ఆమెకు రాజకీయ సభలంటే పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. జనం గుంపులు, నినాదాలు, స్టేజ్ మీద పొడవాటి ప్రసంగాలు… ఇవన్నీ తన ప్రపంచానికి దూరమని అనుకునేది. ఒకసారి నవ్వుతూ చెప్పింది కూడా.. ”మీ మీటింగ్స్‌లో అందరూ కోపంగానే ఎందుకు మాట్లాడతారు రామ్?” ”ఎందుకంటే బయట ప్రపంచం అంత సంతోషంగా లేదు కాబట్టి” అన్నాను. ఆమె నవ్వేసింది. కానీ ఆ సమాధానం ఆమెలో ఎక్కడో నిశ్శబ్దంగా మిగిలిపోయింది. ఆ రోజు జిల్లా కేంద్రంలో రైతుల సమస్యలపై భారీ బహిరంగ సభ. మధ్యాహ్నం నుంచే హడావిడి. ఫోన్లు, ఏర్పాట్లు, పరుగులు. అప్పుడే ఆమె మెసేజ్ వచ్చింది…
”ఈరోజు నీ మీటింగ్‌కి వస్తాను.”
నేను ఆశ్చర్యపోయాను.
”బోర్ కొడుతుంది” అన్నాను.
”నువ్వుంటావు కదా…” అని రిప్లై.
ఆ ఒక్క వాక్యం… రోజంతా ఉన్న అలసటను ఎక్కడో కడిగేసింది. సాయంత్రానికి సభాస్థలి జనంతో నిండిపోయింది. ఎర్రజెండాలు గాలిలో రెపరెపలాడుతున్నాయి. ధూళి, చెమట, టీ ఆవిరి, నినాదాల వేడి.. అక్కడ ఒక జీవవంతమైన అగ్ని… నేను స్టేజ్ వెనుక నిలబడి నోట్స్ చూస్తున్నాను. అప్పుడే జనంలో ఆమె కనిపించింది. తెల్లటి కాటన్ డ్రెస్. వదులుగా జారిన జుట్టు. హడావిడి మధ్యలో కూడా ఒక అసాధారణ నిశ్శబ్దం. ఆమె కళ్లతో నన్నే వెతుకుతోంది. మా చూపులు కలిశాయి. ఆమె నవ్వింది. ఆ నవ్వులో ఒక కొత్తతనం ఉంది.. ”నీ ప్రపంచాన్ని కూడా చూడటానికి వచ్చాను” అన్నట్టుగా. సభ మొదలైంది.
”కామ్రేడ్స్…”
ఆ పదం గాల్లో పగిలిన క్షణంలో నా లోపల ఏదో మేల్కొంది. కొన్ని విషయాలు మనిషి నేర్చుకోడు. అవి అతని రక్తంలోనే ఉంటాయి. నా పేరు పిలిచారు. నేను స్టేజ్ పైకి వెళ్లాను. వేలాది ముఖాలు. కొన్ని అలసినవి. కొన్ని కోపంతో మరిగినవి. కొన్ని ఇంకా ఆశను పట్టుకున్నవి. మైక్ ముందు నిలబడగానే ఎందుకో నా చూపు మళ్లీ ఆమె దగ్గరే ఆగిపోయింది. ఆమె చాలా శ్రద్ధగా చూస్తోంది. నేను మొదట నెమ్మదిగా మాట్లాడాను. తర్వాత మాటలు లోపల దాచుకున్న అగ్నిలా మారాయి.
”ఈ దేశంలో అన్నం పండించే రైతుకే భూమి మీద హక్కు లేకపోతే… అది అన్యాయం కాదు, వ్యవస్థ వైఫల్యం…” చప్పట్లు.
”రోజంతా చెమటోడ్చిన మనిషి రాత్రికి ఆకలితో పడుకుంటే… ఆ అభివద్ధి ఎవరి కోసం?”… నినాదాలు. కానీ ఆ గోల మధ్యలో నాకు స్పష్టంగా కనిపించింది మాత్రం ఆమె ముఖమే.
ఆమె నన్నే చూస్తోంది. ఆ చూపులో ప్రేమ మాత్రమే కాదు… కొత్తగా గౌరవం కూడా కనిపిస్తోంది. బహుశా మొదటిసారి ఆమె అర్థం చేసుకుని ఉంటుంది.. నేను కేవలం ఆమెతో కాఫీలు తాగే మనిషిని కాదని. నా లోపల చాలా మందికి చెందిన బాధ కూడా జీవిస్తోంది అని. ప్రసంగం ముగిసింది. స్టేజ్ దిగాను. కానీ మనసు మాత్రం ఆమె వైపుకే పరుగెత్తుతోంది. ఆమె కొద్దిదూరంలో నిలబడి ఉంది. నేను దగ్గరకి వెళ్లాను. కొద్దిసేపు ఏమీ మాట్లాడలేదు. కేవలం నన్నే చూస్తోంది.
”ఏమైంది?” అన్నాను.
ఆమె మెల్లగా తల ఊపుతూ.. ”ఏమీ లేదు..”
”అయితే అలా ఎందుకు చూస్తున్నావు?”..
ఆమె నవ్వింది.
”నువ్వు స్టేజ్ మీద ఉన్నప్పుడు… నాకు భయం వేసింది.”
”ఎందుకు?”
ఆమె కాస్త ఆగింది.
”అంతమందిలో కూడా నువ్వు చాలా ఒంటరిగా కనిపించావు రామ్…” ఆ మాట… నా లోపల ఎక్కడో లోతుగా పడిపోయింది. ఎందుకంటే అది నిజం. ప్రజల కోసం మాట్లాడే మనుషుల లోపల ఒక తెలియని ఒంటరితనం ఉంటుంది. అది ఎవరికీ కనిపించదు. కానీ ఆమె చూసింది. మేం నడుచుకుంటూ బయటికి వచ్చాం. రోడ్డు మీద ఇంకా ఎర్రజెండాలు ఊగుతున్నాయి. దూరంగా నినాదాలు వినిపిస్తున్నాయి. ఆమె ఒక్కసారిగా నా చేతిని పట్టుకుంది. ఆ స్పర్శలో ఒక మదుత్వం.
”రామ్…” అంది.
”నీ మీద ఇప్పుడు ఇంకాస్త ప్రేమ పెరిగింది.”
నేను నవ్వాను.
”రాజకీయ ప్రభావమా?”
ఆమె తల ఊపింది.
”లేదు…”
కొద్దిసేపు ఆగి అంది… ”ఇంతమందిని గురించి నిజంగా బాధపడగలిగే మనిషిని ప్రేమించడం… కొంచెం ప్రమాదకరమే అనిపిస్తోంది.”
”ఎందుకు?”
ఆమె నా భుజానికి దగ్గరైంది.
”ఎందుకంటే… అలాంటి మనుషులు పూర్తిగా ఒక్కరి సొంతం కాలేరు.”
ఆ మాట తర్వాత మధ్యలో ఒక నిశ్శబ్దం పుట్టింది. ఆ నిశ్శబ్దంలోనే నేను మొదటిసారి అర్థం చేసుకున్నాను.. ప్రేమ అంటే ఎవరినో దగ్గరగా ఉంచుకోవడం మాత్రమే కాదు. వాళ్ల దూరాన్ని కూడా అంగీకరించడం. ఆ రాత్రి గాలి చాలా మదువుగా ఉంది. వీధిదీపాల వెలుతురులో ఆమె ముఖం చూస్తుంటే ప్రేమ, పోరాటం రెండూ వేర్వేరు కాదని అనిపించింది. కొందరు మనుషులు మన చేతిని మాత్రమే కాదు… మన ఆశయాలను కూడా పట్టుకుంటారు. ఆమె అలాంటిదే. వెళ్లే ముందు ఒక్కసారి వెనక్కి తిరిగింది. చిన్నగా నవ్వుతూ అంది… ‘Good night… కామ్రేడ్.” ఆ ఒక్క పదం… ఇప్పటికీ నా లోపల అరుణపతాకమై నిశ్శబ్దంగా రెపరెపలాడుతూనే ఉంటుంది.
– రామ్



