానికి, సైన్యానికి ఆయుధాలు, అణు కార్యక్రమం లేదా ఈ ప్రాంతంలోని బినామీలకు నిధులు అందకుండా చేయడానికి ట్రంప్ ప్రభుత్వం ఆంక్షలను కొనసాగిస్తుందని ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ పేర్కొన్నారు. ఉగ్రవాద చర్యలు చేపట్టడానికి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అస్థిరపరచడానికి ఇరాన్ వినియోగించే ఆర్థిక నెట్ వర్క్ లకు మద్దతు అందకుండా చేయడాన్ని కొనసాగిస్తుందని బెసెంట్ తెలిపారు.
హాంగ్ కాంగ్ కి చెందిన హాంగ్ కాంగ్ బ్లూ ఓషన్ లిమిటెడ్, హాంగ్ కాంగ్ సాన్ము లిమిటెడ్, జియాండి HK లిమిటెడ్, మాక్స్ హానర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ కో లిమిటెడ్, దుబాయ్ కి చెందిన ఓషన్ అలియాంజ్ షిప్పింగ్ LLC, షార్జాకి చెందిన అటిక్ ఎనర్జీ FZE, దుబాయ్ కి చెందిన బ్లాంకా గూడ్స్ హోల్‌సేలర్ LLC, యూనివర్సల్ ఫార్చ్యూన్ ట్రేడింగ్ LLC, ఒమన్ కి చెందిన జీయస్ లాజిస్టిక్స్ గ్రూప్ లపై కొత్తగా ఆంక్షలు విధించనుంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో సమావేశానికి కొన్ని రోజుల ముందు ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.



