Tuesday, May 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం‘ఉపాధి’తో పేదోడికి గౌరవం

‘ఉపాధి’తో పేదోడికి గౌరవం

- Advertisement -

ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం 
చేస్తున్న మోడీ సర్కార్‌
కొత్త పథకం వద్దు.. పాతదే కొనసాగించాలి
ఆగస్టు 9న జైల్‌భరో ఉద్యమం : వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి 
బి. వెంకట్‌
రామన్నపేటలో 
వ్యకాస జిల్లా మహాసభ ప్రారంభం

నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
ప్రస్తుత సమాజంలో పేదోడికి ఉపాధితోనే గౌరవం లభిస్తుందని అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ అన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా మూడో మహాసభ సోమవారం రామన్నపేట మండల కేంద్రంలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా సుభాష్‌ సెంటర్‌లో వ్యకాస రాష్ట్ర కమిటీ సభ్యులు జల్లెల్ల పెంటయ్య అధ్యక్షతన జరిగిన సభలో వెంకట్‌ మాట్లాడుతూ.. ఎర్రజెండా సహకారంతో సాధించుకున్న ఉపాధి హామీ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రతి పేదోడికీ ఆర్థిక భరోసా, గౌరవం పెరిగిందన్నారు. నేడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆ చట్టాన్ని నిర్వీర్యం చేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.ఉపాధి హామీ చట్టంలో కాగితరహిత హాజరు పట్టిక అమలులో భాగంగా ఆంధ్రాలో సెల్‌ఫోన్‌ నెట్‌వర్క్‌ రాక రోడ్డుపై హాజరు వేయించుకునేందుకు నిలబడిన కూలీలపైకి టిప్పర్‌ దూసుకొచ్చి ఐదుగురు మృతిచెందారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం కాదని, ప్రభుత్వ హత్య అని అన్నారు.

వెంటనే ఈ పరిస్థితిని మార్చేసి పాత పద్ధతిన కాగితాలపై హాజరును ప్రవేశపెట్టాలని కోరారు. రెండు పూటలా హాజరును ఎత్తేయాలని డిమాండ్‌ చేశారు. కూలీలు అడిగినప్పుడు పని కల్పించకుండా.. నరేంద్రమోడీ ప్రభుత్వం ఎప్పుడు చెప్తే అప్పుడు చేసే విధంగా.. పెత్తందారులకు అనుకూలంగా చట్టం అమలులోకి వస్తుందన్నారు. దీనిని పేదలందరూ ఐక్యంగా పోరాటం చేసి తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. రోజువారి కూలి 600 రూపాయలు ఉండాలని డిమాండ్‌ చేశారు. ఉపాధి హామీ చట్టాన్ని రక్షించుకునేందుకు క్విట్‌ ఇండియా ఉద్యమ స్ఫూర్తిగా వచ్చే ఆగస్టు 9న జైల్‌భరో కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేపట్టనున్నట్టు ప్రకటించారు. పాత పద్ధతిలోనే ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

మోడీ పొదుపు మంత్రం పాటించాలని హైదరాబాద్‌లో జరిగిన సభలో చెప్పడం వెనుక మతలబు ఏంటంటే పేదలు త్యాగాలు చేయాలే.. సంపన్నులు ఇంకా డబ్బులు సంపాదించుకోవాలనే విధంగా ఉందని విమర్శించారు. ఆదాని, అంబానీలు రూ.లక్షల కోట్లు సంపాదించుకుంటుంటే.. పేదలు, ఏమి లేని వారు ఉన్న వాటిని ఎలా త్యాగం చేస్తారని ప్రశ్నించారు. ఆధాని, అంబానీ నుంచి రూ.లక్షల కోట్లు తీసుకొని పేదలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. ఎర్రజెండా ఆధ్వర్యంలో పేదలకు ఉపాధి, భూమిలేని వారికి భూమి కోసం పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
గోదాములలో ధాన్యం నిల్వలు పేరుకుపోతున్నాయని, ప్రస్తుతం పేదలకు ఇస్తున్న 6 కిలోల బియ్యాన్ని 10కిలోలకు పెంచి ఇవ్వాలని కోరారు. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఏదీ పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు.

పేదలకు 10 కిలోల బియ్యం అమలు చేయకుంటే గోదాములపై దాడి చేసి.. పంపిణీ చేస్తామని హెచ్చరించారు. ఈ మహాసభలో రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫైళ్ల ఆశయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బొల్లు యాదగిరి, జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నరసింహ, రైతుసంఘం జిల్లా అధ్యక్షులు మేక అశోక్‌రెడ్డి, ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షులు తిరుగుడు మల్లికార్జున్‌, ఆహ్వాన సంఘం అధ్యక్షులు కూరెళ్ళ నరసింహాచారి, మునిపంపుల సర్పంచ్‌ బొడ్డుపల్లి వెంకటేశం, వ్యకాస రాష్ట్ర కమిటీ సభ్యులు గంగాదేవి సైదులు, వ్యకాస జిల్లా సహాయ కార్యదర్శి సిరపంగి స్వామి, కందుల హనుమంతు, బల్గూరి అంజయ్య, ఎన్‌పీఆర్డీ జిల్లా కార్యదర్శి ఉపేందర్‌, ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గంటేపాక శివకుమార్‌, ఇర్లపల్లి ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -