Wednesday, May 20, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిలోపభూయిష్టం

లోపభూయిష్టం

- Advertisement -

దేశంలో వివాదాస్పదమై ఇంకా సుప్రీం కోర్టు ముందున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు మరో 16 రాష్ట్రాల్లో, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో చేపడతామన్న భారత ఎన్నికల సంఘం ప్రకటన ఆందోళన కలిగిస్తోంది. ఎస్ఐఆర్ మూలంగా పశ్చిమ బెంగాల్ లో 90 లక్షల మంది ఓట్లు తొలగించారు. ఆ రాష్ట్ర ఎన్నికలపై ఎస్ఐఆర్ ప్రభావం మెండుగా ఉందని లోకం కోడై కూసింది. ఎస్ఐఆర్ ప్రక్రియ జరిగిన 105 సీట్లలో బీజేపీ గెలవగా వాటిలో 35 సీట్లలో ఎస్ఐఆర్ తొలగించిన ఓట్ల కన్నా తక్కువ మార్జిన్ తో బీజేపీ గెలిచింది. ఇప్పుడా సీట్లలో ఓడిన అభ్యర్థులు కోర్టులో కేసులు దాఖలు చేస్తున్నారని వార్తలొస్తున్నాయి. ఓటర్ల జాబితా అక్రమాల్లో ఎస్ఐఆర్ ను కారణంగా చూపితే ఆ కేసుల్ని విచారిస్తామని గతంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తే ప్రకటించియున్నారు కూడా! ఎస్ఐఆర్ అమలులో లోపాలున్నా యన్న విషయం బహిరంగ రహస్యం.

సాక్షాత్తు సుప్రీంకోర్టు బెంగాల్ లో ఎస్ఐఆర్ ట్రిబ్యునళ్లకు విచారణా ధికారులుగా న్యాయాధికారులను నియమించింది. అంతకు ముందు ఎస్ఐఆర్ అమలు చేసిన బీహార్, తమిళనాడు, కేరళం తదితర రాష్ట్రాల్లోనూ అక్రమాలు జరిగాయి. అటువంటి ఎస్ఐఆర్ ను ఇప్పుడు మూడవ దశ పేరిట అమలుకు పూనుకోవడం దారుణం. అంతేగాక బెంగాల్ ఎన్నికల ప్రక్రియ ఎంతో లోపభూయిష్టంగా జరిగిందన్నది నగ్న సత్యం. ఆ రాష్ట్ర సిఈఓగా పని చేసిన పెద్దమనిషి బీజేపీ అధికారానికి వచ్చాక అమాంతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కావడం అందుకో తార్కాణం. అసలు ఈ ఎస్ఐఆర్ ను ముందుకు తెచ్చిన ప్రస్తుత ఎన్నికల ప్రధాన కమిషనర్ పార్లమెంటులో అభిశంసనను సైతం ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది. ఏ విధంగా చూసినా ఎస్ఐఆర్ ఒక వివక్షా పూర్వక ప్రక్రియ.

ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ కీలకమైనది. ఎన్నికలకు ప్రాతిపదిక ఓటరు జాబితా. అది లోపరహితంగా ఉంటేనే ఎన్నిక సక్రమం అవుతుంది. అలాగే ఎన్నికల నిర్వాహకులు నిరపేక్షంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. కానీ బీజేపీ అధికారానికి వచ్చాక మిగతా రాజ్యాంగ వ్యవస్థల మాదిరిగా ఎన్నికల కమిషన్ ను కూడా తమ పరివారంతో నింపేసుకున్నారు. ఆ క్రమంలోనే సిఈసి నియామకం కూడా! అసలు నియామక ప్రక్రియలోనే తిరకాసు ఉంది. గురువారం నాడు జరిగిన విచారణలో సాక్షాత్తూ సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ దీపాంకర్ దత్తా వ్యాఖ్యల్లోనూ అది దాగుంది. ప్రధాని అధ్యక్షతన గల ఎంపిక కమిటీలో తటస్థులు ఒక్కరైనా లేరన్న నగ్న సత్యాన్ని ఆయన ప్రస్తావించారు. దానికి సమాధానం ఇవ్వాల్సిన అటార్నీ జనరల్ సుప్రీం కోర్టు మరో పార్లమెంటు ఛాంబర్ కాలేదని అడ్డగోలు వాదనలు చేయడం విస్తుగొలుపుతోంది. మొదటి రెండు రౌండ్లలో తీవ్ర అవకతవకలు జరిగిన ఎస్ఐఆర్ అమలును వెంటనే ఉపసంహరించాలి. ఇప్పటికే పలు ఆరోపణల్లో చిక్కుకొని సుప్రీం కోర్టు ఎదుట కేసు, పార్లమెంటు ముందు అభిశంసన పెండింగ్ లో ఉన్న సిఈసికి మూడవ దశ ఎస్ఐఆర్ ప్రకటించే నైతిక అధికారం కూడా లేదన్న పరిశీలకుల వ్యాఖ్యల్ని ఎవరూ కొట్టి పారెయ్యలేరు.

ఇతర రాష్ట్రాలన్నిటి ఎస్ఐఆర్ అమలు అనుభవమూ అవకతవకల మయమే కనుక తెలుగు రాష్ట్రాల్లో దాని అమలును నిలిపివేయాలి. బీజేపీ యేతర రాజకీయ పార్టీలు ఈ లోపభూయిష్ట విధానాన్ని ప్రతిఘటించాలి. ప్రజాస్వా మ్యానికి మూలమైన ఎన్నికల ప్రక్రియను తొత్తడం చేసే ఎస్ఐఆర్ ను ప్రజలు వ్యతిరేకించాలి. ఆ దిశగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టాలి. ఓటు హక్కు అనేది పాలక వర్గాలు పేదలకు ఇచ్చిన “భిక్ష” కాదు. అది సుదీర్ఘ పోరాటాలు, త్యాగాల ద్వారా సాధించుకున్న ప్రాథమిక హక్కు. ఓటు హక్కు అనేది రాజ్యాంగం పౌరుడికి కల్పించిన అత్యున్నత ఆయుధం. వ్యవస్థను ప్రక్షాళన చేసే పేరుతో నిరుపేదలను, కార్మికులను ఆ హక్కుకు దూరం చేస్తే అది ఎన్నికల సంఘం సాధించే విజయం కాబోదు; అది ప్రజాస్వామ్య స్ఫూర్తిని చంపేయడమే. కాబట్టి, కేవలం మూడు సార్లు ఇల్లు తాళం వేసి ఉంటే ఓటు తీసేయాలనే నిబంధనను పూర్తిగా రద్దు చేయాలి. స్థానిక కార్మిక సంఘాలు, ప్రజాతంత్ర శక్తుల సమక్షంలోనే తుది జాబితాను ఖరారు చేయాలి. అప్పుడే ఈ “ప్రత్యేక సమగ్ర సవరణ”కు ఒక అర్థం ఉంటుంది. ఈ సమగ్ర సవరణ ప్రక్రియలో ప్రతి ఒక్క అర్హుడికీ ఓటు హక్కు సురక్షితంగా ఉండేలా చూడటమే కాకుండా, 18 ఏళ్లు నిండిన ప్రతి యువతీ యువకుడిని ఓటరుగా చేర్చేలా ప్రభుత్వం, అధికారులు పారదర్శకంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -