Friday, May 15, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంద్వైపాక్షిక సంబంధాల్లో తైవానే కీలకం

ద్వైపాక్షిక సంబంధాల్లో తైవానే కీలకం

- Advertisement -

శత్రువులుగా కాదు… భాగస్వాములుగా ఉందాం
సరిగా వ్యవహరించకుంటే సంఘర్షణలు తప్పవు
శిఖరాగ్ర సదస్సులో ట్రంప్‌నుహెచ్చరించిన జిన్‌పింగ్
జిన్ పింగ్ గొప్ప నాయకులు… నేనిలా మాట్లాడటం కొందరికి నచ్చదు.. అయినా అదే నిజం: ట్రంప్

శిఖరాగ్ర సదస్సులో ట్రంప్‌ను 
హెచ్చరించిన జిన్‌పింగ్
• భాగస్వాములుగా ఉందాం… 
శత్రువులుగా కాదంటూ సూచన

బీజింగ్ : చైనా, అమెరికా సంబంధాలలో తైవాన్ అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తెలిపారు. తైవాన్ విషయంలో సరిగా వ్యవహరించకపోతే తీవ్రమైన ప్రమాదకర పరిస్థితి’ తలెత్తుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఆయన హెచ్చరించారు. చైనా పర్యటనలో ఉన్న ట్రంప్, జిన్‌పింగ్ మధ్య గురువారం శిఖరాగ్ర సమావేశం ప్రారంభమైంది. ఇది శుక్రవారం కూడా కొనసాగుతుంది. గురువారం సుమారు రెండు గంటల పాటు జరిగిన సమావేశంలో జిన్‌పింగ్ మాట్లాడుతూ ఇరు దేశాల సంబంధాలలో దీనిని నూతనాధ్యాయంగా అభివర్ణించారు. తైవాన్ విషయంలో సరిగా వ్యవహరిస్తేనే ద్వైపాక్షిక సంబంధాలు స్థిరంగా ఉంటాయని జిన్‌పింగ్ స్పష్టం చేశారని చైనా అధికార వార్తా సంస్థ సిన్హువా తెలిపింది. లేనిపక్షంలో ఘర్షణలు, సంఘర్షణలకు గురయ్యే ప్రమాదం ఉన్నదని, ఇవి అమెరికా‘చైనా సంబంధాలను తీవ్ర ప్రమాదంలో పడేస్తాయని జిన్‌పింగ్ చెప్పారు. అమెరికా‘చైనా సంబంధాలకు నిర్మాణాత్మక, వ్యూహాత్మక, స్థిరమైన దిశను నిర్దేశించేందుకు తాను, ట్రంప్ అంగీకరించామని అన్నారు.

రాబోయే మÖడు సంవత్సరాలు, ఆ తర్వాత కూడా ద్వైపాక్షిక సంబంధాలు ఆ దిశలోనే కొనసాగాలని ఆకాంక్షించారు. పోటీకి పరిమితులు ఉండాలని, విభేదాలను పరిష్కరించుకుంటూ ముందుకు సాగాలని అభిప్రాయపడ్డారు. లక్ష్యాల సాధన కోసం రెండు దేశాలు రాజకీయ, దౌత్య, సైనిక సంప్రదింపులను కొనసాగించాలని సూచించారు. అమెరికాతో స్థిరమైన, ఆరోగ్యకరమైన సంబంధాలను చైనా కోరుకుంటోందని అన్నారు. ‘సహకారం ఇరు పక్షాలకూ మేలు చేస్తుంది. ఘర్షణ ఇరువురికీ నష్టం కలిగిస్తుంది’ అని వ్యాఖ్యానించారు. రెండు దేశాలు ప్రత్యర్థులుగా వ్యవహరించకుండా భాగస్వాములుగా ఉండాలని, కలసికట్టుగా పనిచేసి ద్వైపాక్షిక సంబంధాలకు సరైన మార్గాన్ని నిర్దేశించాలని ఆకాంక్షించారు. సవాళ్లను ఎదుర్కోవడానికి, ప్రపంచానికి మరింత స్థిరత్వాన్ని తీసుకొని రావడానికి రెండు దేశాలు కలిసి పనిచేయగలవా అనేదే ఇప్పుడు చైనా, అమెరికాల ముందున్న ప్రశ్న అని అన్నారు. రెండు దేశాల ప్రజల శ్రేయస్సును, మానవాళి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ద్వైపాక్షిక సంబంధాల కోసం ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోగలవా అని ప్రశ్నించారు.

చైనాలో అమెరికా కంపెనీలకు ఉజ్వల భవిష్యత్తు అమెరికా వ్యాపారానికి చైనాలో విస్తృత అవకాశాలు ఉంటాయని ట్రంప్‌తో పాటు బీజింగ్ వచ్చిన కార్పొరేట్ ప్రతినిధి బృందంతో జిన్‌పింగ్ అన్నారు. చైనాలో అమెరికా కంపెనీలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. తమ వ్యాపారవేత్తలందరూ చైనాను గౌరవిస్తారని, చైనాకు విలువ ఇస్తారని, చైనాతో సహకారాన్ని పెంచుకునేలా తాను వారిని ప్రోత్సహిస్తున్నానని ట్రంప్ తెలిపారు. ట్రంప్‌తో పాటు ఆపిల్ సీఈఓ టిమ్ కుక్, బోయింగ్‌కు చెందిన కెల్లీ ఓర్ట్‌బర్గ్, ఎన్విడియా సీఈఓ జాన్సన్ హువాంగ్, టెస్లా అధిపతి ఎలన్ మస్క్ సహా 17 మంది వ్యాపార ప్రముఖులు బీజింగ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. చైనా సంస్కరణలు, స్వేచ్ఛాయుత విధానాలలో అమెరికా కంపెనీలు క్రియాశీలకంగా పాలుపంచుకుం టున్నాయని, దీనివల్ల ఇరు పక్షాలకూ ప్రయోజనం కలుగుతోందని జిన్‌పింగ్ అన్నారు.

చైనాతో పరస్పర ప్రయోజనకరమైన సహకారాన్ని పెంపొందించుకోవాలని అమెరికా కూడా కోరుకుంటోందని, చైనాలో అమెరికా వ్యాపారాలకు అపార అవకాశాలు ఉంటాయని భావిస్తోందని చెప్పారు. తన వెంట వచ్చిన వ్యాపారవేత్తలందరినీ ట్రంప్ పేరుపేరునా జిన్‌పింగ్‌కు పరిచయం చేశారు. అమెరికా వ్యాపారవేత్తలు చైనా మార్కెట్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, చైనాలో తమ వ్యాపార కార్యకలాపాలను మరింతగా విస్తరించాలని కోరుకుంటున్నారని, చైనాతో సహకారాన్ని పెంచుకోవాలని భావిస్తున్నారని ట్రంప్ తెలిపారు. ‘మీరు గొప్ప నాయకులు. నేను అలా చెప్పడం ప్రజలకు నచ్చదు. కానీ నేను చెప్పింది నిజం’ అని జిన్‌పింగ్‌ను ఉద్దేశించి ట్రంప్ అన్నారు.

అమెరికా చమురు కొనుగోలుపై చైనా ఆసక్తి : వైట్‌హౌస్
స్పందించని బీజింగ్
హార్ముజ్ జలసంధిపై ఆధారపడడాన్ని తగ్గించుకొని, అమెరికా నుంచి మరింత చమురును కొనుగోలు చేసేందుకు చైనా ఆసక్తిగా ఉన్నదని ట్రంప్‌కు జిన్‌పింగ్ చెప్పారని శ్వేతసౌధం ఒక ప్రకటనలో తెలిపింది. అయితే చైనా ప్రభుత్వ మీడియా మాత్రం తన వార్తలలో ఈ ప్రస్తావనే తీసుకురాలేదు. చైనా విదేశాంగ శాఖ కూడా దీనిపై ఇంకా స్పందించలేదు. ప్రపంచంలో అత్యధికంగా చమురును దిగుమతి చేసుకుంటున్న దేశం చైనాయే. అయితే చైనాకు అమెరికా నుంచి చమురు సరఫరాలు చాలా తక్కువగా జరుగుతున్నాయి. గత సంవత్సరం మే నుంచి అమెరికా నుంచి చైనా చమురును దిగుమతి చేసుకోలేదు. రెండు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధం కారణంగా అమెరికా తన చమురు ఎగుమతులపై 20 శాతం సుంకం విధించడంతో చైనా అక్కడి నుంచి కొనుగోలును ఆపేసింది.ధన సరఫరాల కోసం హార్ముజ్‌ను తెరవాలి హార్ముజ్ జలసంధిని తెరిచి ఉంచాలనే విషయంపై ట్రంప్, జిన్‌పింగ్ ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశారని అమెరికా అధ్యక్ష భవనం తెలిపింది.

ఇంధన సరఫరాలు సజావుగా జరగడానికి వీలుగా జలసంధిని తెరచి ఉంచాలని ఇరు పక్షాలు అభిప్రాయపడ్డాయని చెప్పింది. ట్రంప్, జిన్‌పింగ్ మధ్య సమావేశం బాగా జరిగిందని వైట్‌హౌస్ ప్రకటన తెలియజేసింది. అయితే ఆ ప్రకటనలో తైవాన్ ప్రస్తావన లేకపోవడం గమనార్హం. ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేసుకునేందుకు అనుసరించాల్సిన మార్గాలపై ఇరు పక్షాలు చర్చించాయని తెలిపింది. జిన్‌పింగ్‌తో చర్చలు గొప్పగా, సానుకూలంగా, నిర్మాణాత్మకంగా జరిగాయని విలేకరుల ప్రశ్నలకు సమాధానంగా ట్రంప్ చెప్పారు. తైవాన్ గురించి చర్చించారా అని ప్రశ్నించగా సమాధానమిచ్చేందుకు నిరాకరించారు. టెంపుల్ ఆఫ్ హెవెన్‌కు చేరుకున్న తర్వాత జిన్‌పింగ్‌తో కలిసి ట్రంప్ ఫొటోలకు ఫోజులిచ్చారు. అంతకుముందు శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ట్రంప్‌నకు బీజింగ్‌లోని గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్ వద్ద లాంఛనప్రాయమైన స్వాగతం లభించింది.

సెప్టెంబర్ 24న వాషింగ్టన్ కు రండి : ట్రంప్ ఆహ్వానం
బీజింగ్‌లో తన గౌరవార్థం చైనా ప్రభుత్వం ఇచ్చిన విందుకు హాజరైన సందర్భంగా ట్రంప్ ప్రసంగిస్తూ తాను జరిపిన సమావేశాలు సానుకూలంగా, నిర్మాణాత్మకంగా సాగాయని తెలిపారు. రెండు దేశాలు భవిష్యత్తులో మరింత సహకారాన్ని పెంపొందించుకునే అవకాశం ఉన్నదని చెప్పారు. చైనా, అమెరికా మధ్య నిర్మాణాత్మక భాగస్వామ్యం, బలమైన సంబంధాలు ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. సెప్టెంబర్ 24న అమెరికాలో పర్యటించాల్సిందిగా జిన్‌పింగ్‌ను ఆహ్వానించానని అన్నారు. కాగా ద్వైపాక్షిక సంబంధాలు సరైన దారిలో నడవాల్సిన అవసరం ఉన్నదని జిన్‌పింగ్ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -