– ఆకస్మిక తనిఖీ చేసిన మున్సిపల్ వైస్ ఛైర్‌పర్సన్ జూపల్లి రమేష్ బాబు
– వైద్యుల నియామకంపై చర్యలు తీసుకుంటాం
– డీసీహెచ్‌ఎస్ డాక్టర్ రవిబాబు
నవతెలంగాణ – అశ్వారావుపేట : అశ్వారావుపేట ఏరియా ఆసుపత్రిలో వైద్యుల కొరత కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితిపై మున్సిపల్ వైస్ ఛైర్‌పర్సన్ జూపల్లి రమేష్ బాబు, కమిషనర్ దిలీప్ రెడ్డి గురువారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలు, మౌలిక సదుపాయాలపై పరిశీలన చేపట్టారు. చికిత్స పొందుతున్న రోగులతో నేరుగా మాట్లాడి సేవల నాణ్యత, ఎదురవుతున్న సమస్యలపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం వైద్యులు సమయానికి విధులకు హాజరై రోగులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. తనిఖీల్లో వైద్య సిబ్బంది లేమి, ప్రధాన వైద్యుల కొరత, రోగుల బెడ్ల నిర్వహణలో నిర్లక్ష్యం వంటి అంశాలు గుర్తించినట్లు సమాచారం.
ఈ అంశాలపై డీసీహెచ్‌ఎస్ డాక్టర్ రవిబాబుతో జూపల్లి రమేష్ బాబు ఫోన్‌లో మాట్లాడగా, సమస్యను పరిశీలించి వైద్యుల నియామకం, అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మిండ హరికృష్ణ, నార్లపాటి దివాకర్, నార్లపాటి మౌనిక, కాంగ్రెస్ మండల అధ్యక్షులు చిన్నంశెట్టి సత్యనారాయణ, అశ్వారావుపేట యువ నాయకులు జూపల్లి ప్రమోద్, నండ్రు రమేష్, కాసాని పద్మశేఖర్, తాడేపల్లి రవి తదితరులు పాల్గొన్నారు.



