Monday, May 18, 2026
E-PAPER
Homeజాతీయంబర్నింగ్ ట్రైన్లు

బర్నింగ్ ట్రైన్లు

- Advertisement -

మొన్న నాంపల్లి..ఇపుడు రాజధాని ఎక్స్ ప్రెస్
తగలబడుతున్న ఏసీ బోగిలు
షార్ట్ సర్కుట్ అంటూ చేతులు దులుపుకుంటున్న రైల్వేశాఖ

రత్లాన్: ప్రయాణికులను సురక్షితంగా తరలించాల్సిన రైళ్లు కాస్త..బర్నింగ్ ట్రైన్లుగా మారుతు న్నాయి మొన్న నాంపల్లి రైల్వేస్టేషన్ లో ఆగి ఉన్న రైలు బోగీ అమాంతంగా తగలబడింది. ఇపుడు రాజధాని రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలుఎగిసిపడ్డాయి. లోకో పైలెట్ అప్ర మత్తతతో ప్రాణాపాయం తప్పింది.
ఏం జరిగింది..తిరువనంతపురం నుంచి హజ్రత్ నిజాముద్దీన్ వెళ్తున్న రాజధాని ఎక్స్‌ ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవిం చింది. మధ్యప్రదేశ్‌లోని లూని రిచ్చా, విక్రమ్‌గఢ్ ఆలోట్ రైల్వే స్టేషన్ల మధ్య వెళ్తుండగా ఆదివారం తెల్లవా రుజామున ఆ ప్రమాదం జరిగింది. రైలు బీ-1 ఏసీ కోచ్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే రైల్వే సిబ్బంది అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం అందరికీ ఊరటనిచ్చింది.

రైల్వే అధికారులు ఏమన్నారు..?
రైల్వే అధికారుల వివరాల ప్రకారం, ట్రైన్ నెంబర్‌ 12431 తిరువనంతపురం-హజ్రత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్‌ప్రెస్ ఆదివారం ఉదయం మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లాలో ప్రయాణిస్తోంది. కోటా రైల్వే డివిజన్ పరిధిలోని లూనీరిచా, విక్రమ్‌గఢ్ ఆలాట్ స్టేషన్ల మధ్య ఉదయం సుమారు 5.15 నుంచి 5.30 గంటల సమయంలో బీ-1 కోచ్ వద్ద పొగలు, మంటలు కనిపించాయి. మొదట గార్డ్‌ దీనిని గుర్తించి వెంటనే లోకో పైలట్‌కు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన లోకో పైలట్ అత్యవసర బ్రేకులు వేసి రైలును నిలిపివేశారు.

15 నిమిషాల్లో అంతా కిందకి!
రైలు ఆగిన వెంటనే ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది. మంటలు మరింత వ్యాపిస్తాయన్న భయంతో ప్రయాణికులు తమ సామన్లు తీసుకుని బయటకు పరుగులు తీశారు. అయితే రైల్వే సిబ్బంది, ఆర్పీఎఫ్‌ సిబ్బంది, ఇతర అధికారులు సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టారు. బీ-1 కోచ్‌లో ఉన్న మొత్తం 68 మంది ప్రయాణికులను సుమారు 15 నిమిషాల్లో సురక్షితంగా బయటకు దించారు.

ఘటనాస్థలికి..
అగ్నిప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే కోటా రైల్వే డివిజన్ అధికారులు, ప్రమాద సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. కోటా నుంచి ప్రమాద సహాయక రైలు (ఏఆర్ ఎంఈ)ను కూడా వెంటనే పంపించారు. కోటా డివిజన్‌కు చెందిన డీఆర్‌ఎం అనిల్ కలర్‌, సీనియర్ డీసీఎం సౌరభ్ జైన్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు భారీ పోలీసు బలగాలు, అగ్నిమాపక సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు.

మంటలను అదుపులోకి తీసుకొచ్చిన సిబ్బంది
మంటలు బీ-1 కోచ్‌తో పాటు ఎస్‌ఎల్‌ఆర్‌ బోగీ వరకు వ్యాపించినట్లు అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదం మరిన్ని బోగీలకు వ్యాపించకుండా ఉండేందుకు వెంటనే ఓవర్ హెడ్ ఎలక్ట్రిక్ సప్లై (ఓహెచ్ ఈ) నిలిపివేశారు. అనంతరం మంటలు చెలరేగిన బోగీని రైలు నుంచి వేరు చేశారు. అగ్నిమాపక సిబ్బంది గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటన కారణంగా దిల్లీ-ముంబయి ప్రధాన రైల్వే మార్గంలో రైళ్ల రాకపోకలు దాదాపు రెండు గంటలపాటు నిలిచిపోయాయి. భద్రతా తనిఖీలు, సహాయక చర్యల కారణంగా పలు రైళ్లు మధ్యలో నిలిపివేయాల్సి వచ్చింది.

షార్ట్ సర్క్యూట్ వల్లనే జరిగిందా?
ట్రైన్ నెంబర్‌ 12955ను మహిద్‌పుర్ రోడ్ స్టేషన్ వద్ద నిలిపివేసినట్టు అధికారులు తెలిపారు. అనంతరం ట్రాక్‌ను పరిశీలించి రాకపోకలను క్రమంగా పునరుద్ధరించారు. అగ్నిప్రమాదానికి గల అసలు కారణాలు ఇంకా తెలియరాలేదని రైల్వే అధికారులు వెల్లడించారు. అయితే ప్రాథమికంగా షార్ట్‌ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఎస్‌ఎల్‌ఆర్‌ కోచ్‌లో ఉన్న ప్రయాణికుల సామాన్ల నష్టం వివరాలను కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేకపోవడం, ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు తరలించడం పట్ల అధికారులు ఊరట వ్యక్తం చేశారు. గార్డ్‌ సమయానికి అప్రమత్తం చేయడం, లోకో పైలట్ వెంటనే స్పందించడం వల్లే పెద్ద ప్రమాదం తప్పిందని రైల్వే అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -