అంచెలంచెలుగా.. కంచెల్ని ఛేదించుకుంటూ…
‘‘చారిత్రకంగా అనివార్యమైన ఘటనలు.. నిజానికి అందువల్లేనేమో, అవి నైతిక మరియు చట్టపరమైన ఆరోపణలకు అతీతమైనవి’’ అంటాడు ఫ్రెంచ్ కమ్యూనిస్టు జీన్ పాల్ సర్ త్రే.
కార్మికుల ఒకరోజు సార్వత్రిక సమ్మె వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు ఎన్ని వేల కోట్లు నష్టమొచ్చిందో లెక్కకట్టే మేధావులున్నారు. రైతాంగ బాధలు పట్టనివారు, 700+ మంది చనిపోయినా పట్టించుకోని వారు, రైతాంగ డిమాండ్లన్నీ కొట్లాది సామాన్యుల కోసమేనన్న సోయి కూడా లేని వారు, రైతుల ఢిల్లీ ముట్టడి వల్ల ఆర్థిక వ్యవస్థకు ఎంత నష్టమో అంటూ మొత్తుకోవడం ఆశ్చర్యమేమీకాదు. సర్ త్రే మాటలు సరిగ్గా సరిపోయేదిక్కడే! అవన్నీ చార్రితక ఘటనలు. ఈస్టిండియా కంపెనీ టు వెస్టిండియా కంపెనీ (మోడీ, అమిత్‌షా, అదానీ, అంబానీ బొమ్మలతో) వయా భారత ప్రభుత్వం అంటూ కొన్ని మీమ్‌లు పెడ్తున్నారు. అయితే పెట్టుబడిదారులకు కులం, మతం, ప్రాంతాలేవీ ఉండవని, జిఎంఆర్ (గ్రంథి మల్లికార్జున రావు), టివిఎస్ అయ్యంగార్, మురుగప్పన్ గ్రూపు, డా. రెడ్డీస్ లేబరేటరీస్ వంటివే ఉదాహరణలు. భారత కార్మికుల దోపిడీలో నేడు ప్రధానంగా బహుళజాతి కంపెనీలు ఒక కీలకపాత్ర పోషిస్తున్నాయి. వీరందరి సమస్యేమంటే యూనియన్ల ఉనికిని గుర్తించ నిరాకరించడం సమిష్టి బేరసారాలకు తల అడ్డంగా తిప్పడం! వారికి పాలకులు గంగిరెద్దులుగా మారడం నేటి దృశ్యం.
గత ఆరేండ్లుగా జాతీయ సార్వత్రిక సమ్మెలు, పారిశ్రామిక సమ్మెలు, సంయుక్త కిసాన్ మోర్చాతో కలిసి పెద్ద పెద్ద ప్రదర్శనలు, ధర్నాలు చేసినా 2025 నవంబర్ 21 లేబర్ కోడ్స్ నోటిఫై చేసేశారు. 2026 మే 8, 9న రూల్స్ ప్రకటించారు. కార్పొరేట్ల బాధలే తమ ‘బాధలు’గా నెంచుకుని కార్మికోద్యమాన్ని నిర్బలీకరించడానికి ఉద్దేశించినవే ఇవన్నీ! మధ్య ఆసియాలో యుద్ధాన్ని దృష్టిలో పెట్టుకుని రైతుల ‘ఇన్‌పుట్’ ధరలన్నీ పెంచేస్తున్నారు. డీజిల్, ఎరువులు వంటివి ఆకాశాన్నంటు తున్నాయి. విత్తన వ్యాపారమంతా దేశ, విదేశీ కార్పొరేట్ల చేతిలోకిపోయింది. 2003 విద్యుత్ చట్టానికి సవరణ బిల్లు 2025 సిద్ధంగా ఉంది. వెరసి, రైతాంగం ఉసురు తీసేవి ఇవన్నీ. దీనికితోడు ఏ పెట్టుబడిదారీ దేశంలో లేని విధంగా 2005లో వామపక్షాల వత్తిడి మేరకు రూపొందిన గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని దాదాపు కేంద్రం నిర్వహణ నుండి తప్పుకుని రాష్ట్రాల నెత్తికి నలభై శాతం నిధుల వాటాని నెట్టేసింది మోడీ సర్కార్. దానిపేరు కూడా వీబీజీ-గ్రామ్‌జీగా మార్చింది. గ్రామీణ పేదలకున్న ఆ మాత్రం ఆసరా కూడా లేకుండా చేసింది. ఈ విషయాలన్నీ జులై 17-19 తేదీల్లో రాంచీలో జరిగిన సిఐటియు వర్కింగ్ కమిటీ పరిగణనలోకి తీసుకుంది. మీడియా సాధారణంగా పట్టించుకోంది కార్మిక పోరాటాలనే అనే విషయం మన గమనంలో ఉండాలి. ఫిబ్రవరి 12 సాధారణ సమ్మె కోట్లాది మంది పాల్గొనడంతో పెద్ద ఎత్తున విజయవంతమైన విషయం మనకు తెలుసు. కార్మికవర్గంలో నూతన జవసత్వాలు నింపిందీ సమ్మె.
ఢిల్లీ చుట్టూ ఉన్న ఎన్‌సీఆర్‌లో ఒక్కొక్క పార్రిశామిక వాడలోనూ, ఏ ఫ్యాక్టరీకా ఫ్యాక్టరీ కార్మికులు, మరీ ముఖ్యంగా యువ, కాంట్రాక్టు కార్మికులు నికృష్టమైన తమ జీతాల పెంపుదల కోసం నిర్బంధాలను సైతం లెక్కచేయక తెగించి రంగంలోకి దూకారు. హడావుడిగా, యూపీ, హర్యానా వంటి రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనాలు పెంచుతూ జీఓలియ్యక తప్పలేదు. ఇది విద్యార్థుల ఆందోళనకు ఊపిచ్చింది. ఈ ప్రభుత్వం ఏదో చేస్తుందనే భయం క్రమంగా తొలగిపోతోంది. నయా ఉదారవాద విధానాల సంక్షోభం ఆర్థిక రంగాన్ని దాటి రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, పర్యావరణ రంగాలకు విస్తరిస్తోంది. ప్రపంచ పెట్టుబడిదారీ విధానం సుదీర్ఘ స్తబ్దతలో పడింది. ఏకకాలంలో అధికోత్పత్తి, దిగజారిన వినిమయం చక్రబంధంలో చిక్కుకుంది. సమాజంలో అసమానతలు విపరీతంగా పెరిగాయి. పెట్టుబడిది పై చేయి అయ్యింది. కార్మికుల బేరసారాల శక్తి సన్నగిల్లింది. ఇది నేడు యూనియన్లను వేధిస్తున్న సమస్య.. అభివృద్ధి చెందిన దేశాల్లో చౌకగా శ్రమ శక్తి దొరికే దేశాలకు పరిశ్రమలను తరలిస్తామని, వాస్తవానికి తరలిస్తూనే ఉన్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కుప్పలు తెప్పలుగా పెరిగిన నిరుద్యోగ సైన్యం వల్ల సంఘటితరంగం నుండి అసంఘటితరంగం వరకు బేరసారాలాడే శక్తి సన్నగిల్లి వేతనాల్లో పెంపుదల లేకపోవడం విశ్వవ్యాపితమయింది. ఇటీవలి లెక్కలు చూస్తే ఆందోళనా, ఆశ్చర్యంతోపాటు భవిష్యత్ ఎడల, రానున్న పోరాటాల యెడల నమ్మకం వస్తుంది. భారతదేశం లోని నిరుద్యోగుల్లో 80 శాతం మంది 15-24 ఏండ్ల వయసువారే.
పట్టభద్రుల్లో నిరుద్యోగిత రేటు 29.1 శాతం. వీటన్నిటికీ మించి 82 శాతం మంది కార్మికులు అసంఘటిత రంగంలోనే ఉన్నారు. వెరసి, భారతీయ యువత నిరుద్యోగులుగా ఉండటమేకాదు. దాదాపు మూడవ వంతుమంది చదువుకున్న వారు. పైగా 70, 80 లక్షల మంది ఏటా మన నిరుద్యోగ సైన్యానికి కలుస్తున్నారు. వీరంతా, జర్మన్ చరిత్రకారుడు హన్నా ఆరెన్గ్ ట్ అన్నట్లు ‘‘హక్కుల కోసం పోరాడే హక్కు’’ కోసం ఉద్యమించేవారే! ‘మొన్నటి విద్యార్థుల ఆందోళనకారులు ఎవరూ మత సమీకరణాలకు లొంగలేదు’ (డాగ్ విజిల్స్ కు) అంటాడు ‘ఐసీ, తైసీ డెమోక్రసీ’ సహ నిర్వాహకుడు రాహుల్ రామ్! 2026, మొత్తం మీద ఫిబ్రవరి 12న కార్మికవర్గం చూపిన దారిలో వేగంగా కదుల్తోంది. నయా ఉదారవాద విధానాలు ముందుకు వెళ్ళడానికి అవకాశంలేని దశ (డెడ్‌ఎన్డ్)కు చేరుకున్నా యని అర్థమవుతోంది. ఎందుకంటే కార్మికుల ఉత్పాదక శక్తి పెరుగు తోంది. కార్పొరేట్ల లాభాలు ఇంతలంతలుగా పెరుగుతు న్నాయి. వేతనాల్లో పెరుగుదల లేకపోవడమో, తగ్గడమో జరుగుతోంది. ఫలితంగా కార్మికుల కొనుగోలుశక్తి తగ్గిపోతోంది. సరుకులు ఉత్పత్తి చేసినా అమ్ముడు కావట్లేదు. ఇదీ నేటి సంక్షోభానికి మూలకారణం. ఇక్కడ మరో కీలకాంశం ఏమంటే వలస యుగంలో (20వ శతాబ్ది ప్రారంభంలో ఈ స్థితి నుండి బయటపడటానికి రెండు ప్రపంచ యుద్ధాలు సాగినాయి.
ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. 1930ల నాటి ఫాసిజంలాంటిది కాదు నేటి నయా ఫాసిజం. ఎందుకంటే ప్రపంచ ఫైనాన్స్ పెట్టుబడితో ఇది ముడేసుకుని ఉంది. కాబట్టి దాన్ని వ్యతిరేకించలేదు. ఎందుకంటే బహుళజాతి కంపెనీల్లో పెట్టుబడి ప్రపంచమంతటి నుండి వస్తోంది. నేడు తీవ్ర సంక్షోభంలో వున్న పెట్టుబడిదారీ విధానం దాన్నుండి బయటపడ్డానికి నాలుగు మార్గాలెంచుకుంది. మొదటిది : సామ్రాజ్యవాద యుద్ధాల్ని కొనసాగించడం ద్వారా లాభాలు పోగేసుకోవడం. రెండవది : ఉపాధి అవకాశాలు లేకున్నా నూతన టెక్నాలజీల్లో పెట్టుబడి పెట్టడం. మూడవది : కార్మికుల మూలుగులు పీల్చడం ద్వారా ఉత్పాదకత పెంచి చిన్న పరిశ్రమలు మూతబడేందుకు, కార్మికుల జీవితాలు చితికిపోయేందుకు కారణమవడం, నాలుగవది : ఈ మొత్తం భారాన్ని రిట్రెంచ్‌మెంట్లు, వేతనాల్లో కోతలు, పనిభారం పెంచడం, కార్మిక చట్టాలు బలహీనం చేయడం. దేశాల వనరులను కార్పొరేట్ లాభాల కోసం మళ్లించడం – ఇవి కీలకమైనవి. దేశంలో గుత్త పెట్టుబడి కేంద్రీకరిస్తున్నది. ఎంఎస్‌ఎంఈలు, ఇతర చిన్న పరిశ్రమలు దివాలా ఎత్తుతున్నాయి. కార్మికులు చితికిపోతున్నారు. మోడీ ఇంతకాలం చెప్పుకున్న ‘‘మేక్ ఇన్ ఇండియా’’ కామ్రేడ్ ఇ.బాలానందన్ భాషలో చెప్పాలంటే ‘‘స్ర్కూడ్రైవర్ టెక్నాలజీ’’గా మారింది. ఇతర దేశాల నుండి వచ్చిన విడిభాగాలను ఒకదాంతో ఒకటి కలిపేదానిలా మారింది. (బాలానందన్ మోడీ కాలాన్ని చూడలేదు. సరళీకృత ఆర్థిక విధానాలను సైగలతో కామ్రేడ్ ఇ.బి. వివరించిన తీరు చూసిన వారెవరూ మర్చిపోలేరు).
2025 నవంబర్‌లో లేబర్ కోడ్స్ ను నోటిఫై చేస్తే ఫిబ్రవరిలో ప్రతిపాదించిన ఆర్థిక సర్వేలో వాటిని ఆర్థిక వ్యవస్థకు ‘‘షాక్ అబ్సార్బర్స్’’ గా అభివర్ణించారు. కార్మిక హక్కుల్ని నాశనం చేసి, తనిఖీలను తగ్గించి, పనిగంటలు పెంచి, చివరికి సంఘటిత, అసంఘటితరంగాల్లో వేతనాలను అణిచిపెట్టి ఉంచుతారని దీని భావం. అణగారిన ఈ ప్రజలు మతోన్మాద శక్తులు చేసే ప్రత్యక్ష ప్రయోజనాల బదిలీలపై ఆధారపడి ఉండేలా చేయాలనేది ఈ కుట్ర. మతోన్మాదం ఆధారంగా ప్రజల్ని చీల్చి అధికారం నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తోంది బీజేపీ. మతసామరస్య రక్షణ కోసం మనం చేసే కృషి తప్పనిసరిగా సాంఘిక భద్రత రక్షణ కోసం, ప్రయివేటీకరణకి వ్యతిరేకంగా, ప్రభుత్వ ఆస్తులను తెగనమ్మే మోనిటైజేషన్‌కు వ్యతిరేకంగా నిలవాలని, ప్రభుత్వరంగ రక్షణ కోసం జరిగే పోరాటంతో లింక్ చేసుకుని సాగాలని ఇటీవలి రాంచీ వర్కింగ్ కమిటీ నిర్ణయించింది. జులై 29 అఖిల భారత సదస్సు తీర్మానంలో చెప్పినట్లు ‘‘సమ్మె చేసే హక్కు కార్మికులకు అసాధ్యం చేసి, పనిగంటలు పెంపుదల, ఫిక్స్ డ్ టర్మ్ ఉపాధీ సర్వసాధారణమై పోయింది. అత్యధికమంది కార్మికుల భ్రదత ‘‘ఈ నాలుగు కోడ్‌ల ద్వారా సులభతరమై పోయింది. ఫ్యాక్టరీ చట్టానికి, స్టాండింగ్ ఆర్డర్స్ చట్టానికి, కార్మికుల సంఖ్య పెంచడంవల్ల డెబ్భయి శాతం ఫ్యాక్టరీలు, తొంభై శాతం సంఘటితరంగ కార్మికులు చట్టాల పరిధి నుండి బయటికి నెట్టివేయబడ్డారు’’ అని ఆ తీర్మానం పేర్కొంది.
700 మందికిపైగా తమ తోటి రైతులను పోగొట్టుకున్నా శిలా సదృశ్యంగా నిలిచి, ఢిల్లీ ముట్టడిని జయప్రదం చేసిన దేశ రైతాంగ ప్రధాన డిమాండును కనీస మద్దతు ధర (సి2+50శాతం) మిగిలే ఉంది. ఇది వ్యవసాయాన్ని కార్పొరేట్లు హస్తగతం కాకుండా అడ్డుకుంటుంది. పులి మీద పుట్రలాగా ఇప్పుడే అమెరికా, ఈయుతో మరికొన్ని దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకుంది భారత ప్రభుత్వం. ఇది వ్యవసాయరంగాన్ని ఎంఎస్‌ఎంఇలను నాశనం చేస్తాయి. ఇవి రైతాంగంతోపాటు చిన్న వ్యాపారులను, సప్లయి చైన్లో మధ్యంతర ఫార్మా, కెమికల్స్, యంత్ర భాగాలను మన దేశంలో తయారుచేస్తారు. సమయానికి సప్లయి చేయలేకపోతే మన మార్కెట్ దెబ్బతింటుంది, ఉత్పత్తిదారుల విశ్వాసం కోల్పోతాం. రూపాయి విలువ గతంలో ఎప్పుడూ లేనంతగా దిగజారింది. ఇది కరెంట్ అకౌంట్ లోటును పెంచుతుంది. ఏ పేరు మీద సరళీకృత ఆర్థిక విధానాలు ప్రారంభమైనాయో మళ్లీ అక్కడికే వచ్చాం. స్వేచ్ఛా వాణిజ్యం అన్న పేర అమెరికా వారు టారిఫ్‌ల యుద్ధం మొదలుపెట్టారు. దీన్నే ఒక మేధావి ‘‘రోనాల్డ్ రీగన్ ‘బెర్లిన్ వాల్’ కూల్చమని ఆనాటి పశ్చిమ జర్మనీలో యువతను రెచ్చగొట్టి ‘స్వేచ్ఛా వాణిజ్యా’నికి తలుపులు తెరిచాడు. అదే పార్టీకి చెందిన డోనాల్డ్ ట్రంప్ తన దేశం చుట్టూ గోడలు నిర్మించాలని మొదటి టర్మ్‌లో మెక్సికో నుండి చొరబాటు దారులు రాకుండా గోడ నిర్మించే పనిచేశాడు. ఇపుడు స్వేచ్ఛా వాణిజ్యాన్నే ఎగతాళి చేస్తూ టారిఫ్‌ల యుద్ధం చేస్తున్నాడు.’’
రష్యా నుండి చమురుకొంటున్నందుకు యాభై శాతం సుంకాలు విధించినా నోరు పెగలదు మోడీ సాబ్‌కి. టారిఫ్‌లు పశ్చిమాసియా యుద్ధం కలిసి భారత ఆర్థిక వ్యవస్థ కునారిల్లి పోతున్నది.
ఈ నేపథ్యంలో అనేక పారిశ్రామిక వాడల్లోని, ముఖ్యంగా యువ కార్మికులు, యువ కాంట్రాక్టు కార్మికులు తమ ఉనికినే ప్రశ్నిస్తున్న యాజమాన్యాలపై యూనియన్లు లేకున్నా, యూనియన్లు పెట్టుకోనివ్వ కపోయినా తెగించి పోరాడుతున్నారు. దేశ, విదేశీ కార్పొరేట్లపై తిరగబడుతున్నారు. ‘‘చరిత్ర రచన మీద ఏ పాలక వర్గాలు తమ ఆధిపత్యాన్ని ఏర్పరుచుకుంటాయో ఆ వర్గాలే ఆ చరిత్ర రచనను, దృక్పథాన్ని నిర్దేశిస్తాయి. అణగారిన ప్రజల కథలన్నీ అట్టడుగునపడి ఇతిహాసపు చీకటి కోణంలోనే మిగిలిపోతాయి. ప్రజలను దోచుకునే వారే ప్రజల చరిత్రను కూడా దోచుకుంటారు. వాళ్లు వర్తమాన చరిత్రను నిర్మించే క్రమంలోనే గత చరిత్రకు అర్థం ప్రయోజనం కలుగుతాయి’’ 1860-70 నుండి 1923-26 వరకు భారత కార్మికవర్గం పోరాడి ఇంగ్లీషోడి అరాచక పాలనలో మొదటి కార్మిక చట్టాలు సాధించుకుందన్న విషయం, లేబర్ కోడ్స్ నేపథ్యంలో తమకు తిరుగేలేదనుకునే దేశ, విదేశీ కార్పొరేట్లకు ముకుతాడేయగలమనే విశ్వాసం కార్మికవర్గానికి వస్తుంది.పైగా ఇది కార్మికుల పోరాటమేకాదు, రైతాంగ పోరాటం. వ్యవసాయ కార్మికుల పోరాటం. ఒక్కమాటలో చెప్పాలంటే యావన్మంది శ్రమజీవుల సమిష్టి పోరాటం. మొన్నటి ఢిల్లీ సదస్సు తీర్మానం పిలుపిచ్చినట్లు క్విట్ ఇండియా పిలుపుపై నాటి బ్రిటిష్ సామ్రాజ్యవాదులపై శిగమెత్తి లేచింది దేశ ప్రజ! ఆ స్ఫూర్తితో ఆగస్టు 10న వికేంద్రీకరించి ఉద్యమాన్ని ఉర్రూతలూగించాలి మనం.



