Tuesday, May 19, 2026
E-PAPER
Homeక్రైమ్నిశ్చితార్థానికి వెళ్తుండగా ప్రమాదం

నిశ్చితార్థానికి వెళ్తుండగా ప్రమాదం

- Advertisement -


12 మంది మృతి – 20 మందికిపైగా గాయాలు
ముంబయి-అహ్మదాబాద్ 
జాతీయ రహదారిపై ఘోరం

పాల్ఘర్ : మహారాష్ట్రలోని పాల్ఘర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ట్రక్కు, కంటైనర్‌ ఢీకొని 12 మంది దుర్మరణం చెందారు. మరో 20 మందికిపైగా గాయపడ్డారు. ముంబయి- అహ్మదాబాద్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యేందుకు బంధువులు, అతిథులతో ఓ ట్రక్కు ప్రయాణిస్తుండగా వేగంగా వచ్చిన కంటైనర్ దాన్ని ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి పలువురు ప్రయాణికులు వాహనాల మధ్య చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. వాహనాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీశారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. శుభకార్యానికి వెళ్తుండగా ఊహించని విధంగా జరిగిన ఈ ప్రమాదంతో బాధిత కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకొన్నాయి.

ప్రమాదం ఇలా..
బాపుగావ్ ఖడ్కిపాడ గ్రామానికి చెందిన బలరామ్ జైరామ్ దండేకర్ నిశ్చితార్థ వేడుకకు సుమారు 100 మందికి పైగా ప్రయాణికులు ఓ ట్రక్కులో బయలుదేరారు. దహను తాలూకాలోని ధనివారి గ్రామం సమీపంలోకి రాగానే పశువులతో వెళ్తున్న ఓ కంటైనర్ వీరి వాహనాన్నిను ఢీకొట్టింది. దీంతో 12 మంది మరణించగా, 20 మందికి పైగా గాయపడ్డారు. పలువురు ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ప్రమాదం ధాటికి ట్రక్కు, కంటైనర్ రెండూ అక్కడికక్కడే బోల్తా పడ్డాయి. ఫలితంగా పలువురు ప్రయాణికులు వాహనాల కింద చిక్కుకుపోయారు. అయితే, టెంపో దాని సామర్థ్యానికి మించి ప్రయాణికులను తీసుకువెళ్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అతివేగం, ఇరుకైన రహదారి, టెంపో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ప్రమాదం జరిగిన తర్వాత వాహనాల శిథిలాల నుంచి బాధితులను బయటకు తీయడానికి స్థానికులు, పోలీసు సిబ్బంది, సహాయక బృందాలు శ్రమించాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

రెండు నెలల చిన్నారి సహా ఏడుగురు మృతి
ఇదిలా ఉండగా, బిహార్‌లోని ఖగారియా జిల్లాలోని జాతీయ రహదారి-31పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు- ఆటో ఢీకొన్న ప్రమాదంలో రెండు నెలల చిన్నారితో సహా ఏడుగురు మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. వేగంగా వస్తున్న ట్రక్కు, ఆటో రిక్షాను ఎదురుగా వచ్చి ఢీకొట్టడంతోనే ప్రమాదం జరిగిందని ఒక పోలీసు అధికారి తెలిపారు.
“ఈ ప్రమాదంలో రెండు నెలల పసికందుతో పాటు ఒక మహిళ, ఒక బాలుడు, ఇంకా నలుగురు పురుషులు మరణించారు. వీరంతా ఆటో-రిక్షాలో ప్రయాణిస్తున్నవారే. గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుల వివరాలను గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. ప్రాథమిక విచారణలో తేలిన వివరాల ప్రకారం, ట్రక్కు అతివేగంతో ప్రయాణించడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణం.” అని ఖగారియా సదర్ డీఎస్పీ ముకుల్ రంజన్ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -