నవతెలంగాణ – కామారెడ్డి
కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మే 15 నుంచి జూన్ 15 వరకు నిర్వహించనున్న ప్రత్యేక రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తప్పనిసరిగా సభ్యత్వం పొందాలని సూచించారు. అలాగే జిల్లా ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకుని సభ్యత్వం నమోదు చేసుకోవాలని కోరారు.
జిల్లా కలెక్టరేట్‌లోని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) కార్యాలయంలో ప్రత్యేక రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. జిల్లా ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు ఆన్‌లైన్ ద్వారా లేదా నేరుగా రుసుము చెల్లించి కలెక్టరేట్‌లో సభ్యత్వం పొందవచ్చని పేర్కొన్నారు.
జిల్లాలోని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని, సభ్యత్వ నమోదు ద్వారా సేవా కార్యక్రమాలకు తోడ్పడాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్, రెడ్ క్రాస్ డ్రైవ్ వైస్ చైర్మన్ ఎన్.వై. గిరి, కార్యక్రమ నోడల్ అధికారి డా. శశికుమార్, రెడ్ క్రాస్ కామారెడ్డి జిల్లా చైర్మన్ ఎం. రాజన్న, జిల్లా రెడ్ క్రాస్ కరస్పాండెంట్ డా. పి.వి. నరసింహం తదితరులు పాల్గొన్నారు.



