సంజయ్ ను కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి
బేటీ బచావో, బేటీ పడావో అంటే బాలికలపై లైంగికదాడులకు రక్షణ కల్పించడమా?
ఐద్వా అఖిల భారత
ఉపాధ్యక్షులు ఎస్.పుణ్యవతి
ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ, ఐద్వా ఆధ్వర్యంలో హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో నిరసన
రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, దిష్టిబొమ్మలు దహనం
నవతెలంగాణ – ముషీరాబాద్/విలేకరులు
బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజరు కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో వెంటనే అరెస్టు చేయాలని ఐద్వా అఖిల భారత ఉపాధ్యక్షులు ఎస్.పుణ్యవతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే బండి సంజరును కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కోరారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజరు పాత్రపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ, ఐద్వా రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. బండి సంజరు దిష్టిబొమ్మను దహనం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. హైదరాబాద్‌లో కార్యక్రమానికి ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు అధ్యక్షత వహించగా, ఐద్వా అఖిల భారత ఉపాధ్యక్షులు పుణ్యవతి ప్రసంగించారు. బాలికపై లైంగికదాడి చేసి అనంతరం బెదిరింపులు, కేసు సెటిల్‌మెంట్ ప్రయత్నాలు జరగడం అత్యంత దారుణమని అన్నారు. ‘బేటీ బచావో-బేటీ పడావో’ అంటూ నినాదాలు చేసే బీజేపీ నాయకత్వం మహిళలపై జరుగుతున్న లైంగికదాడుల విషయంలో మాత్రం నేరస్థులను కాపాడే సంస్కృతిని ప్రోత్సహిస్తోందని విమర్శించారు. బిల్కిస్ బాను కేసు నుంచి దేశవ్యాప్తంగా మహిళలు, చిన్నారులపై జరుగుతున్న దాడుల వరకు బీజేపీ పాలనలోనే మహిళా వ్యతిరేక ధోరణి పెరిగిందని తెలిపారు.
కేంద్ర మంత్రి పదవిలో ఉన్న బండి సంజరు తన కుమారుడిపై వచ్చిన తీవ్రమైన ఆరోపణలను సమర్థిస్తూ వెనకేసుకురావడం దుర్మార్గం అన్నారు. ఐద్వా జాతీయ నాయకులు టి.జ్యోతి మాట్లాడుతూ.. పోక్సో కేసు నమోదై నాలుగు రోజులు గడిచినా నిందితుడిని అరెస్టు చేయకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని విమర్శించారు. బాలికపై లైంగికదాడి జరిగినా ప్రభుత్వం, పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోకుండా బండి సంజరు కుటుంబానికి కొమ్ముకాస్తున్నట్టు కనిపిస్తోందన్నారు. ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు ఆర్.అరుణ జ్యోతి మాట్లాడుతూ.. అధికార అహంకారంతో తన కుమారుడు చేసిన నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు బండి సంజరు ప్రయత్నిస్తున్నారని, ఇది మహిళల భద్రతను తాకట్టు పెట్టడమేనని అన్నారు. బండి సంజరు తక్షణమే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శులు టి.నాగరాజు, ఆనగంటి వెంకటేష్ మాట్లాడుతూ.. బాధిత బాలిక కుటుంబానికి బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో వెంటనే భద్రత కల్పించాలని, కేసుపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా కేంద్ర కమిటీ సభ్యులు కె.ఆశాలత, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యాక్షులు కె.అశోక్‌రెడ్డి, హైదరాబాద్ జిల్లా ఐద్వా కార్యదర్శి వరలక్ష్మీ, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు లెనిన్ గువేరా తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులు, ప్రజాసంఘాల నిరసన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజరు కుమారుడు బండి భగీరథ్‌ను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లోని నెక్లెస్ ప్లాజా వద్ద విద్యార్థులు, పలు ప్రజా సంఘాల నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. సీపీఐ హైదరాబాద్ జిల్లా కౌన్సిల్ ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్.అంబేద్కర్ విగ్రహం ఎదుట నాయకులు, కార్యకర్తలు నల్లచొక్కాలు, నల్లచీరలు ధరించి నిరసన ప్రదర్శన నిర్వహించారు.
బండి భగీరథ్ దిష్టిబొమ్మ దహనం
బాలికపై లైంగికదాడికి పాల్పడిన కేంద్ర హోంశాఖ సహాయశాఖ మంత్రి బండి సంజరు కుమారుడు బండి భగీరథ్‌ను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ హనుమకొండ జిల్లా అంబేద్కర్ సెంటర్‌లో డీవైఎఫ్‌ఐ, ఐద్వా, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ కేయూ కమిటీ ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు ముందు బంచి భగీరథ్ దిష్టిబొమ్మను దహనం చేశారు.మహబూబాబాద్ జిల్లా వివేకానంద సెంటర్‌లో నిరసన వ్యక్తం చేశారు. జనగామ జిల్లాలోని నెహ్రూ పార్క్ సెంటర్‌లో ఐద్వా, డీవైఎఫ్‌ఐ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వరంగల్ జిల్లా నర్సంపేట వరంగల్ రోడ్డు కూడలి వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో బండి భగీరథ్ దిష్టిబొమ్మ దహనం చేశారు.
నారాయణపేట జిల్లా దామరగిద్ద మండల కేంద్రంలోని నారాయణపేట మద్దూరు రహదారిపై ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ, సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఐద్వా ఆధ్వర్యంలో ఆదిలాబాద్ కలెక్టర్ చౌరస్తాలో దిష్టిబొమ్మ దహనం చేశారు. పెద్దపల్లి అంబేద్కర్ విగ్రహం ఎదుట కేవీపీఎస్, తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఆధ్వర్యంలో కండ్లకు నల్లగంతలు కట్టుకొని లైంగికదాడికి పాల్పడిన బండి భగీరథ్‌ను అరెస్టు చేయాలని నిరసన చేపట్టారు.



