నవతెలంగాణ-హైదరాబాద్: టీఎంసీ అధినేత మమతా బెనర్జీకి మరో రాజ్యసభ ఎంపీ రుక్మిణి మల్లిక్ (కోయెల్ మల్లిక్) షాక్ ఇచ్చారు. టీఎంసీకి, రాజ్యసభ సభ్యత్వానికి రుక్మిణి మల్లిక్ గురువారం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్‌కు ఆమె సమర్పించారు. దీంతో రాజ్యసభ నుంచి వైదొలిగిన నాలుగో టీఎంసీ ఎంపీగా రుక్మిణి నిలిచారు. ఇప్పటికే ఆ పార్టీ నుంచి సుఖేందు శేఖర్ రాయ్, ప్రకాశ్ చిక్ బరైక్, సుష్మితా దేబ్ తమతమ రాజ్యసభ ఎంపీ పదవులకు రాజీనామా చేశారు.
బెంగాల్ ప్రజలకు సేవ చేసే అవకాశం లభించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది ఓ కొత్త ప్రయాణానికి ఆరంభమని, ఉత్తమంగా పని చేసేందుకు ప్రయత్నిస్తానని రుక్మిణి చెప్పుకొచ్చారు. రుక్మిణి మల్లిక్.. కోయెల్ మల్లిక్ పేరుతో బెంగాలీ చిత్ర పరిశ్రమలో అగ్రశ్రేణి నటి. టాలీ-క్వీన్‌గా ప్రసిద్ధి చెందిన రుక్మిణి రెండు దశాబ్దాలకు పైగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. 2023లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆమెకు మహానాయక్ సమ్మాన్‌ను కూడా ప్రదానం చేసింది. అనంతరం టీఎంసీ పార్టీ ఆమెను రాజ్యసభకు నామినేట్ చేసింది.



