Wednesday, May 13, 2026
E-PAPER
Homeబీజినెస్డెలివరీ సిబ్బందికి ఆరోగ్య బీమాను అందిస్తున్న అమెజాన్

డెలివరీ సిబ్బందికి ఆరోగ్య బీమాను అందిస్తున్న అమెజాన్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ :భారతదేశ వ్యాప్తంగా ఉన్న తమ ఆపరేషన్స్ నెట్‌వర్క్‌లోని దాదాపు 90,000 మంది డెలివరీ సిబ్బందికి ఆరోగ్య, బీమా ప్రయోజనాలను విస్తరిస్తున్నట్లు అమేజాన్ ఇండియా ఈరోజు ప్రకటించింది. ఈ ప్రయోజనాల ద్వారా సాధారణ వైద్య ఖర్చుల కోసం ఔట్ పేషెంట్ డిపార్ట్‌మెంట్ కవరేజీ, ఆసుపత్రిలో చేరి చికిత్స పొందేందుకు అవసరమైన ఆర్థిక సహాయం అందుతుంది. లాస్ట్-మైల్ డెలివరీ విభాగాల్లో పనిచేసే సిబ్బంది అందరికీ వర్తించే ఈ సదుపాయం కింద.. మెడిక్లెయిమ్ కవరేజీని రూ. 1.5 లక్షలకు పెంచగా, ఓపీడీ ఖర్చుల కోసం ఇప్పుడు రూ. 10,000 వరకు కవరేజీ లభిస్తుంది. అంతేకాకుండా సామూహిక వ్యక్తిగత ప్రమాద కవరేజీని సైతం రూ. 10 లక్షలకు విస్తరించారు. గాయాల వల్ల కలిగే తాత్కాలిక లేదా శాశ్వత వైకల్యాలకు పరిహారం లభించడంతో పాటు సిబ్బందికి తక్షణ వైద్య అవసరాలు తీరడం, ఆదాయ నష్టం నుంచి రక్షణ దొరకడం వంటివి ఈ నిర్ణయం ద్వారా సాధ్యమవుతాయి.

ఈ ఆరోగ్య ప్రయోజనాలు డెలివరీ సిబ్బందితో పాటు వారి కుటుంబంలోని ముగ్గురు సభ్యులకు ప్రతి సంవత్సరం వర్తిస్తాయి. దీనిలో బహుళ భాషల్లో అందుబాటులో ఉండే ఆన్‌లైన్ వర్చువల్ వైద్య సలహాలు, ఏడాదికి ఒక కుటుంబానికి రెండు ఉచిత ప్రత్యక్ష ఓపీడీ సందర్శనలు ఉంటాయి. వ్యాధి నిర్ధారణ పరీక్షలు, మందులు, దంత మరియు కంటి సంరక్షణపై రాయితీలు సైతం అందుతాయి. దీనికి తోడు ముందస్తు ఆరోగ్య సంరక్షణ, ఫిట్‌నెస్‌ను ప్రోత్సహించే టూల్స్ కూడా వీరికి లభిస్తాయి.

పదివేల మంది డెలివరీ ఏజెంట్లకు ఉచిత వైద్య పరీక్షలు అందించేందుకు థర్డ్-పార్టీ బీమా సంస్థల భాగస్వామ్యంతో అమేజాన్ దేశవ్యాప్తంగా ఆరోగ్య శిబిరాలను సైతం ఏర్పాటు చేస్తోంది. ఈ శిబిరాల్లో కంటి, దంత పరీక్షలు, బీఎంఐ అంచనా, జనరల్ ఫిజీషియన్ కన్సల్టేషన్ వంటి ప్రాథమిక వైద్య సేవలు అందిస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న అమేజాన్ డెలివరీ స్టేషన్ల వద్ద ఏర్పాటు చేసే ఈ శిబిరాలలో.. డెలివరీ సిబ్బంది ప్రభుత్వ గుర్తింపు కార్డును చూపించి ఉచితంగా ఈ సేవలను సద్వినియోగం చేసుకోవచ్చు.

