సిబ్బంది కదలికలపై నిఘా
ఆఫీస్ టైమింగ్స్, లంచ్‌బ్రేక్‌లు, క్యాంపస్ బటయకు వెళ్లడంపై ఆంక్షలు
తాజా సర్క్యులర్‌పై అధ్యాపకులు, ఉద్యోగుల్లో అసంతృప్తి
అకాడమిక్ స్వేచ్ఛ తగ్గిపోతోందని ఆందోళన
న్యూఢిల్లీ : నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సీఈఆర్‌టీ) ప్రధాన కార్యాలయం జారీ చేసిన తాజా సర్క్యులర్ సంస్థలో పెరుగుతున్న పరిపాలనా నియంత్రణ, నిఘాపై ఆందోళనలు రేకెత్తించింది. ఉద్యోగులు కార్యాలయ సమయాల్లో అనుమతి లేకుండా క్యాంపస్ బయటకు వెళ్లకూడదనీ, ఆలస్యంగా వస్తే సెలవులు లేదా జీతం కోత విధిస్తామని పేర్కొంది. ఇప్పుడు ఈ ఉత్తర్వులను కొందరు అధ్యాపకులు, ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. దీనిని భయ వాతావరణాన్ని సృష్టించే చర్యలుగా వారు అభివర్ణిస్తున్నారు.
అనుమతి లేకుండా క్యాంపస్ బయటకు వెళ్లొద్దు
ఈనెల 8న ఢిల్లీలోని ఎన్‌సీఈఆర్‌టీ ప్రధాన కార్యాలయం భద్రతా విభాగం విడుదల చేసిన సర్క్యులర్‌లో ఉద్యోగులపై కఠిన నియంత్రణలు అమలు చేస్తున్నట్టు పేర్కొంది. ఉద్యోగులు ముందస్తు అనుమతి లేకుండా కార్యాలయ సమయాల్లో క్యాంపస్‌ను విడిచిపెట్టకూడదని ఆదేశించింది. గేట్ల వద్ద ఉన్న భద్రతా సిబ్బంది.. ఇలా అనుమతి లేకుండా బయటకు వెళ్లడాన్ని అడ్డుకోవాలనీ, అలాంటి ఘటనల వివరాలను నమోదు చేసి ఉన్నతాధికారులకు నివేదించాలని సూచించింది. అయితే ఈ సర్క్యులర్ ఢిల్లీ ప్రధాన కార్యాలయానికే కాకుండా అజ్మీర్, భోపాల్, భువనేశ్వర్, మైసూరు, షిల్లాంగ్, నెల్లూరు ప్రాంతీయ కేంద్రాలకు కూడా పంపినట్టు సమాచారం.
సర్క్యులర్‌లో ప్రధాన అంశాలు
ఉదయం 9.15 తర్వాత కార్యాలయానికి వస్తే తప్పనిసరిగా క్యాజువల్ లీవ్ కట్ చేస్తారు. సెలవులు అందుబాటులో లేకపోతే జీతం నుంచి కోత విధిస్తారు. పదేపదే నిబంధనలు ఉల్లంఘిస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియమాల ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. క్యాంపస్ బయటకు వెళ్లేందుకు సంబంధిత అధికారుల నుంచి ముందస్తు లిఖిత లేదా రికార్డు అనుమతి అవసరం. భద్రతా సిబ్బందికి ఉద్యోగుల కదలికలపై రికార్డులు నిర్వహించే అధికారం ఇచ్చారు. సర్క్యులర్ ప్రకారం… కార్యాలయ సమయాలు, లంచ్ బ్రేక్‌లు, క్యాంపస్ వెలుపల కదలికల విషయంలో ఉద్యోగులు పదేపదే నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చర్యలు సంస్థ పరిపాలనా నియంత్రణను బలహీనపరుస్తున్నాయనీ, భద్రతా వ్యవస్థకు ప్రమాదకరమని సర్క్యులర్‌లో పేర్కొన్నారు.
అధ్యాపకుల ఆందోళనలు
ఈ వివాదస్పద నిర్ణయంపై అధ్యాపకులు ఆందోళనను వెలిబుచ్చుతున్నారు. “ఇది కేవలం హాజరు లేదా సమయపాలన విషయం కాదు. ఇప్పుడు మొత్తం వ్యవస్థను నిఘా, నియంత్రణలతో నడపాలని చూస్తున్నారు. ‘సెక్యూరిటీ ఆర్కిటెక్చర్’, ‘మూవ్‌మెంట్ మానిటరింగ్’ వంటి పదాలు సాధారణంగా అకాడెమిక్ సంస్థల్లో వినిపించవు” అని ఓ అధ్యాపకుడు అన్నారు. “ఈ ఉత్తర్వుల ఉద్దేశ్యం ఉద్యోగుల్లో భయాన్ని సృష్టించడం మాత్రమే. ఇక్కడి వాతావరణం ఇంత శత్రుత్వపూరితంగా ఎప్పుడూ లేదు” అని మరొక అధ్యాపకుడు వ్యాఖ్యానించారు. అకాడమిక్ స్వేచ్ఛ తగ్గుతోందనీ, సమావేశాలు, కాన్ఫరెన్సులకు వెళ్లడానికీ అనేక అనుమతులు తీసుకోవాల్సి వస్తోందని అంటున్నారు. పత్రికల్లో వ్యాసాలు రాయడంపై కూడా పరిమితులు పెరిగాయని ఆరోపిస్తున్నారు. ట్రాన్స్‌ఫర్లు, బలవంతపు వాలంటరీ రిటైర్మెంట్ల ద్వారా భిన్నాభిప్రాయాలను అణచివేస్తున్నారని కొందరు ఆందోళన వ్యక్తం చేశారు.కాగా ఈ అంశంపై ఎన్‌సీఈఆర్‌టీ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ ప్రభాత్ కుమార్ మిశ్రా, డైరెక్టర్ దినేశ్ ప్రసాద్ సక్లానీల నుంచి స్పందన రాలేదు.
ఎన్‌సీఈఆర్‌టీలో కఠిన నియంత్రణలు!
- Advertisement -
- Advertisement -



