చరిత్ర పునరావృతమవుతోందా..? చమురు సంక్షోభం, ధరల పెరుగుదలతో జనజీవనం అస్తవ్యస్తం
యువతలో కట్టలు తెంచుకుంటున్న ఆగ్రహంనిరుద్యోగులకు శాపంగా మారిన ప్రవేశ పరీక్షలు
న్యూఢిల్లీ : 1973లో ఇందిరాగాంధీ హయాంలో జరిగిన పరిణామాలు ఇప్పుడు మరోసారి పునరావృతమవుతున్నాయి. నాటి ఇందిర పాలనలో చమురు ధరలు భగ్గుమంటే నేటి మోడీ ఏలుబడిలోనూ అదే పరిస్థితి కన్పిస్తోంది. ఆనాడు వెంటాడిన నిరుద్యోగ భూతమే నేడూ విశ్వరూపం చూపిస్తోంది. నాటి ద్రవ్యోల్బణమే నేడూ సామాన్యుడి జీవన గమనాన్ని దుర్భరం చేస్తోంది. అంటే చరిత్ర పునారావృతం అవుతోందన్న మాట. చరిత్ర తొలుత విషాదంగా, ఆ తర్వాత ప్రహసనంలా పునరావృతం అవుతుందని మార్క్స్ మహాశయుడు అన్నారు. నేటి పరిణామాలను నిశితంగా గమనిస్తే 1973 నాటి చారిత్రక సంక్షోభం తిరిగి కన్పిస్తోందని అనిపిస్తుంది.గడచిన సంవత్సరంన్నర కాలంలో…ఇప్పుడు గత 18 నెలలలో జరిగిన ఘటనలను పరిశీలిద్దాం. పశ్చిమాసియాలో తలెత్తిన యుద్ధం మనపై ఓ కొత్త చమురు సంక్షోభాన్ని రుద్దింది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) పారిశ్రామిక స్థాయిలో తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవడంతో 20 బిలియన్ డాలర్ల నిధులు దేశం బయటికి పోయాయి. అనేక బడా భారతీయ కంపెనీలు విదేశాలలో పెట్టుబడులు పెడుతుండడంతో ఎఫ్‌డీఐల రాక దాదాపుగా నిలిచిపోయింది.
ఇవి బలహీనపడుతున్న డాలరుతో పోలిస్తే రూపాయిపై ఒత్తిడి పెంచుతున్నాయి. యూపీఏ పాలన చివరి సంవత్సరంలో బీజేపీ రూపాయి బలాన్ని ఓ రాజకీయ సమస్యగా మార్చి పెద్ద తప్పే చేసింది. డాలరుతో పోలిస్తే రూపాయి విలువ వందకు చేరుతుందేమోనని ఇప్పుడు భయపడుతోంది. ప్రస్తుత చమురు సంక్షోభం 1973 నాటి పరిస్థితిని గుర్తుకు తెస్తోంది. ముందు చూపు లేని మోడీ ప్రభుత్వం కూడా నాటి ఇందిర వలెనే ఈ ధరల పెరుగుదల భారాన్ని అనివార్యంగా వినియోగదారులపై నెట్టేస్తోంది. ద్రవ్యోల్బణం అదుపు తప్పుతోంది. నిరుద్యోగ భూతం తరుముకుంటూ వస్తోంది. 1973లో రుతుపవనాలు విఫలమైతే ఇప్పుడు ఎల్‌నినో హెచ్చరికలు వినిపిస్తున్నాయి. దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో తెలియడం లేదు. 1973తో పోలిస్తే మన జీడీపీలో వ్యవసాయ రంగం వాటా చాలా తక్కువగా ఉంది. వ్యవసాయ సంక్షోభమే ప్రజానీకాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. నీట్- యూజీ పేపర్ లీకేజీ కారణంగా యువతలో ఆగ్రహావేశాలు కట్టలు తెంచు కుంటు న్నాయి. అందుబాటులో ఉన్న కొద్దిపాటి ఉద్యోగాల కోసం తీవ్ర పోటీ కన్పిస్తోంది. క్యాట్, నీట్, జేఈఈ, క్లాట్, యూపీఎస్సీ, ఎన్డీఏ, ఐఎంఏ, చివరికి అగ్నివీర్ నియామక పరీక్షలు, సాధారణ కళాశాల ప్రవేశాల కోసం నిర్వహించే సీయూఈటీ వంటి అనేక చిన్న చిన్న పరీక్షలు…ఈ పరీక్షల పద్మవ్యూహం మధ్య విద్యార్థులు, నిరుద్యోగులు చిక్కుకుపోయి బయటపడలేక పోతున్నారు.
ఇందిర విజయ యాత్ర
1973లో ఏం జరిగిందో ఓసారి గుర్తుకు తెచ్చుకుందాం. ఇందిరాగాంధీ 1971 సార్వత్రిక ఎన్నికలలో తన మిత్రపక్షాలైన సీపీఐ, డీఎంకేలతో కలిసి 80 శాతం సీట్లను గెలుచుకొని ఘన విజయం సాధించారు. అదే సంవత్సరం ఆమె పాకిస్తాన్‌ను ఓడించడంతో బంగ్లాదేశ్ ఆవిర్భవించింది. ఆ మరుసటి సంవత్సరం 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఎన్నికలు జరగగా పదిహేను చోట్ల ఆమె మరింత నిర్ణయాత్మక విజయాన్ని అందుకున్నారు. ఆమె గెలుపొందలేకపోయిన మణిపూర్, మిజోరం, గోవా, మేఘాలయ చాలా చిన్న రాష్ట్రాలు. మిజోరం, గోవాలు అప్పటికీ ఇంకా కేంద్ర పాలిత ప్రాంతాలు మాత్రమే. ఇందిర అధికారం, కీర్తి శిఖరాగ్రానికి చేరాయి. పార్టీని, క్యాబినెట్‌ను, పార్లమెంటును ఆమె తన నియంత్రణలో ఉంచుకున్నారు. ఏ భారత నాయకుడు కూడా అంతటి తిరుగులేని ఆధిపత్యాన్ని అనుభవించలేదు. ప్రస్తుతం నరేంద్ర మోడీ ఆ స్థితికి చేరువలో ఉన్నారు.
యువతను ఆకర్షిస్తున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’
ఇలాంటి పరీక్షలన్నీ ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులలో ఉన్న మధ్యతరగతి ప్రజానీకాన్ని మరింత అప్పుల సుడిగుండంలో నెడుతున్నాయి. కోచింగ్ కేంద్రాల ధనదాహం ప్రజల జేబులను ఖాళీ చేస్తోంది. పేపల్ లీకేజీల కారణంగా పరీక్ష రద్దయితే పరిస్థితి మళ్లీ మొదటికే వస్తుంది. భారత ప్రధాన న్యాయమూర్తి చేసిన ఓ వ్యాఖ్యకు ప్రతిస్పందనగా సరదాగా పుట్టుకొచ్చిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఇప్పుడు నిరుద్యోగులు, యువతను విశే షంగా ఆకర్షిస్తోందంటే ఆయా వర్గాలలో గూడు కట్టు కున్న అసంతృప్తి, ఆగ్రహం ఏ స్థాయిలో ఉన్నదో అర్థమ వుతుంది. వారం రోజుల వ్యవధిలోనే లక్షలాది మంది యువత ఆ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్‌లో పోటె త్తారు. దీంతో ప్రభుత్వం భయపడి దాని ఎక్స్ హ్యాండిల్‌ను నిషేధించింది. అయితే ఆ పార్టీ ఇన్ స్టాగ్రామ్‌లో ప్రస్తుతం రెండు కోట్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇది బీజేపీ ఫాలోవర్ల సంఖ్యకు రెండున్నర రెట్లు ఎక్కువ.
పెరిగిన వ్యతిరేకత…ఆదుకోని ఎమర్జెన్సీ
ఇందిర విషయంలో పరిస్థితులు నాటకీయంగా మారిపోయాయి. 1972-73లో దేశాన్ని వరుసగా రుతుపవనాలు దెబ్బతీశాయి. ఇలా జరగడం చాలా అరుదు. 1973లో యోమ్ కిప్పుర్ యుద్ధం (ఇజ్రాయిల్‌కు, ఈజిప్ట్ ‘సిరియాల నేతృత్వంలోని అరబ్ దేశాలకు మధ్య జరిగిన యుద్ధం) జరగడం, ఇస్లామిక్ పశ్చిమాసియా శక్తులు తొలిసారిగా చమురును ఆయుధంగా ఉపయోగించుకోవడంతో చమురు సంక్షోభం తలెత్తింది. నాటి ఇందిర సర్కారు గ్రహించి అప్రమత్తంగా లేకపోవడంతో చమురు కొరత, ధరల పెరుగుదల కరువు కష్టాలను మరింత తీవ్రతరం చేశాయి. మన దేశం విషయానికి వస్తే యువత…ముఖ్యంగా గుజరాత్‌లో తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. వారి నవ నిర్మాణ ఆందోళన రాజకీయ ప్రేరేపితమైంది కాదు. నిరుద్యోగం, అద్దెలు, నిత్యావసరాల ధరలు వంటి ఆర్థిక ఇబ్బందులు ప్రజలందరినీ ప్రభావితం చేశాయి. అదే సమయంలో కళాశాల హాస్టళ్లలో మెస్ ఫీజుల పెరుగుదల అగ్నికి ఆజ్యం పోసింది. అది గుజరాత్ ముఖ్యమంత్రి చిమన్‌భాయ్ పటేల్‌పై అవినీతి వ్యతిరేక పోరు రూపం తీసుకుంది. మరోవైపు బీహార్‌లో విద్యార్థులు, లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ వంటి నాయకులు బీహార్ ఛాత్ర సంఘర్ష సమితిని ఏర్పాటు చేసి ధరల పెరుగుదల, అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించారు.
తమకు నేతృత్వం వహించాల్సిందిగా జయప్రకాష్ నారాయణ్‌ను కోరారు. ఆందోళనలపై స్పందించిన ఇందిరాగాంధీ గుజరాత్ ముఖ్యమంత్రి చిమన్‌భాయ్ పటేల్‌ను తొలగించారు. బీహార్‌లో అబ్దుల్ గఫూర్ 1974 వరకూ పదవిలో కొనసాగినా ఆ మరుసటి సంవత్సరం ఏప్రిల్‌లోనే వైదొలగాల్సి వచ్చింది. 1974 వేసవిలో ఇందిరాగాంధీ పోఖ్రాన్-1 అణు పరీక్షను నిర్వహించారు. విదేశీ శక్తులు, సీఐఏ తన ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తున్నాయంటూ కుట్ర సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు. అయినా పరిస్థితి మారలేదు. 1974లో నిరుద్యోగం గరిష్ట స్థాయికి చేరింది. ద్రవ్యోల్బణం 29 శాతానికి ఎగబాకింది. అది సెప్టెంబర్ నాటికి 34.68 శాతానికి చేరుకుంది. పరిస్థితులు చేజారిపోతుండడంతో ఇందిర అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అయితే అది కూడా ఆమెను కాపాడలేకపోయింది. 1977 సార్వత్రిక ఎన్నికలలో ఆమె అవమానకరమైన ఓటమిని చవిచూశారు.



