Saturday, July 25, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుజనావాసాల పరిధిలోనే ఇందిరమ్మ ఇండ్లు

జనావాసాల పరిధిలోనే ఇందిరమ్మ ఇండ్లు

- Advertisement -

వివిధ శాఖల పరిధిలోని నిరుపయోగ స్థలాలు గుర్తించండి : సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
​నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్

క్యూర్ పరిధిలో నిర్మించే ఇందిరమ్మ ఇండ్లు జనావాసాల పరిధిలోనే ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశిం చారు. ఈ అంశంపై శుక్రవారం హైదరాబాద్‌‌లో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల వివిధ శాఖలకు సంబంధించి నిరుపయోగంగా ఉన్న స్థలాలు గుర్తించాలని అధికారులకు ఆయన సూచించారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో పోలీస్, రెవెన్యూ, రవాణా శాఖలకు సంబంధించి గుర్తించిన నిరుపయోగ స్థలాలను తీసుకుని, వేరేచోట ఆయా శాఖలకు స్థలాలను కేటాయించాలని ఆదేశించారు. జనావాసాలకు దూరంగా ఇందిరమ్మ ఇండ్లను కేటాయిస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఇబ్బందులు తలెత్తడంతో పాటు అవి నిరుపయోగంగా మారే అవకాశం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. అలా కాకుండా పని ప్రదేశాలకు దగ్గరగా, జనావాసాల పరిధిలోనే ఇందిరమ్మ ఇండ్లు నిర్మించేలా చూడాలన్నారు. దీని వల్ల నిరుపేదలు జీవనోపాధి కోల్పోకుండా ఉంటారని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా క్యూర్ ఏరియాలో పలు నియోజకవర్గాల పరిధిలో నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం విదితమే. ఒక్కో ఫ్లాట్ ను దాదాపు 528 చదరపు అడుగుల విస్తీర్ణంతో, 400 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాతో నిర్మించనున్నారు. దీని నిర్మాణానికి దాదాపు రూ.11 లక్షల ఖర్చవుతుండగా ప్రభుత్వం ఇందులో 5 లక్షల రూపాయల సబ్సిడీని అందిస్తోంది. మిగిలిన రూ.6 లక్షలను లబ్ధిదారుడు తన వాటాగా చెల్లించాల్సి ఉంటుంది. ల్యాండ్ కాస్ట్‌ను మాత్రం పూర్తిగా ప్రభుత్వమే భరించనుంది. తొలి దశలో 17 నియోజకవర్గాల్లో 7,680 ఫ్లాట్లను నిర్మించి ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాజేంద్ర నగర్, మహేశ్వరం, శేరిలింగంపల్లి, ఇబ్రహీంపట్నం, మల్కాజ్‌గిరి, నాంపల్లి, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, కార్వాన్, బహదూర్‌పురా, అంబర్‌పేట్, కూకట్‌పల్లి, మేడ్చల్, కుత్బుల్లాపూర్, సనత్ నగర్, సికింద్రాబాద్, కంటోన్మెంట్, మలక్‌పేట్ నియోజకవర్గాల్లో ప్రభుత్వం తొలి విడతలో ఇందిరమ్మ ఇండ్లను నిర్మించనుంది. ఈ క్రమంలోనే ఆయా పరిధిల్లో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. సమీక్షా సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఆర్ అండ్ బీ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, డీజీపీ సీవీ ఆనంద్, సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీలు ఎన్.శ్రీధర్, వి.శేషాద్రి, రెవెన్యూ సెక్రెటరీ లోకేష్ కుమార్, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, హౌజింగ్ స్పెషల్ సెక్రెటరీ వీపీ గౌతమ్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆల, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

డ్రగ్స్‌‌పై ఉక్కుపాదం అధికారులకు సీఎం రేవంత్‌‌రెడ్డి ఆదేశం

కఠిన నిబంధనలు తేవాలి : అధికారులకు సీఎం రేవంత్‌‌రెడ్డి ఆదేశం
విద్యాసంస్థల యాజమాన్యాలను బాధ్యులను చేయాలని సూచన

డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపేందుకు కఠిన నిబంధనలు తీసుకురావాలని ఉన్నతాధికారులకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌‌రెడ్డి ఆదేశించారు. ఈ విషయంలో సర్కారు సీరియస్ గా దృష్టి సారించిందని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థలోని బోధి పెవిలియేన్‌‌లో ఉన్నతా ధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాదక ద్రవ్యాల నిరోధం, భద్రతా కమిటీలపై అధికారులకు సీఎం కీలక సూచనలు చేశారు. సీఎం మాట్లాడుతూ విద్యా సంస్థల్లో డ్రగ్స్ నియంత్రణకు సంబంధించి సంస్థల యాజమాన్యాలను బాధ్యులను చేయాలని సూచించారు. క్యాంపస్ లోపల డ్రగ్స్ కు సంబంధించి ఏ ఘటనకైనా యాజమాన్యాన్ని బాధ్యులను చేయాల్సిందేనని స్పష్టం చేశారు. క్యాంపస్ బయట జరిగే యాక్టివిటీని గుర్తించి సమాచారాన్ని అందించే వ్యవస్థను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని వివరించారు. విద్యాసంస్థలకు అధికారంతో పాటు బాధ్యతను అప్పగించాలని సూచించారు. విద్యార్థుల ప్రవర్తనలో మార్పులను గుర్తించేందుకు యాజమాన్యాలు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకునేలా చూడాలని చెప్పారు. డ్రగ్స్ కు సంబంధించి సమాచారం అందించేందుకు విద్యాసంస్థల ఆవరణలో టోల్ ఫ్రీ నెంబర్, ప్రత్యేక క్యూఆర్ కోడ్ ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని ఆదేశించారు. గుర్తించడం, మాన్పించడం, శిక్షించడం ఈ మూడు దశలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. డ్రగ్స్ స్వీకరించి పట్టుబడితే డీ-అడిక్షన్ సెంటర్ కు తరలించాలని చెప్పారు. తరచూ పట్టుబడితే కఠినంగా శిక్షించే అంశాన్ని పరిశీ లించాలని పేర్కొన్నారు. డ్రగ్స్ విషయంలో కఠినంగా వ్యవహ రించేందుకు అవసరమైతే చట్టాన్ని రూపొందించే అంశంపై అధ్యయనం చేయాలని చెప్పారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌‌జాజు, డీజీపీ సీవీ ఆనంద్‌, సలహాదారులు కె.రామకృష్ణారావు తదితరులతోపాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -