18 జిల్లాలకు వడగాల్పుల హెచ్చరిక
ఉష్ణోగ్రతలు ఒకటెండ్రు డిగ్రీలు పెరిగే అవకాశం
పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి : వాతావరణ శాఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రం నిప్పుల కొలిమిలా మండు తున్నది. పగటి పూట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిల్లో నమోదవుతున్నాయి. శుక్రవారం రాష్ట్రంలోని 15 జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ మేరకు ఆయా జిల్లాలకు తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. పెద్దపల్లి, కొమ్రంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో అత్యధికంగా 46.1 డిగ్రీల చొప్పున రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లలోనూ 46 డిగ్రీల టెంపరేచర్ రికార్డయింది. రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు సాధారణం కంటే గరిష్ట ఉష్ణోగ్రతలు ఒకటి నుంచి రెండు డిగ్రీలు పెరిగే అవకాశముందని హైదారాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి డాక్టర్ కె.నాగరత్న వెల్లడించారు. 18 జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశముందని హెచ్చరించారు. ఈ మేరకు ఆ యా జిల్లాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలనీ, వీలైనంత మేరకు ఎండలో తిరగకూడదని సూచించారు. హెచ్చరికల జాబితాలో ఆదిలాబాద్, కొమ్రంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలున్నాయి. ఆ జిల్లాల పరిధిలోని ప్రజలు అప్రమత్తంగాఉండాలనీ, వీలైనంత మేరకు ఎండలో తిరగకూడదని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
వేగంగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు
నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. రాబోయే రెండు, మూడు రోజుల్లో ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు, కోమరిన్, నైరుతి, ఆగ్నేయ, తూర్పు బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని మిగిలిన ప్రాంతాలకు విస్తరించే సూచనలున్నాయి. తెలంగాణలో ఎండలు బాగా కొడుతున్నప్పటికీ ఒకటెండ్రు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాలు
పెద్దపల్లి 46.1 డిగ్రీలు
కొమ్రంభీమ్
అసిఫాబాద్ 46.1 డిగ్రీలు
మంచిర్యాల 46.1 డిగ్రీలు
జగిత్యాల 46.0 డిగ్రీలు
జయశంకర్
భూపాలపల్లి 45.9 డిగ్రీలు
నిర్మల్ 45.9 డిగ్రీలు
భద్రాద్రి
కొత్తగూడెం 45.7 డిగ్రీలు
ములుగు 45.6 డిగ్రీలు
ఖమ్మం 45.4 డిగ్రీలు
కరీంనగర్ 45.3 డిగ్రీలు



