అటవీ భూములపై సాగుచేస్తున్న ఆదివాసులకు హక్కు పత్రాలివ్వాలి
తునికాకు కార్మికులకు బకాయి బోనస్ వెంటనే చెల్లించాలి:
కేంద్ర మంత్రి జువల్ ఓరంనకు గిరిజన సంఘం నేతలు వినతి
నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో
కార్పొరేట్ల కోసం గిరిజన హక్కులను మోడీ ప్రభుత్వం కాలరాస్తోందని గిరిజన సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో గిరిజనుల ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కేంద్ర గిరిజన శాఖ మంత్రి జువల్ ఓరంను ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ (ఏఏఆర్ఎం) అఖిల భారత ప్రతినిధి బృందం కలిసి వినతిపత్రం సమర్పించింది. ఈ ప్రతినిధి బృందంలో ఏఏఆర్ఎం చైర్మెన్ జతిన్ చౌదరి, ఉపాధ్యక్షురాలు బృందా కరత్, ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్, తెలంగాణ గిరిజన సంఘం నేతలు సచిన్, ధర్మానాయక్, ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం నేతలు సురేంద్ర, అప్పలన రసయ్యతో పాటు వివిధ రాష్ట్రాల గిరిజన, వ్యవసాయ కార్మిక ఉద్యమ నాయకులు పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు సచిన్, ధర్మానాయక్ మాట్లాడారు. ఆదివాసులు అడవుల ఆక్రమణదారులు కాదని, వారే అసలైన రక్షకులన్నారు. దేశ సంపదైన అటవీ వనరులు, ఖనిజ సంపద, నీటి వనరులు, జీవ వైవిధ్యాన్ని తరతరాలుగా కాపాడుతూ సమాజ నిర్మాణానికి త్యాగాలు చేసినవారు గిరిజనులు, ఇతర పేద ప్రజలేనన్నారు.
రాజ్యాంగంలోని ఐదు, ఆరో షెడ్యూళ్లు గిరిజనుల హక్కులను రక్షించేందుకు ఏర్పాటైనవని, మోడీ ప్రభుత్వం కార్పొరేట్ దోపిడీకి అనుకూలంగా వాటిని నిర్వీర్యం చేస్తోందని తీవ్రంగా విమర్శించారు. ముఖ్యంగా అదాని వంటి కార్పొరేట్ శక్తులకు అడవులు, ఖనిజ సంపదలను అప్పగిస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కుతోందని ధ్వజమెత్తారు. అటవీ హక్కుల చట్టం (ఎఫ్ఆర్ఏ), పెసా చట్టం (పీఈఎస్ఏ) అమలును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని, గిరిజన గ్రామసభల హక్కులను పక్కనబెట్టి బలవంతపు భూసేకరణ, మైనింగ్ ప్రాజెక్టులు, హైడల్ ప్రాజెక్టులు అమలు చేస్తున్నాయని విమర్శించారు. అటవీ చట్టాలను కార్పొరేట్లకు అనుకూలంగా మార్చి, గిరిజనులను అడవుల నుంచి బహిష్కరించే కుట్ర జరుగుతోందని దుయ్యబట్టారు. దేశవ్యాప్తంగా బొగ్గు గనుల ప్రయివేటీకరణ, అటవీ ప్రాంతాల వేలం, భారీ కార్పొరేట్ మైనింగ్ ప్రాజెక్టుల కారణంగా లక్షలాది మంది ఆదివాసులు నిర్వాసితులవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. “జల్-జంగల్-జమీన్” పై గిరిజనుల హక్కులను కాపాడేందుకు పోరాటాలను మరింత ఉదృతం చేస్తామని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రధాన డిమాండ్లను కేంద్ర మంత్రికి సమర్పించామని తెలిపారు. గిరిజన ప్రాంత ఉద్యోగాల్లో వంద శాతం రిజర్వేషన్ కల్పించేలా చట్టం చేయాలని, ఐటీడీఏలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని, పెండింగ్‌లో ఉన్న ట్రైకార్ రుణాలను విడుదల చేయాలని, అటవీ భూములపై సాగు చేస్తున్న ఆదివాసులకు హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే తునికాకు కార్మికులకు బకాయి బోనస్ వెంటనే చెల్లించాలని, ఒక్క కట్టకు రూ.5 ధర నిర్ణయించాలని కోరారు. ములుగు గిరిజన యూనివర్సిటీకి నిధులు విడుదల చేసి తరగతులు ప్రారంభించాలని కోరారు. కొమురం భీం కన్జర్వేషన్ రిజర్వ్ జీఓ నెం.49ను రద్దు చేయాలని, టైగర్ కారిడార్ పేరుతో ఆదివాసి గ్రామాలను ఖాళీ చేయించే చర్యలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతాల్లో ఉపాధి హామీ పనిదినాలను 200 రోజులకు పెంచి రోజుకు రూ.600 ఇవ్వాలని, నిలిపివేసిన పనులను వెంటనే పునరుద్ధరించాలని కోరారు. ఐటీడీఏ కేంద్రాల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేయాలని, ఆశ్రమ పాఠశాలలు, ఏకలవ్య పాఠశాలలు, ఎస్ఎం హాస్టళ్లకు తగిన బడ్జెట్ కేటాయించి మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల విధానాలను విరమించి, రాజ్యాంగ పరిరక్షణ, గిరిజన హక్కుల అమలుకు కట్టుబడి పనిచేయాలని డిమాండ్ చేశారు.
గిరిజన ప్రాంత ఉద్యోగాల్లోవంద శాతం రిజర్వేషన్ కల్పించేలా చట్టం చేయాలి
- Advertisement -
- Advertisement -



