నవతెలంగాణ – హైదరాబాద్ : పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ప్రజలు పొదుపు పాటించాలంటూ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుపై జ్యోతిష్ పీఠం శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద తీవ్రంగా స్పందించారు. ప్రజలకు నీతులు చెప్పే ముందు పాలకులు వాటిని ఆచరించి చూపించాలని, పొదుపు చర్యలు అధికారంలో ఉన్న వారి నుంచే మొదలవ్వాలని ఆయన హితవు పలికారు. సోన్‌భద్రలో తన ‘గోవిష్ఠ యాత్ర’లో భాగంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. “ముందుగా ప్రభుత్వం తమ వద్ద ఉన్న రూ.8,000 కోట్ల విమానాన్ని అమ్మి, ఇంధన సామర్థ్యం ఉన్న విమానాన్ని ఉపయోగించాలి.
ధర్మం మన ఇంటి నుంచే మొదలవ్వాలి” అని ప్రధాని మోడీకి ఆయన చురకలంటించారు. పశ్చిమాసియా సంక్షోభం దృష్ట్యా బంగారం కొనుగోళ్లు, విదేశీ ప్రయాణాలు, ఇంధన వినియోగం తగ్గించుకోవాలని మోడీ చేసిన విజ్ఞప్తిపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అనంతరం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. గోవధను అరికట్టడంలో రాజకీయ పార్టీలు, నాయకులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ప్రభుత్వ గణాంకాలను ఉటంకిస్తూ, పశ్చిమ బెంగాల్, కేరళ వంటి రాష్ట్రాలతో పోలిస్తే ఉత్తరప్రదేశ్‌లోనే గోవుల జనాభా అత్యంత వేగంగా తగ్గిపోయిందని ఆయన పేర్కొన్నారు.