ఈ కార్యక్రమాలన్నీ అమేజాన్ ఇటీవల ప్రకటించిన రూ. 2,800 కోట్ల (సుమారు 300 మిలియన్ డాలర్లు) పెట్టుబడిలో ఒక భాగం. దేశంలోనే అత్యంత సురక్షితమైన, వేగవంతమైన, నమ్మకమైన లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌ను మరింతగా విస్తరించే క్రమంలో.. సిబ్బంది భద్రత, ఆరోగ్యం, ఆర్థిక శ్రేయస్సును బలోపేతం చేసేందుకు సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ విషయంపై అమేజాన్ ఇండియా ఆపరేషన్స్ డైరెక్టర్ సలీమ్ మెమన్ మాట్లాడుతూ, “భారతదేశ వ్యాప్తంగా మా ఆపరేషన్స్ నెట్‌వర్క్, మౌలిక సదుపాయాలు, క్షేత్రస్థాయి సిబ్బందిపై పెట్టుబడులు పెడుతున్న తరుణంలో.. డెలివరీ ఏజెంట్ల భద్రత, శ్రేయస్సుకు మేము అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. వారికి సమగ్రమైన మద్దతు అందించేందుకు ఓపీడీ, ఆసుపత్రి ఖర్చులు, ప్రమాద బీమా ప్రయోజనాలను మేము మరింతగా విస్తరించాము. ఉచిత వైద్య పరీక్షలు, ముందస్తు సంరక్షణ కోసం దేశవ్యాప్తంగా ఆరోగ్య శిబిరాలను కూడా నిర్వహిస్తున్నాం. సిబ్బంది శ్రేయస్సును బలోపేతం చేయడానికి, మా ఆపరేషన్స్ మౌలిక సదుపాయాలను దేశవ్యాప్తంగా విస్తరించడానికి ఇటీవల ప్రకటించిన రూ. 2,800 కోట్ల పెట్టుబడిలో ఈ కార్యక్రమాలు ఒక భాగం” అని వివరించారు.

సిబ్బంది ఆరోగ్యం, భద్రత పట్ల ఉన్న విస్తృత లక్ష్యాలకు అనుగుణంగా అమేజాన్ తమ కార్యకలాపాల్లో పనిచేసే సిబ్బంది కోసం ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఈ ఏడాది మార్చిలో ఆరు నగరాల్లోని డెలివరీ స్టేషన్లలో ప్రారంభమైన వైద్య ఆరోగ్య శిబిరాలు, మెట్రో నగరాలతో పాటు ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా కొనసాగుతాయి. ముఖ్యంగా వేసవి కాలంలో వడదెబ్బ వంటి ముప్పులను ముందుగానే గుర్తించి, సిబ్బంది ఆరోగ్యంగా ఉండేలా ఈ శిబిరాలు ప్రత్యేక దృష్టి సారిస్తాయి. వీటికి తోడు, డెలివరీ ఏజెంట్లకు వైద్యపరంగా, ఆర్థికపరంగా రక్షణ కల్పించేలా ఈ ఆరోగ్య, బీమా ప్రయోజనాలను రూపొందించారు.

అమేజాన్ ఇండియా తన డెలివరీ సిబ్బంది శ్రేయస్సుకు మద్దతు ఇస్తున్న విధానాలు:

భద్రత, శ్రేయస్సుపై పెట్టుబడి – దేశంలోనే అత్యంత సురక్షితమైన, వేగవంతమైన, నమ్మకమైన లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌ను మరింతగా విస్తరించే దిశగా సిబ్బంది భద్రత, ఆరోగ్య, ఆర్థిక శ్రేయస్సు కోసం సుమారు రూ. 2,800 కోట్లు (సుమారు 300 మిలియన్ డాలర్లు) పెట్టుబడిగా పెడుతున్నట్లు సంస్థ ఇటీవల ప్రకటించింది. 2030 నాటికి భారతదేశంలో 35 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టాలనే అమేజాన్ విస్తృత లక్ష్యంలో ఇది ఒక భాగం. వ్యాపార విస్తరణతో పాటు ఏఐ ఆధారిత డిజిటలైజేషన్, ఎగుమతుల వృద్ధి, ఉద్యోగ కల్పన అనే మూడు ప్రధాన వ్యూహాలపై సంస్థ దృష్టి సారించింది. దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు నిమిషాలు, గంటలు, రోజుల్లో సేవలు అందించేలా తన కోర్ మరియు క్విక్ కామర్స్ నెట్‌వర్క్‌ను అమేజాన్ మరింత విస్తరించనుంది.

ప్రాజెక్ట్ ఆశ్రయ్ – సిబ్బంది సంక్షేమంలో భాగంగా లాజిస్టిక్స్ రంగంలోనే తొలిసారిగా ‘ప్రాజెక్ట్ ఆశ్రయ్’ అనే వినూత్న కార్యక్రమాన్ని సంస్థ తీసుకువచ్చింది. దీని కింద రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో డెలివరీ ఏజెంట్ల కోసం ‘ఆశ్రయ్ కేంద్రాల’ పేరిట ప్రత్యేక విశ్రాంతి కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. డెలివరీ ఏజెంట్లు ఏ సంస్థకు పనిచేస్తున్నారనే సంబంధం లేకుండా అందరికీ ఇవి ఉచితంగా అందుబాటులో ఉంటాయి. ఏసీ సౌకర్యం, తాగునీరు, ఎలక్ట్రోలైట్స్, మరుగుదొడ్లు, మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు, ప్రథమ చికిత్స కిట్లు వంటి వసతులు ఇందులో ఉంటాయి. ప్రస్తుతం ఉన్న 100 కేంద్రాలకు అదనంగా 2026 నాటికి 250కి విస్తరించనున్నట్లు అమేజాన్ గత వారం ప్రకటించింది. దీనిలో భాగంగా మే నెలాఖరు నాటికి మరో 50 కొత్త కేంద్రాలను తెరవనున్నారు.

అంబులెన్స్ సేవలు, అత్యవసర మద్దతు మరియు సిబ్బంది భద్రత – దీనికి తోడు, డెలివరీ సిబ్బందికి 24/7 అత్యవసర మద్దతు అందిస్తూ, ‘డయల్ 4242’ భాగస్వామ్యంతో 730కి పైగా నగరాల్లో బేసిక్, అడ్వాన్స్‌డ్ లైఫ్ సపోర్ట్ సదుపాయాలతో కూడిన ఉచిత అంబులెన్స్ సేవలను, ప్రత్యేక హెల్ప్‌లైన్‌లను అమేజాన్ అందుబాటులోకి తెచ్చింది. వాహనాల ముందస్తు తనిఖీలను తప్పనిసరి చేయడంతో పాటు ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో (వర్షాకాలంలో సురక్షిత డ్రైవింగ్‌పై శిక్షణ ఇవ్వడం, తీవ్రమైన ఎండల్లో అదనపు విశ్రాంతి విరామాలు కల్పించడం) ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేయడం లాంటి జాగ్రత్తలు తీసుకుంటోంది.

డెలివరీ ప్రతినిధులు మరియు డ్రైవర్ల కోసం రహదారి భద్రతా శిక్షణ – జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకుని, అమేజాన్ ఈ ఏడాది ప్రారంభంలో దేశవ్యాప్తంగా రోడ్డు భద్రతా అవగాహన, శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా లాస్ట్-మైల్ మరియు మిడిల్-మైల్ ఆపరేషన్స్‌లో పనిచేస్తున్న లక్షలాది మంది డెలివరీ ఏజెంట్లు, భాగస్వాములు, ట్రక్ డ్రైవర్లకు చేరువైంది. తప్పనిసరి ఆన్-గ్రౌండ్ శిక్షణ, ఇంటరాక్టివ్ లెర్నింగ్ సెషన్ల ద్వారా సురక్షితమైన డ్రైవింగ్, రైడింగ్ విధానాలను ఈ కార్యక్రమం మరింత బలోపేతం చేసింది. నిత్యం రోడ్డుపై పాటించాల్సిన భద్రతా అంశాలైన హెల్మెట్, సీట్‌బెల్ట్ నిబంధనల అమలు, వేగ నియంత్రణ, డ్రైవింగ్‌లో ఏకాగ్రత, అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి సన్నద్ధత, సురక్షితంగా వాహనాలను నడపడం వంటి కీలక విషయాలపై ఈ శిక్షణలో ప్రధానంగా దృష్టి సారించారు.

ప్రతీధి స్కాలర్‌షిప్ – డెలివరీ ప్రతినిధులు మరియు భాగస్వాముల పిల్లలకు విద్యావకాశాలను విస్తరించే లక్ష్యంతో అమేజాన్ ఇండియా తన ప్రతిష్టాత్మక ‘ప్రతీధి’ స్కాలర్‌షిప్ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఉన్నత విద్యకు ఆర్థిక సహాయం అందించే ఈ పథకం ద్వారా.. విద్యార్థులు వివిధ రంగాల్లో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను అభ్యసించడానికి వీలవుతుంది. ఇది వారికున్న ఆర్థిక ఆటంకాలను తొలగించి, మెరుగైన భవిష్యత్తు కోసం విస్తృత అవకాశాలకు బాటలు వేస్తుంది. ఫ్రంట్‌లైన్ డెలివరీ సిబ్బంది అంకితభావాన్ని గుర్తిస్తూ, ఈ ‘ప్రతీధి’ కార్యక్రమం ద్వారా భారతదేశ భవిష్యత్ తరాల ప్రతిభపై అమేజాన్ పెట్టుబడి పెడుతోంది. తద్వారా వారి జీవనోపాధి, కమ్యూనిటీ అభివృద్ధి పట్ల తనకున్న దీర్ఘకాలిక నిబద్ధతను సంస్థ చాటుకుంటోంది.

సమ్మిళిత విధానాలు – అమేజాన్ తన సమ్మిళిత విధానాల ద్వారా ఉద్యోగుల దీర్ఘకాలిక శ్రేయస్సుకు మద్దతు ఇస్తోంది. మహిళా ఉద్యోగుల ఆరోగ్యం, ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు తమ పంపిణీ కేంద్రాల్లో రుతుక్రమ సెలవులు, అక్కడే వైద్యం మరియు విశ్రాంతి సదుపాయాలతో పాటు శానిటరీ ప్యాడ్లను అందించే యంత్రాలను ఏర్పాటు చేసింది. పనిచేసే తల్లులు తమ వృత్తిపరమైన బాధ్యతలను ఆత్మవిశ్వాసంతో, సమతుల్యంగా నిర్వహించేందుకు వీలుగా శిశు సంరక్షణ సదుపాయాలను కూడా కల్పిస్తోంది. అంతేకాకుండా, సిబ్బంది వృత్తిపరమైన వృద్ధి కోసం నైపుణ్యాభివృద్ధి అవకాశాలపై కూడా అమేజాన్ పెట్టుబడులు పెడుతోంది. దీని ద్వారా ఉద్యోగులు తమ ప్రస్తుత విధులతో సంబంధం లేకుండా తమ ఆసక్తులకు అనుగుణంగా సంస్థలో అంతర్గతంగా ఉన్నత బాధ్యతలు చేపట్టేలా వారిని ప్రోత్సహిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -