సీపీఐ(ఎం), సీఐటీయూ ఉద్యమాలకు జీవితాం తం అంకితభావంతో సేవలందించిన సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు కామ్రేడ్ పి.వెంకటేశ్వ రరావు (92) జూలై 13 రాత్రి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కన్ను మూశారు. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చివరి శ్వాస వరకు పార్టీ నిర్మాణం, కార్మిక ఉద్యమం, ప్రజా ప్రయోజనాల గురించే తపించారు. ఆయన రాజకీయ జీవితం, ప్రజా జీవితం, కుటుంబ జీవితం అన్నింటిలోనూ ఆదర్శవంతంగా నిలిచారు.
చిన్నతనంలోనే కమ్యూనిస్టు ఉద్యమం పట్ల ఆకర్షితులైన వెంకటేశ్వరరావు, తన సోదరుడు కామ్రేడ్ చలపతిరావుతో కలిసి ఉమ్మడి ఏపీలోని విజయ వాడలో కార్మిక సంఘాల నిర్మాణంలో చురుగ్గా పాల్గొన్నారు. ప్రయివేటు ప్రింటింగ్ ప్రెస్‌లో కార్మికుడిగా పనిచేస్తూనే ప్రింటింగ్ కార్మికులను సంఘటితం చేసి యూనియన్ నిర్మాణానికి కృషి చేశారు. అనంతరం కర్నూలు ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్‌లో ఉద్యోగం పొందిన ఆయన, 1961లో హైదరాబాద్ అమీర్‌పేట్‌లోని గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్‌కు బదిలీపై వచ్చారు. అక్కడ కామ్రేడ్ రాజ్‌బహ దూర్ గౌర్ (ఏఐటియుసి) అధ్యక్షుడిగా, వెంకటేశ్వరరావు ప్రధాన కార్యదర్శిగా యూనియన్‌ను ఏర్పాటు చేసి కార్మిక ఉద్యమాన్ని బలోపేతం చేశారు. అప్పటి నుంచి హైదరాబాద్ ప్రజాతంత్ర ఉద్యమంలో అంతర్భాగంగా మారి తుదిశ్వాస వరకు అదే స్ఫూర్తితో పనిచేశారు. గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేస్తూనే సెక్రటేరియట్, అసెంబ్లీ, టెక్స్ట్‌బుక్ ప్రెస్ తదితర శాఖల్లోని కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం తిరిగేవారు. ఫతేనగర్‌లో నివాసం, చంచల్‌గూడలో ఉద్యోగం, నగరమంతా యూనియన్ బాధ్యతలు నిర్వహించడం ఎంతో కష్టమైనప్పటికీ ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు. కొంతకాలం తర్వాత చిన్న మోపెడ్ కొనుగోలు చేసి అదే వాహనంపై నగరమంతా తిరుగుతూ కార్మికులను సంఘటితం చేశారు. శారీరక అలసట, వయసు, వ్యక్తిగత ఇబ్బందులు ప్రజాసేవకు ఎప్పుడూ అడ్డంకి కాలేదు.
సుదీర్ఘకాలం సీఐటీయూ నాయకుడిగా, హైదరాబాద్ సీపీఐ(ఎం) నాయకుడిగా పనిచేసిన ఆయనకు ప్రజల నుంచి నేర్చుకోవడం ఒక సహజ లక్షణం. వయసులో చిన్నవారైనా, అనుభవంలో కొత్తవారైనా మంచి సూచన చేస్తే వినేవారు. గ్రామ ప్రజలు ఎలా మాట్లాడతారో, ఏ పేరుతో పిలుస్తారో అదే విధంగా వారితో మమే కమయ్యేవారు. చెర్లపల్లిని స్థానికులు ‘‘చెర్లోపల్లి’’ అని పిలిస్తే అలాగే పలికేవారు. కూకట్‌పల్లిని స్థానికుల మాదిరి గానే ‘‘కుక్కట్లపల్లి’’ అని సంభోదించేవారు. ప్రజల భాషలో మాట్లాడితేనే వారితో నిజమైన అనుబంధం ఏర్పడు తుందని ఆయన నమ్మకం. పదవులపై వ్యామోహం ఆయనకు ఎన్నడూ లేదు. ఉద్యమం బలోపేతానికి కొత్త నాయకత్వం ఎదగాలని కోరుకునేవారు. అందుకే తనకంటే జూనియర్ నాయకులను ముందుకు తీసుకు వచ్చి బాధ్యతలు అప్పగించేవారు. 1978లో హైదరాబాద్ నగర కమిటీ ఏర్పాటులో తన పేరుకు బదులుగా మరో కామ్రేడ్ పేరును ప్రతిపాదించడం ఆయన నిరాడంబరతకు నిదర్శనం. తరువాత పార్టీ అవసరాల దృష్ట్యా సహచరుల ఒత్తిడితో కమిటీలో చేరి కార్యదర్శివర్గ సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించారు.
