Friday, August 28, 2026
E-PAPER
Homeఎడిట్ పేజికనపడుటలేదు!

కనపడుటలేదు!

- Advertisement -

నీట్‌ ‌లీకేజీ తర్వాత దేశవ్యాప్తంగా పెల్లుబికిన నిరసనల సమయంలో అమిత్‌‌షా సభలోనే ఉన్నాడు. కేంద్రం బిల్లులు ప్రవేశపెట్టినప్పుడూ ఉన్నాడు. వాటిని మందబలంతో ఆమోదించు కున్నప్పుడు ఉన్నాడు. ప్రభుత్వ నిర్ణయాల్ని సమర్థిం చాల్సినప్పుడు కూడా ఉన్నాడు. కానీ, ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీపై వివరణ ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసినప్పుడు మాత్రం లేడు! విద్యార్థులపై పోలీసుల దాష్టీకాన్ని ప్రశ్నించినప్పుడు అక్కడ లేడు! హోం మంత్రి పదవి అంటే కేవలం అధికారాన్ని వినియోగిండానికేనా? ‌‘జంతర్‌మంతర్‌’ నిరసనలకు జవాబుదారీతనం అవసరం లేదా? ఈ ప్రశ్నే ఇప్పుడు దేశ మంతా వినిపిస్తోంది. దీనికితోడు సభను హుందాగా నడిపిస్తూ సభ్యులకు దిశానిర్దేశం చేయాల్సిన ప్రధాని కూడా పత్తకు లేకుండా పోయాడు. పార్లమెంట్ అంటే కేవలం తమకు నచ్చిన బిల్లులు ఆమోదించు కోవడ మేనా? ప్రజా సమస్యలపై చర్చ ఉండక్కర్లేదా? విద్యార్థులకు సంబం ధించి కీలకమైన ప్రశ్నల్ని ప్రతిపక్షాలు లేవ నెత్తితే వాటికి జవాబు చెపాల్సిన బాధ్యుడు చట్టసభలో లేకపోవడం, సభను అవమానిం చడమే కాదు, ప్రజల విశ్వాసాన్ని కూడా వమ్ము చేసినట్టే. జూలై 20న ప్రారంభమైన పార్లమెంట్‌ ‌శీతకాల సమావేశాలు ఈ నెల 13 వరకు జరగనున్నాయి. మొత్తం ఇరవై ఐదు రోజుల వ్యవధిలో ఇప్పటివరకు పంతొమ్మిది సమావే శాలు జరగ్గా అమిత్‌‌షా మెజార్టీ రోజులు గైర్హాజరైనట్టు తెలుస్తోంది. చట్టసభ ప్రజాస్వా మ్యానికి గుండెకాయ లాంటిది, అక్కడ చట్టాలు చేయడమే కాదు, ప్రజల తరపున ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు బాధ్యతగా సమాధానం చెప్పాలి.

కానీ, ఆ బాధ్యత నుంచి అధికారపక్షం వైదొలుగుతుండటం శోచనీయం. అందుకే సభలో అడిగిన ప్రశ్నలకు సమాధానాలు రాకపోవడంతో అవే ప్రశ్నల ప్లకార్డులతో ప్రతిపక్ష సభ్యులు పార్లమెంట్‌ ‌ముందు నిరసనలు చేపట్టడం అధికార పార్టీ అహంకారాన్ని తెలియజేస్తోంది. వారడుగుతున్న ప్రశ్న ఒక్కటే- ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జీకి కారణాలు వెల్లడించాలి, అమిత్‌‌షా సభలో ప్రకటన చేయాలి. ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నల్లో అసంబద్ధత ఏముంది? విద్యార్థులపై లాఠీచార్జి ఎందుకు జరిగింది? శాంతియుతంగా నిరసన తెలిపిన యువతపై బలప్రయోగానికి ఆదే శాలు ఎవరిచ్చారు? వారి గొంతు నొక్కే కుట్రలకు ఎవరు పాల్పడ్డారు? కాక్రోచ్ ఉద్యమం ఎందుకు పుట్టింది? ఈ అసంతృప్తికి కారణమెవరు? ఇవన్నీ దేశ ప్రజల తరఫున అడిగిన ప్రశ్నలే. ఢిల్లీ పోలీసు వ్యవస్థ కేంద్ర హోం మంత్రిత్వశాఖ పరిధిలోనే ఉన్నప్పుడు జరిగిన చర్యపై వివరణివ్వడం హోంమంత్రి రాజ్యాంగ బద్ధమైన బాధ్యత. కానీ ఆ బాధ్యతను విస్మరించి సభను పట్టించుకోకపోవడం వెనుక ఉద్దేశం స్పష్టం! ‘మేం ఎవరికి జవాబుదారీ కాదు. మమ్మల్ని ఎవరూ ప్రశ్నించొద్దు’ అన్న ధోరణితో ఉంటే అది ప్రజాస్వామ్యం ఎందుకవుతుంది, కచ్చితంగా నియంతృత్వ పాలనకే దారితీస్తుంది. జెన్-జీ యువత ఉద్యమాలను కేవలం రాజకీయ కోణంలో చూడలేం. ఉపాధి, విద్య, పరీక్షల నిర్వహణ, అవకాశాల కొరత వంటి అంశాలనేకం. ఆ ఆవేదనకు రూపమే ఈ ఉద్యమాలు. ‘కాక్రోచ్’ వంటి ప్రతీకలు కూడా అదే నిరసనకు చిహ్నాలు. ప్రభుత్వం వీటి వెనుక ఉన్న సందేశాన్ని అర్థం చేసుకోవాల్సింది పోయి, ఉద్యమాలనే అణచివేయచూడటం సమస్యను మరింత పెంచడమే.

ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం. ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులపై కేసులు నమోదు చేయకుండా ‘క్షమిస్తున్నామ’ని ప్రకటించడం. అసలు క్షమించాల్సింది ఎవరు? రాజ్యాంగం ఇచ్చిన హక్కుతో నిరసన తెలిపిన విద్యార్థులా? లేక వారిపై లాఠీలు కురిపించిన ప్రభుత్వమా? ప్రజాస్వామ్యంలో ప్రజలే యజమానులు. ప్రభుత్వం సేవకుడు. సేవకుడు యజమానిని ‘క్షమిస్తున్నాం’ అని చెప్పే స్థితి రావడం ప్రజాస్వామ్య విలువలకే విరుద్ధం. నిజంగా క్షమాపణ చెప్పాల్సింది ప్రభుత్వం. చర్చలు, వివరణలు, జవాబుదారీతనం లేకుండా ప్రజాస్వామ్యం బలపడదు. హోంమంత్రి అమిత్ షా ఈ అంశంపై సభలో నిలబడి వివరణ ఇవ్వాలి. విద్యార్థులపై జరిగిన లాఠీచార్జి ఎందుకు చేయాల్సి వచ్చింది? దానికి బాధ్యులెవరు? ఎందుకు శాంతియుత నిరసనను బలప్రయోగంతో ఎదుర్కొన్నారు? అన్న ప్రశ్నలకు దేశం సమాధానం కోరుతోంది. మౌనం సమాధానం కాదు. ప్రజాస్వామ్యంలో హోంమంత్రి పదవి అధికారానికి కాదు, జవాబుదారీతనానికి ప్రతీక. బిల్లులు పెట్టినప్పుడు ‘ఉన్నాడు’… అధికారానికి అవసరమైనప్పుడు ‘ఉన్నాడు’… కానీ ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వచ్చినప్పుడు ‘లేడు’ అనే భావన ప్రజల్లో ఏర్పడితే, అది ఒక వ్యక్తిపై విమర్శ మాత్రమే కాదు, పాలనా విధానంపై అవిశ్వాసానికి సంకేతం. పార్లమెంట్‌ను గౌరవించడం అంటే ప్రతిపక్షాన్ని వినడం, ప్రజల ప్రశ్నలకు సమాధానమివ్వడం, తప్పు జరిగితే క్షమాపణ చెప్పడం. అదే ప్రజాస్వామ్య స్ఫూర్తి. ఆ స్ఫూర్తి కొరవడుతుందంటే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతున్నట్టే లెక్క.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -