ఆరు నెలల క్రితమే పార్లమెంటరీ కమిటీ హెచ్చరికలు హైలెవల్ కమిటీ సూచనలూ బేఖాతరు
బ్లాక్‌లిస్ట్ కంపెనీలకే మళ్లీ కాంట్రాక్టులు
పరీక్షల భద్రతపై తీవ్ర ప్రశ్నలు
తాజాగా మరోసారి నీట్ లీక్ వివాదం
నష్టపోతున్న విద్యార్థులు, అభ్యర్థులు
మోడీ సర్కారుపై విమర్శల వెల్లువ
న్యూఢిల్లీ : నీట్ యూజీ-2026 పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా మరోసారి ఆగ్రహాన్ని రగిలిచింది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఇప్పటికే మోడీ సర్కారుపై తీవ్ర అసంతృప్తిని వెలిబుచ్చుతున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో పరీక్షల నిర్వహణలో వరుస వైఫల్యాలతో విమర్శలు ఎదుర్కొంటున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) పని తీరు చర్చకు వస్తోంది. కేంద్రం నిర్లక్ష్యం, ఎన్‌టీఏ ఉదాసీన వైఖరి వెరసి ఇప్పుడు పేపర్ లీక్ వ్యవహారంతో లక్షలాది మంది విద్యార్థులు ప్రభావితం కావాల్సిన పరిస్థితి ఏర్పడిందని మేధావులు, విద్యావేత్తలు అంటున్నారు. ఎన్‌టీఏపై పార్లమెంటరీ ప్యానెల్ స్టాండింగ్ కమిటీ గతేడాది డిసెంబర్‌లోని తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ విషయంలో గట్టిగానే హెచ్చరించింది. అయినా సంస్థ తీరులో మార్పు రాలేదనీ, చివరికి ఈ ఏడాది నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీకేజీతో ఇది బట్టబయ లైందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్‌టీఏ తన పనితీరును సరిచేసుకోవాలి అంటూ కమిటీ హెచ్చరించిన ఆరు నెలలకే మరోసారి నీట్ లీక్ వివాదం వెలుగుచూడటంతో దీనిని మోడీ సర్కారు వైఫల్యంగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
2024.. వ్యవస్థను కుదిపేసిన సంవత్సరం
2024లో మోడీ సర్కారు మళ్లీ అధికారంలోకి వచ్చింది. కొద్ది రోజులకే మే నెలలో వెలుగు చూసిన నీట్ పేపర్ లీక్ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలకు దారి తీసింది. ఈ ఘటనతో కేంద్రం ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పరీక్షల వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో 2024 జూన్‌లో కేంద్ర విద్యాశాఖ… ఎన్‌టీఏ ద్వారా నిర్వహించే పరీక్షలను పారదర్శకంగా, సజావుగా, నిష్పక్ష పాతంగా నిర్వహించేందుకు హై లెవల్ కమిటీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ (హెచ్‌ఎల్‌సీఈ)ను ఏర్పాటు చేసింది.
నమ్మకమైన వ్యవస్థను
అందించడంలో కేంద్రం విఫలం
విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన జాతీయ స్థాయి పరీక్షల విషయంలో వరుసగా జరుగుతున్న లీకులు, గందరగోళ పరిస్థితులు కేవలం పరిపాలనా లోపాలుగా మాత్రమే చూడలేమని విమర్శకులు అంటున్నారు. పార్లమెంటరీ కమిటీ హెచ్చరికలు, నిపుణుల కమిటీ సిఫారసులు ఉన్నప్పటికీ పరిస్థితి మారకపోవడం మోడీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ‘పరీక్షల పారదర్శకత’ అంటూ ప్రచారం చేసిన కేంద్రం… విద్యార్థులకు నమ్మకమైన వ్యవస్థను అందించడంలో మాత్రం విఫలమైందనే భావన దేశవ్యాప్తంగా బలపడుతోంది.
హై లెవల్ కమిటీ సూచనలు పట్టించుకోని మోడీ సర్కారు
పరీక్షల నిర్వహణ విధానం, డేటా భద్రతా ప్రమాణాలు, అలాగే ఎన్‌టీఏ నిర్మాణం, పనితీరులో సంస్కరణలపై సూచనలు ఇవ్వడం ఈ కమిటీ బాధ్య తగా నిర్ణయించారు. ఇస్రో మాజీ చైర్మెన్ కె.రాధాకృష్ణన్ అధ్యక్షతన ఈ కమిటీ ఏర్పడింది. ఈ కమిటీ గతేడాది అక్టో బర్‌లో తన నివేదికను సమర్పిం చింది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడా తన నివేదికలో ఈ కమిటీ సూచనలు, పరీశీలనల పైనే ప్రధానంగా ఆధారప డింది. ఈ హెచ్‌ఎల్‌సీఏ కమిటీ ప్రశ్నా పత్రాల భద్రత కోసం ఎన్‌క్రిప్టెడ్ డిజిటల్ డెలివరీ, పరీక్షా కేంద్రాల వద్దే ప్రింటింగ్, మొబైల్ ఫోన్ల నిషేధం, ఏడాది పాటు సీసీటీవీ రికార్డులను భద్రపరచడం, జియో ట్యాగింగ్‌తో రవాణా వంటి పలు కీలక సూచనలు చేసింది. అలాగే ప్రయివేటు సంస్థలపై ఆధారపడకుండా ప్రభుత్వ ఆధ్వర్యం లోనే దేశవ్యాప్తంగా వెయ్యి భద్రతా పరీక్షా కేంద్రాలను నిర్మించాలని సిఫారసు చేసింది. ఈ సూచనల అమలు విషయంలో కేంద్రం ఆసక్తి చూపలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
2024 లోనూ గందరగోళ పరిస్థితులే
2024లో ఎన్‌టీఏ నిర్వహించిన 14 ప్రధాన పోటీ పరీక్షల్లో కనీసం ఐదు పరీక్షలు తీవ్ర గందరగోళ పరిస్థితులను ఎదుర్కొన్నాయని పార్లమెంటరీ కమిటీ తన 371వ నివేదికలో ప్రస్తావించింది. నీట్-యూజీ పేపర్ లీక్, యూజీసీ-నెట్, సీఎస్‌ఐఆర్-నెట్, నీట్-పీజీ వాయిదాలు, సీయూఈటీ ఫలితాలు ఆలస్యం వంటి ఘటనలు పరీక్షా వ్యవస్థ విశ్వసనీయతను దెబ్బతీశాయని పేర్కొంది. పరీక్షా పత్రాల తయారీ, నిర్వహణ, మూల్యాంకనంలో పాల్గొన్న కొన్ని సంస్థలు ఒక రాష్ట్రంలో బ్లాక్‌లిస్ట్ అయినప్పటికీ, ఇతర రాష్ట్రాలు, సంస్థల నుంచి మళ్లీ కాంట్రాక్టులు పొందుతున్నాయని కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. అలాంటి సంస్థలు భవిష్యత్తులో ఎలాంటి ప్రవేశ పరీక్షల్లోనూ పాల్గొనకుండా దేశవ్యాప్తంగా బ్లాక్‌లిస్ట్ జాబితా రూపొందించాలని సిఫారసు చేసింది.