హైదరాబాద్ సీపీఐ(ఎం) తొలి కార్యదర్శి కామ్రేడ్ భాస్కరరావుతో ఆయనకు ఉన్న అనుబంధం ప్రత్యేక మైనది. ఇద్దరూ కలిసి పార్టీ, ప్రజాసంఘాల అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ప్పుడు సమిష్టి నాయకత్వాన్ని బలోపేతం చేయడంలో వెంకటేశ్వరరావు కీలకపాత్ర పోషించారు. సీనియర్ నాయకుడిగా అందరినీ కలుపుకొనివెళ్లే తత్వం ఆయనది. ట్రేడ్ యూనియన్ ఉద్యమంలో ప్రజాస్వామ్య పద్ధతు లను ఆయన కచ్చితంగా పాటించేవారు. యూనియన్ కమిటీ సమావేశాలు, జనరల్ బాడీ సమావేశాలకు నగరంలోని ఇతర సీఐటీయూ నాయకులను ఆహ్వానించి వారి సమక్షంలో కార్యకలాపాలను సమీక్షించేవారు. సభ్యులు చేసే విమర్శలను స్వాగతించేవారు. ‘‘ఒక నాయకుడు నడిపే సంస్థ కాకూడదు. సభ్యుల అభిప్రాయాలు, ఇతర నాయకుల సూచనలు కూడా అవసరం’’ అనే భావనతో పనిచేశారు. కార్మికుల సంక్షేమం కోసం కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ, హౌస్ బిల్డింగ్ సొసైటీల ఏర్పాటులోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. ఉద్యోగులు ఆర్థికంగా నిలదొక్కుకోవడం, సొంతింటి కల నెరవేర్చుకోవడం కోసం ఈ సంస్థలు ఎంతో ఉపయోగపడ్డాయి.
కామ్రేడ్ పి.వెంకటేశ్వరరావు కార్మిక సంఘాల నిర్మాణానికే పరిమితం కాకుండా పార్టీ విస్తరణకూ సమాన ప్రాధాన్యం ఇచ్చారు. పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు తమ నివాస ప్రాంతాల్లోనూ ప్రజా సమస్యలపై పని చేయాలని కామ్రేడ్ పి. సుందరయ్య సూచించిన కమ్యూనిస్టు కర్తవ్యాన్ని ఆయన ఆచరణలో పెట్టారు. ఫతే నగర్‌ను కేంద్రంగా చేసుకుని పార్టీ కార్యకలాపాలను విస్తరించడంతో పాటు యువజన, మహిళ, విద్యార్థి సంఘాల నిర్మాణానికి కృషి చేశారు. ఆయన కృషి వల్లే ఫతేనగర్ ప్రాంతంలో పార్టీ బలపడటంతో పాటు ప్రజాసంఘాలు విస్తరించాయి. బాలానగర్, సనత్‌నగర్, జీడిమెట్ల వంటి పారిశ్రామిక ప్రాంతాల కార్య కలాపాలకు ఫతేనగర్ ఒక ముఖ్య కేంద్రంగా మారింది. గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేసే ఇతర పార్టీ సభ్యులను కూడా తమ బస్తీల్లో ప్రజా ఉద్యమాలు నిర్మించాలని ప్రోత్సహించేవారు. దాని ఫలితంగా అనేక ప్రాంతాల్లో పార్టీ శాఖలు, ప్రజాసంఘాలు ఏర్పడ్డాయి. ఉద్యమం కార్యాలయాలకు మాత్రమే పరిమితం కాకుండా ప్రజల మధ్య ఉండాలని ఆయన ఎప్పుడూ చెప్పేవారు. ప్రజల సమస్యలను తెలుసుకోవడం, వాటి పరిష్కారం కోసం పోరాడడం కమ్యూనిస్టుల ప్రధాన బాధ్యతగా భావించేవారు. ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్‌తో పాటు ఇతర పరిశ్రమల్లోనూ ట్రేడ్ యూనియన్ల నిర్మాణానికి ఆయన విశేష కృషి చేశారు. బాలానగర్, సనత్‌నగర్, ఓల్డ్‌సిటీ ప్రాంతాల్లో కొత్త యూనియన్లు ఏర్పడేందుకు సహకరించారు. ఐడీపీఎల్, హెచ్‌ఏఎల్, బీహెచ్‌ఈఎల్ ఆర్ అండ్ డి, హెచ్‌ఎంటీ వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న సీఐటీయూ నాయకులకు మార్గ దర్శకత్వం అందించారు. కార్మిక ఉద్యమం ఒకే పరిశ్రమకు పరిమితం కాకుండా నగరవ్యాప్తంగా విస్తరించేందుకు ఆయన నిరంతరం కృషి చేశారు.
పార్టీ నిధుల సేకరణలో కూడా ఆయన ఆదర్శప్రాయంగా వ్యవహరించారు. గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్‌లో ప్రతి ఏడాది ఒక రోజు వేతనాన్ని పార్టీకి, మరో రోజు వేతనాన్ని సీఐటీయూకు విరాళంగా ఇవ్వాలనే పిలుపును విజయవంతంగా అమలు చేశారు. పార్టీ ఆర్థికంగా బలపడితేనే ఉద్యమం బలపడుతుందని ఆయన నమ్మకం. పూర్తికాలం కార్యకర్తల పట్ల ఆయనకు అపారమైన ప్రేమాభిమానాలు ఉండేవి. ఉద్యమం కోసం తమ జీవితాలను అంకితం చేసిన కార్యకర్తలను కుటుంబ సభ్యుల్లా ఆదరించేవారు. వారి కుటుంబ పరిస్థితులను తెలుసుకుని అవసరమైన సహాయం, సలహాలు అందించేవారు. మహిళా కార్యకర్తలను గౌరవంగా చూస్తూ ఉద్యమంలో మరింత చురుకుగా పనిచేసేలా ప్రోత్సహించే వారు. కుటుంబాన్ని కూడా ప్రజా ఉద్యమాలతో అనుసంధానించడం ఆయన జీవితంలోని మరో విశిష్టత.
తన కుటుంబ సభ్యులతో పాటు సోదరుడి కుటుంబ సభ్యులను కూడా ప్రజాసేవలో భాగస్వాములను చేశారు. ఉద్య మం పట్ల నిబద్ధత, సామాజిక బాధ్యత, ప్రజాసేవ వంటి విలువలను కుటుంబంలోనే పెంపొందించారు. అందు వల్లే ఆయన కుటుంబ సభ్యులు ఇప్పటికీ పార్టీ, ప్రజాసంఘాలతో అనుబంధాన్ని కొనసాగించడం ఆయన జీవన విధానానికి నిదర్శనం. అనారోగ్యం, వృద్ధాప్యం కారణంగా చివరి దశలో క్షేత్రస్థాయిలో పనిచేయలేకపోయినా ఉద్యమం పట్ల ఆయన ఆసక్తి ఏమాత్రం తగ్గలేదు. తనను కలిసిన ప్రతి ఒక్కరితో పార్టీ పరిస్థితులు, కార్మిక ఉద్యమం, ప్రజా సమస్యల గురించే చర్చించేవారు. ఉద్యమం ఎలా బలోపేతం కావాలి, కొత్త తరం నాయ కత్వాన్ని ఎలా తీర్చిదిద్దాలి అనే అంశాలపైనే ఆయన ఆలోచనలు సాగేవి. చివరి వరకు ప్రజల ప్రయోజనాలు, పార్టీ అభివృద్ధే ఆయన ధ్యేయంగా నిలిచాయి. నిరాడంబర జీవనం, ప్రజాస్వామ్య నాయకత్వం, కొత్త తరాన్ని ప్రోత్సహించే వైఖరి, ఉద్యమం పట్ల అచంచల నిబద్ధత ఆయన్ను ప్రత్యేక వ్యక్తిత్వంగా నిలబెట్టాయి. ఆయన ఆశయ బాటలో నడవడమే మనమిచ్చే నిజమైన నివాళి.
(నేడు హైదరాబాద్‌లో కామ్రేడ్ పి.వి.రావు సంస్మరణ సభ)
పి.ఎస్.ఎన్. మూర్తి, 9490098657



