దేశ రాజకీయాల్లో మార్పు సంకేతాలు చాలా సందర్భాల్లో సాధారణ ఎన్నికలకంటే ఉప ఎన్నికల్లోనే స్పష్టంగా కనిపిస్తుంటాయి. ప్రజలు అధికారంలో ఉన్న పార్టీల పనితీరుపై తమ అభిప్రాయాన్ని వెల్లడించడానికి ఉప ఎన్నికలను ఒక అవకాశంగా ఉపయోగించుకుంటారు. తాజాగా బీహార్‌లోని బాంకీపుర్, మధ్యప్రదేశ్‌లోని దాతియా, గుజరాత్‌లోని మంజల్‌పూర్ ఉప ఎన్నిక ఫలితాలు దేశ రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. ఈ మూడు ఫలితాలు వేర్వేరు సందేశాలు ఇచ్చినా, ప్రజాభిప్రాయంలో చోటుచేసుకుంటున్న మార్పులను అర్థం చేసుకోవాల్సిన అవసరాన్ని స్పష్టంగా తెలియ జేస్తున్నాయి. జెన్-జీ ఉద్యమం తర్వాత యువత మనోభావాలను సరిగా అంచనా వేయలేకపోతే రాజకీయంగా మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఇప్పటికే చర్చ జరుగుతోంది. ఢిల్లీలో నీట్ వ్యవహారం, ఉద్యోగాలు, విద్యా అవకాశాలు, పరీక్షల నిర్వహణ వంటి అంశాలపై యువత గళం వినిపించిన నేపథ్యంలో, ఇప్పుడు బీహార్‌లో నమోదైన ఫలితం ఆ చర్చకు మరో కోణాన్ని జోడించింది. బీహార్‌లోని బాంకీపుర్ నియోజకవర్గం ఎన్నో ఏళ్లుగా బీజేపీకి అత్యంత సురక్షితమైన స్థానంగా గుర్తింపు పొందింది. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన నితిన్ నబీన్ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అని వార్యమైంది. అయితే ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని జన సురాజ్ పార్టీ ఆ అంచనాలను తలకిందులు చేసింది.
ప్రశాంత్ కిశోర్ స్వయంగా బరిలోకి దిగి బాంకీపుర్‌లో విజయం సాధించడం కేవలం ఒక ఉప ఎన్నిక ఫలితం మాత్రమే కాదు, బీహార్ రాజకీయాల్లో కొత్త ప్రత్యామ్నాయానికి ప్రజలు అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారనే సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు ప్రాతినిధ్యం వహించిన స్థానంలోనే ఈ విజయం రావడం వల్ల దాని రాజకీయ ప్రభావం మరింత పెరిగింది. అదే సమయంలో మధ్యప్రదేశ్‌లోని దాతియా ఉప ఎన్నికలో కూడా బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. అధికారంలో ఉన్నప్పటికీ ఆ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకోవడం గమనార్హం. ప్రజలు ప్రతి ఎన్నికను వేర్వేరుగా పరిశీలిస్తూ స్థానిక సమస్యలు, అభ్యర్థి పనితీరు, ప్రభుత్వంపై ఉన్న అభిప్రాయాలను ప్రతిబిం బిస్తున్నారని ఈ ఫలితం సూచిస్తోంది.గుజరాత్‌లోని మంజల్‌పూర్ ఉప ఎన్నికలో బీజేపీ తన స్థానాన్ని నిలబెట్టుకున్నప్పటికీ, గత ఎన్నికలతో పోలిస్తే ఆ పార్టీ మెజారిటీ గణనీయంగా తగ్గింది. గెలుపు సాధించినప్పటికీ ఓట్ల ఆధిక్యం తగ్గడం అధికార పార్టీపై ప్రజల్లో కొంత అసంతృప్తి పెరుగుతోందనే సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు. బాంకీపుర్‌లో ఓటమి, దాతియాలో ఎదురుదెబ్బ, గుజరాత్‌లో మెజారిటీ క్షీణత కలిపి చూస్తే ప్రజాభిప్రాయంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.
2024 లోక్‌సభ ఎన్నికల్లోనే బీజేపీకి తొలి హెచ్చరిక కనిపించింది. ప్రస్తుతం యువత కేవలం భావోద్వేగాలు, నినాదాలు, మతం లేదా కుల సమీకరణల కంటే ఉద్యోగాలు, విద్య, పరీక్షల పారదర్శకత, ఆర్థిక అవకాశాలు, జీవన వ్యయం వంటి అంశాలనే ఎక్కువగా ప్రాధాన్యంగా చూస్తోంది. సోషల్ మీడియా, డిజిటల్ వేదికల ప్రభావంతో ప్రభుత్వాల పనితీరును మరింత నిశితంగా గమనిస్తోంది. అందుకే జెన్-జీని నిర్లక్ష్యం చేసే రాజకీయ పార్టీలు భవిష్యత్తులో మరిన్ని సవాళ్లు ఎదుర్కొనే అవకాశముంది.బాంకీపుర్ పంపిన సందేశం ఒక్క బీజేపీకే కాదు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకూ అది వర్తిస్తుంది. ప్రజలు ఇక ఎవరినీ శాశ్వతంగా గెలిపించరు, ఎవరినీ శాశ్వతంగా ఓడించరు. ప్రజల అంచనాలకు అనుగుణంగా పనిచేసిన వారినే ఆదరిస్తారు. అందుకే ఈ ఉప ఎన్నికల ఫలితాలను కేవలం స్థానిక ఎన్నికలుగా కాకుండా దేశ ప్రజల మనోభావాలను ప్రతిబింబించే రాజకీయ సంకేతాలుగా చూడాల్సిన అవసరం ఉంది. ప్రజల గుండె చప్పుడు వినని ఏ రాజకీయ పార్టీ అయినా, ఎంత బలంగా కనిపించినా, ప్రజాస్వామ్యంలో తన స్థానాన్ని నిలబెట్టుకోవాలంటే నిరంతరం ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుంటూ ముందుకు సాగాల్సిందే.
– సమర్
బీజేపీకి బాంకీపూర్ గుణపాఠం!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


