మహిళల్లో రుతుచక్రం ఆగిపోయిన తర్వాతి దశ మెనోపాజ్. చివరిసారి పీరియడ్స్ వచ్చిన ఏడాది తర్వాత మెనోపాజ్‌ను నిర్ధారిస్తారు. బరువు పెరగడం, తలనొప్పి, యోని పొడిబారడం, మూడ్ స్వింగ్స్, ఏకాగ్రత సాధించలేక పోవడం వంటి సమస్యలు ఈ దశలో ఎదుర వుతాయి. వయసు పెరుగుతున్నా కొద్దీ మహిళల్లో ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయిలు క్షీణిస్తాయి. ఇది ఇతర హార్మోన్లపై కూడా ప్రభావం చూపుతుంది. ఇది జీవక్రియ, ఎముక సాంద్రత, కొలెస్ట్రాల్ స్థాయిలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇలాంటి అనారోగ్యా లకు దూరంగా ఉండటానికి మహిళలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రుతుక్రమం ఆగిన తర్వాత ఎదురయ్యే ఇలాంటి సమస్యలను సహజ మార్గాల ద్వారా కూడా పరిష్కరించుకోవచ్చు. కొన్ని రకాల ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మెనోపాజ్ సమస్యలకు దూరంగా ఉండవచ్చు.
పండ్లు, కూరగాయలు : పండ్లు, కూరగాయల ద్వారా విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు శరీరానికి సమృద్ధిగా అందుతాయి. క్యాబేజీ, బ్రకోలీ, బ్రుస్సెల్స్ మొలకలు వంటివి ఈస్ట్రోజెన్ హార్మోన్‌పై మంచి ప్రభావం చూపుతాయి. ఇవి మెనోపాజ్ లక్షణాలను తగ్గించడానికి సహాయపడతాయి. స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ వంటి ముదురు బెర్రీలు రక్తపోటును తగ్గిస్తాయి. అందువల్ల కాలానుగుణంగా లభించే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకోవాలి.
కాల్షియం, విటమిన్ డి : హార్మోన్ల మార్పుల వల్ల ఎముకలు బలహీనంగా మారతాయి. ఎముకల సాంద్రత కూడా తగ్గుతుంది. ఇలాంటి సమస్యల నివారణకు కాల్షియం, విటమిన్ డి లభించే ఆహారం తీసుకోవాలి. వీటి వల్ల ఆస్టియోపోరోసిస్ వ్యాధి బారిన పడకుండా కాపాడుకోవచ్చు. పెరుగు, పాలు, జున్ను, ఆకుకూరలు, బీన్స్ వంటి ఆహార పదార్థాల ద్వారా ఈ పోషకాలు శరీరానికి అందుతాయి. విటమిన్ డి కోసం రోజూ ఉదయం ఎండలో 15 నుంచి 20 నిమిషాలు నిల్చోవాలి.
ఫైటో ఈస్ట్రోజెన్ : ఈస్ట్రోజెన్ హార్మోన్‌ను ప్రేరేపించేందుకు ఫైటోఈస్ట్రోజెన్లు సహజంగా లభించే ఆహారాన్ని తీసుకోవాలి. ఇవి కొన్ని రకాల మొక్కల్లో సహజంగా లభిస్తాయి. ఇవి హార్మోన్ల అసమతుల్యతను నిరోధిస్తాయి. సోయాబీన్స్, టోఫు, అవిసె గింజలు, నువ్వులు, బీన్స్‌లో ఫైటోఈస్ట్రోజెన్‌లు సమృద్ధిగా ఉంటాయి.
ప్రోటీన్లు : ప్రోటీన్ ఎక్కువగా తీసుకునే వారిలో వయసుతో పాటు ఎదురయ్యే కండరాల సమస్యలకు దూరంగా ఉండవచ్చు. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల ఆకలి త్వరగా వేయదు. అందువల్ల తక్కువ కేలరీలను తీసుకుంటారు. చిక్కుళ్లు, నట్స్, సోయా, గుడ్లు, మాంసం, చేపలు ప్రోటీన్లకు వనరులుగా ఉంటాయి.
తగినంత నీరు : పొడిబారడం అనేది మెనోపాజ్‌లో ఎదురయ్యే సాధారణ సమస్య. ఈస్ట్రోజెన్ స్థాయులు పడిపోవడం వల్ల ఈ సమస్య ఎదురవుతుంది. అందువల్ల రోజూ రెండు నుంచి మూడు లీటర్ల నీరు తాగాలి. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. హార్మోన్ల అసమతుల్యత వల్ల వచ్చే ఉబ్బరం వంటి సమస్యలను మంచినీరు తగ్గిస్తుంది.