Sunday, May 17, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుపొదుపు సరే..యుద్ధాన్ని ఆపే ప్రయత్నమేది?

పొదుపు సరే..యుద్ధాన్ని ఆపే ప్రయత్నమేది?

- Advertisement -

మోడీ అమెరికాకు దాసోహం అనడం వల్లే ఈ దుస్థితి
ఇరాన్‌‌పై అమెరికా, ఇజ్రాయిల్‌ చేస్తున్న యుద్ధాన్ని ఆపడంలో కేంద్రం వైఫల్యం
పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుతో సామాన్యులపై నేరుగా భారాలు
పరిశ్రమలు మూతపడి ఉపాధి కోల్పోతున్న కార్మికులు :
ఇంధన ధరల పెంపు నిరసనలో సీపీఐ(ఎం) పొలిట్‌‌బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు
నిత్యావసర వస్తువుల ధరలు ఇంకా పెరుగుతాయి : సీపీఐ(ఎం) రాష్ర్ట కార్యదర్శి జాన్‌‌వెస్లీ

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మోడీ చెబుతున్న పొదుపుమంత్రంతో దేశాభివృద్ధి ఎలా సాధ్యమని సీపీఐ(ఎం) పొలిట్‌‌బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు ప్రశ్నించారు. పెట్రోల్‌, డీజిల్‌ ‌ధరల పెంపు ప్రభావం ప్రజలపై నేరుగా పడుతుందనీ, గ్యాస్‌ ‌ధరల పెంపుతో ఇప్పటికే అనేక పరిశ్రమలు మూతపడి కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ‌ధరలు పెంచడాన్ని నిరసిస్తూ శనివారం హైదరాబాద్‌‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ ఇంధన ధరల పెంపు ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపైనా, సామాన్య ప్రజానీకంపైనా తీవ్ర భారాన్ని మోపుతుందని తెలిపారు. ఇప్పటికే ధరలు పెరిగిపోయి అనేక పరిశ్రమలు దెబ్బతిని కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని గుర్తుచేశారు. ప్రస్తుతం దేశం తీవ్రమైన దుర్భర పరిస్థితిలో ఉందన్నారు.

ఇరాన్‌- అమెరికా, ఇజ్రాయిల్‌ ‌మధ్య యుద్ధం జరుగుతున్నది కాబట్టి పొదుపు చర్యలు చేపట్టాలని ప్రధాని మోడీ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పొదుపు పాటించట్లేదు కాదు కాబట్టి ధరలు పెంచుతామని చెప్పడం ఏంటన్నారు. నేరం ఒకరు చేస్తే, శిక్ష‍ ప్రజలకు వేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా, ఇజ్రాయిల్‌ ‌యుద్ధం ఆపితే ధరలు పెంచాల్సిన అవసరం లేదనీ, కానీ ప్రధాన మంత్రి మోడీ యుద్ధ నివారణ చర్యలు తీసుకోకుండా, అమెరికాకు దాసోహం అయ్యి ట్రంప్‌‌నకు సాష్టాంగ నమస్కారం చేస్తూ ప్రజలు పెరిగిన ధరలను భరించాలని చెప్పడం గర్హనీయమని అన్నారు. యూరియాను మానేయండి..విదేశీ ప్రయాణాలు ఆపండి…బంగారం కొనకండి.. ఆఫీసులకు వెళ్లకుండా వర్క్‌‌ఫ్రమ్‌ ‌హోం ‌చేయండి అనటం సరికాదనీ, అవన్నీ చేస్తే దేశ ఆర్థిక వ్యవస్థ ఏం కావాలని ప్రశ్నించారు. ఉత్పత్తి దెబ్బతిన్న తర్వాత దేశ అభివృద్ధి ఎలా సాధ్యమ వుతుందన్నారు. యుద్ధం చేస్తున్న వారికి మద్దతిచ్చేలా మోడీ విదేశీ పర్యటనలు ఉంటున్నాయని విమర్శిం చారు. హార్మూజ్‌‌పై అమెరికా దిగ్బంధనం విరమించుకునేలా కేంద్రం ఒత్తిడి తేవాలని కోరారు.

యుద్ధ నివారణకు కేంద్ర ప్రభుత్వం పూనుకోవాలని సూచించారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ మాట్లా డుతూ..గ్యాస్‌ ‌ధరలు పెరగడం వల్ల హోటళ్లలో టిఫిన్లు, భోజనం ధరలు పెరిగాయనీ, అనేక హాస్టళ్లు మూత పడ్డాయని తెలిపారు. ఇప్పుడు పెట్రోల్‌, డీజిల్‌ ‌ధరలు పెరగడంతో నిత్యావసర సరుకుల ధరలు పెరిగే ప్రమాదముందని హెచ్చరించారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రజలు పెద్ద ఎత్తున పోరాటాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జ్యోతి, జి.నాగయ్య, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యలు పాలడుగు భాస్కర్‌, మల్లు లక్ష్మి, బండారు రవికుమార్‌, సీనియర్‌ ‌నేత డీజీ.నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -