– సత్తుపల్లి మండలం తుంబూరులో తీవ్ర కలకలం
– శవాన్ని తగలబెట్టిన ప్రదేశాన్ని గుర్తించిన పోలీసులు
– పూర్తిగా కాలిన శవం నుంచి ఎముకలు సేకరణ
నవతెలంగాణ – సత్తుపల్లి
సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామంలో శనివారం దారుణమైన ఘటన వెలుగు చూసింది. అత్తను అల్లుడు కడతేర్చిన ఉదంతం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. గత మూడు రోజుల క్రితం వెదుళ్ల వెంకట నరసమ్మ అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు సత్తుపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో సత్తుపల్లి పోలీసులు సదరు ఘటనపై మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అదృశ్యం వెనుక అల్లుడు తిరుపతిరావుపై పోలీసులకు ప్రాథమికంగా అనుమానం వచ్చినట్లు తెలుస్తోంది.
అతడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారిస్తున్నట్లు సమాచారం. నరసమ్మను హత్య చేసినట్లు నిందితుడు విచారణలో అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ హత్యలో తిరుపతిరావుకు ఇంకెవరైనా సహకరించారా..? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
అయితే ఈ దారుణానికి ఆస్తి వివాదం కారణమా? లేక అక్రమ సంబంధం కారణమా అనే కోణాలపై పోలీసులు దృష్టి సారించారు. ఇదిలా ఉంటే తిరుపతిరావు వేరే మహిళతో అక్రమ సంబంధం నెరపుతున్నాడనే వదంతులు తుంబూరు ప్రచారం ఆ నోట ఈ నోట పడడంతో పాటు అత్త నరసమ్మకు కూడా తెలిసి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. అత్తపై కోపాన్ని పెంచుకున్న అల్లుడు తిరుపతిరావు ఈ దారుణానికి ఒడిగట్టాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
పోలీసుల విచారణలో నిందితుడు తిరుపతిరావు ఇచ్చిన సమాచారంతో గ్రామ శివారులోని తోటల్లో పోలీసులు తీవ్రంగా గాలించారు. క్లూస్ టీమ్‌తో కలిసి నారాయణపురం గ్రామ శివారులో సోదాలు నిర్వహించగా దిగ్భ్రాంతిరకర విషయాలు బయటపడ్డాయి. నరసమ్మ మృతదేహాన్ని చెత్త చెదారంతో కలిపి నిందితుడు తగలబెట్టినట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహం పూర్తిగా కాలి బూడిద కాగా, పోలీసులు ఎముకల అవశేషాలను సేకరించారు. ఈ దారుణ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా తెలియాల్సి ఉంది. అత్తను అల్లుడు హత్య చేశాడని ఉదంతం ప్రస్తుతం తుంబూరు గ్రామంలో తీవ్ర భయాందోళనలు, కలకలం రేపుతోంది.



