Saturday, May 23, 2026
E-PAPER
Homeజాతీయంత్రిభాషా సూత్రంపై సుప్రీంలో పిటిషన్

త్రిభాషా సూత్రంపై సుప్రీంలో పిటిషన్

- Advertisement -

నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) తొమ్మిదో తరగతి విద్యార్థులకు మూడు భాషల బోధన (త్రిభాషా సూత్రం)ను తప్పనిసరి చేస్తూ తీసుకువచ్చిన నూతన విద్యా విధానం ఇప్పుడు న్యాయ వివాదానికి దారితీసింది. బోర్డు తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల తరఫున దాఖలైన ఈ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి ప్రస్తావించారు. విద్యా సంవత్సరం మధ్యలో అకస్మాత్తుగా తొమ్మిదో తరగతి నుంచి మూడు భాషలను తప్పనిసరి చేయడం వల్ల విద్యార్థులపై తీవ్రమైన మానసిక, విద్యాపరమైన భారం పడుతుందని రోహత్గి కోర్టుకు వివరించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న విద్యా విధానానికి ఇది పూర్తిగా భిన్నంగా ఉందని, దీనివల్ల అటు విద్యార్థుల్లో, ఇటు విద్యాసంస్థల్లో తీవ్ర గందరగోళం నెలకొందని ఆయన న్యాయమూర్తికి వెల్లడించారు. విద్యార్థులు మూడు భాషలు ఎలా నేర్చుకుంటారని, ఆ తర్వాత పదో తరగతి పరీక్షలు ఎలా రాస్తారని ఆయన కోర్టులో ప్రస్తావించారు. ఈ పిటిషన్‌పై త్వరితగతిన విచారణ జరపాలని ఆయన ధర్మాసనాన్ని అభ్యర్థించారు.

జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) సిఫారసుల మేరకు సీబీఎస్ఈ విద్యా చట్రంలో మార్పులు చేస్తూ 9, 10 తరగతుల్లో విద్యార్థులు కచ్చితంగా మూడు భాషలను చదవాలనే నిబంధనను తీసుకువచ్చింది. అయితే, తగిన ముందస్తు ప్రణాళిక లేకుండా, మధ్యలో ఈ నిబంధనను రుద్దడం సమంజసం కాదని పిటిషనర్లు వాదిస్తున్నారు. ఈ వాదనలను పరిశీలించిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం వచ్చే వారం సమగ్ర విచారణ జరిపేందుకు అంగీకారం తెలిపింది. త్రిభాషా విధానంపై సీబీఎస్ఈ ఇటీవలే నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఈ విధానాన్ని కచ్చితంగా అమలు చేయబోతున్నారు. ఇప్పటికే సీబీఎస్ఈ తరగతులు ప్రారంభమైనప్పటికీ.. జూలై 1 నుంచి మూడో భాష బోధన ప్రారంభం కానుంది. ఆర్1, ఆర్2, ఆర్3 కింద త్రిభాషను అమలు చేయనున్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ – 2020, నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ – 2022 ప్రకారం.. సీబీఎస్ఈ తాజా నిర్ణయం తీసుకుంది. మూడు భాషల్లో రెండు భారతీయ భాషలు తప్పనిసరిగా నేర్చుకోవాలి. మూడోది ఇండియన్ భాష అయినా ఉండొచ్చు.. లేదా విదేశీ భాష అయినా నేర్చుకోవచ్చు. త్రిభాషా విధానం కోసం సీబీఎస్ఈ మొత్తం 42 భాషల్ని ఎంపిక చేసి, వాటికి సంబంధించిన సిలబస్ రూపొందించింది. రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో పొందుపర్చిన భాషలు ఏవైనా నేర్చుకోవచ్చు. పదో తరగతిలో వచ్చే ఏడాది త్రిభాషా విధానం అమలు చేస్తారు. అయితే, దీనికి బోర్డ్ ఎగ్జామ్ మాత్రం నిర్వహించరు. ఇంటర్నల్ మార్కుల ఆధారంగా తుది మార్కుల జాబితాలో కలుపుతారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -