కొనుగోలు కేంద్రాల్లో రైతుల పడిగాపులు
తడిసిపోతుందేమోనని ఆందోళనలో అన్నదాతలు
నవతెలంగాణ – కాటారం:-
మండలంలోని పలు వరి కొనుగోలు కేంద్రాల్లో లారీల కొరత తీవ్రంగా ఉండడంతో రైతులు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు సరిపడా లారీలు అందుబాటులో లేకపోవడంతో కేంద్రాల వద్ద వరి బస్తాలు పేరుకుపోతున్నాయి. దీంతో రైతులు ఎండలోనే తమ ధాన్యాన్ని కాపాడుకుంటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ప్రస్తుతం మండలంలోని పలు గ్రామాల నుంచి రైతులు పెద్ద ఎత్తున వరిని కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తుండగా, తరలింపు వ్యవస్థ సక్రమంగా లేక కొనుగోళ్ల ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. కొన్నిచోట్ల రెండు నుంచి మూడు రోజులుగా ధాన్యం కేంద్రాల వద్దే ఉండిపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. వాతావరణం మారితే ధాన్యం తడిసిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, నీడ వంటి కనీస సౌకర్యాలు కూడా సరిగా లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి అదనపు లారీలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని త్వరగా తరలించాలని రైతులు కోరుతున్నారు.
ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు, మిల్లర్లు సమన్వయంతో పనిచేసి వరి తరలింపును వేగవంతం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు



