Saturday, August 8, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిసమాధి కడుతున్నాం…..

సమాధి కడుతున్నాం…..

- Advertisement -

ప్రజలు మీకు సమాధి కడతారు అన్నాడో నాయకుడు. మీకు ఆల్‌రెడీ కట్టారు, మీరు సమాధిలోనుండే మాట్లాడుతున్నారు అన్నాడు అసలు నాయకుడు. సందంట్లో సడేమియాలా మీ ఇద్దరికీ సమాధి కట్టి మాకు అధికార భవనాన్ని కడుతున్నారు ప్రజలు, మాకు బ్రహ్మరధం పడుతున్నారు అన్నాడు మూడో నాయకుడు. బ్రహ్మరధం మాట అటుంచండి మీకు కనీసం జట్కా కూడ లేదన్నారు ఈ ఇద్దరూ. ఇలా సమాధుల మీద సమాధులు మాటలతో కట్టుకుంటూ పోతున్నారు. మీకు ఢిల్లీలో కడుతున్నారంటే మీకు హైదరాబాదులోనని ఒకరంటే బీహార్‌‌లో మొదలుపెట్టారని ఒకరు ఇలా రకరకాల సమాధుల మాటలు వినిపిస్తాయి. మీకు ఓటర్లు కడుతున్నారంటే మీకు బొద్దింకలు కడుతున్నాయనీ అంటున్నారు. రాజభవనాలు కట్టినా, సింహాసనంపై కూచోబెట్టినా, సమాధి కట్టినా ఈ ప్రజాస్వామ్యంలో అది తాత్కాలి కమనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పైకి పోయిన ముల్లు కిందికి రాకతప్పదు. కిందికి వచ్చిన ముల్లు పైకి పోకా తప్పదు. ఇదేదో తత్వశాస్త్రమో, తత్వజ్ఞానమో కాదు. రాజనీతిశాస్త్రం, రణతంత్ర శాస్త్రం.

‘సమాధికడుతున్నాం చందాలివ్వండి’అని చాలా ఏండ్ల క్రితం ఒక సినిమా వచ్చింది. ఏమి సమాధి కడుతున్నారు ఎందుకు చందాలివ్వాలి అన్నది ప్రధాన అంశం. అక్కడ కట్ చేస్తే అసలు ప్రపంచంలో చాలా ప్రముఖ కట్టడాలు సమాధులేనని మనం గుర్తుంచుకోవాలి. రాజులకు, రాణులకు, స్వతంత్ర పోరాట వీరులకు, అమరులకు, యుద్ధ సైనికులకు ఇలా ఎందరికో జ్ఞాపికలుగా సమాధులు, స్థూపాలు కడతారు. రూపమేదైనా సమాధికున్న ప్రాముఖ్యత సమాధికుంటుంది. ఐతే సమాధి ఎవరు కడుతున్నారు, ఎవరికి కడుతున్నారు, ఎందుకు కడుతున్నారు అన్నది ఎప్పటికైనా ప్రధానమైన టాపిక్కే. ప్రజల హృదయాల్లో గుడికడుతున్నారంటే ఆ నాయకులే అసలైన నాయకులని అర్థం. అంతే తప్ప ప్రజలు సమాధి కడుతున్నారంటే కాస్త ఆలోచించాల్సిందే. ఏమైనా ఏది కట్టించుకోవాలన్నా నాయకులు చేసే పనులు, చెప్పే మాటలు, మాటలు నిలబెట్టుకోవడం ముఖ్యమని తెలుసుకోవడం అతి ముఖ్యం. ఊరకే మాటల యుద్ధాలు జరుగుతుంటే ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారని అందరికీ తెలుసు.

డబుల్ బెడ్‌రూం ఫ్లాట్లకైనా, ఇండ్లకైనా, అసెంబ్లీ భవనాలకైనా, ఆ మాటకొస్తే ఏ కట్టడానికైనా వాటిని నిర్మించేందుకు కార్మికులు కావాలి. ఎన్ని యంత్రాలున్నా ఎంత టెక్నాలజీ ఉన్నా మనుషులుండాలి. మహాకవి అందుకే తాజ్‌మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలిలెవ్వరని ఎప్పుడో అడిగాడు. చరిత్ర నిర్మాతలు ప్రజలేనన్నాడు. నిలబెట్టేదీ, పడగొట్టేదీ ప్రజలేనని తెలిసినా నాయకులకు అది ఈనాటికీ అర్థం కావడం లేదు. ఎప్పటికప్పుడు ప్రజలను ప్రేమించినట్టే కనిపిస్తూ ఉంటుంది పైపైకి. లోలోన పర్వతాలు, నదులు, అడవులు, సముద్రాలు ఇలా ప్రజలకు సంబంధించిన ఆస్తులను పెద్దోళ్ళకు కట్టబెడుతుంటారు. వాళ్ళూ వాటిని నాశనం చేస్తుంటారు. ఈ ఎల్‌నినోలు, క్లౌడ్ బర్స్టింగులు ఎందుకొస్తున్నాయి చెప్పండి? ఇలాంటివాటివల్లే కదా. ట్రంపులవారు కర్బన ఉద్ఘారాలు అని దీర్ఘం తీసి మాట్లాడుతాడు కాని ఆయన చేయించే యుద్ధాలు వాటివల్ల ప్రపంచ ప్రజలకు కలుగుతున్న నష్టం, ఇబ్బందులు తెలియవనా? అన్నీ తెలుసు. సమాధి కట్టేవరకు ఇవి ఆగవని మనకూ తెలుసు.

మీకు మీ ఢిల్లీ హైకమాండే సమాధి కడుతుందని ఒకరు, మీకు జంతర్‌మంతర్‌లోనే సమాధికి పునాది పడిందని ఒకరంటే, మీకు ఫామ్ హౌస్‌లో అని ఒకరంటుంటే, ప్రజాస్వామ్యమే మీకు సమాధికడుతుందని ఒకరంటుంటే ప్రజలు వింతగా చూస్తున్నారు. వీ‌ళ్ల సమాధుల గురించి వీళ్లు కొట్లాడుతున్నారు కాని మాకు మేలు చేసే పనుల గురించి, ప్రాజెక్టుల గురించి మాట్లాడుకోరే? ఒక వేళ మాట్లాడినా అవీ యుద్ధాలలాగే ఉంటున్నాయి. ఒక్కసారైనా ఐనను అందరమూ కలసి పోయిరావలె హస్తినకు అని రాష్ట్ర సమస్యల్ని లిస్టుగా రాసుకొని, రావలసిన నిధులగురించి, జి.ఎస్.టిలో వాటా గురించి, పెండింగు ప్రాజెక్టుల గురించి, ఎల్‌నినో గురించి మాట్లాడొచ్చు కదా. ఎప్పుడూ శాపనార్ధాలతో కాలాన్ని సమాధి చేస్తున్నారు వీళ్లు అని ముక్కుమీద వేలేసుకుంటున్నారు. వీళ్లంతా ఏకంగా ప్రజల బాగోగులకు సమాధి కట్టినట్టున్నారు, ఆ విషయంలో తలా ఒక చేయి, తలా ఒక ఇటుక వేస్తున్నారు, కొందరు సిమెంటు పూస్తున్నారు, కొందరు సమాధిఫలకం చెక్కుతున్నారు, అది తమపైనే కట్టుకుంటున్నామని మరచిపోతున్నారు వీళ్ళు.

అకస్మాత్తుగా ‘‘విజయ’’ఢంకా మోగిస్తాడొకాయన, మోగించడమే కాదు రాజమందిరాన్ని ఖాళీ చేయిస్తాడు. ఎందరినో సీటుపై కూచోపెట్టిన ఇంకొకాయన మెల్లగా తానే రంగంలోకి దిగి సమాధి పనులను దగ్గరుండి చూడడం మొదలు పెడతాడు. ఇవన్నీ మనుషులకు సంబంధించిన విషయాలు మాకు వర్తించవు ఎందుకంటే మేము మోనార్కులము అనుకుంటూ మురిసిపోతే అలాంటివారికి ఎలాంటి ‘‘కట్టడాలు’’ కట్టాలో కూడా ప్రజలకు తెలుసు. ఏ రాళ్లకిందో, సమాధులకిందో ఉంటాయనుకున్న బొద్దింకలు తామే సమాధికి పునాదిరాయి వేసే జెన్ జీ రోజులివి. మరువకూడదు.

జంధ్యాల రఘుబాబు 9849753298

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -