Sunday, May 24, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఆధునీకరిస్తున్నా.. ఏటీసీల్లో డ్రాపౌట్లు

ఆధునీకరిస్తున్నా.. ఏటీసీల్లో డ్రాపౌట్లు

- Advertisement -

వరంగల్‌లోని మూడు ఏటీసీల్లో వెళ్లిపోయిన 149 మంది విద్యార్థులు సరైన అవగాహన కల్పించకపోవడమే కారణం
నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రంలోని ఐటీఐలను అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లు(ఏటీసీ)గా ప్రభుత్వం ఆధునీకరిస్తున్నా.. డ్రాపౌట్స్‌ ఉండటం గమనార్హం. అడ్మిషన్లు పెరుగుతున్నా.. మధ్యలోనే ఎందుకు చదువు ఆపేస్తున్నారో అంతు చిక్కడం లేదని నిర్వాహకులు అంటున్నారు. దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించినట్టు తెలిసింది. వరంగల్‌, హన్మకొండ, కాజీపేట అడ్వాన్స్‌డ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ (ఏటీసీ)లలో తొలి విద్యాసంవత్సరంలోనే డ్రాపౌట్స్‌ పెరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, టాటా టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ (టీటీఎల్‌)తో పదేండ్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 65 ఐటీఐలను అధునాతన సాంకేతిక కేంద్రాలు(ఎటీసీ)గా తీర్చిదిద్దడానికి శ్రీకారం చుట్టింది. ఇందుకు రూ.2,324.21 కోట్లు ఖర్చు చేయడానికి నిర్ణయించగా, ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.307.96కోట్లు(13.26శాతం), టాటా టెక్నాలజీస్‌ లిమిటెడ్‌(టీటీఎల్‌) రూ.2,016.25కోట్లు(86.74శాతం) సమకూర్చుతుంది. ప్రతి ఏటిసీనీ 13,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ షెడ్‌ నిర్మించి అత్యాధునిక మిషనరీలు అమర్చింది. టీటీఎల్‌ ప్రతి ఏటిసీలోనూ ఇద్దరు మాస్టర్‌ ట్రైనర్‌లను ఆరుగురు ట్రైనర్‌లకు శిక్షణనిచ్చి నియమించింది. వారు అధునాతన సాంకేతిక కేంద్రాల్లో కొత్త కోర్సుల్లో విద్యార్థులకు శిక్షణనిస్తున్నారు. రొబోటిక్స్‌, ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ తదితర ఆరు కోర్సులు ప్రవేశపెట్టారు. ఈ కోర్సులను పూర్తి చేస్తే సత్వరమే ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

వరంగల్‌ నగరంలోని ములుగు రోడ్డులోని ఐటీఐ ప్రాంగణంలోనే వరంగల్‌, హన్మకొండ, కాజీపేట ఏటీసీలను ప్రారంభించారు. టాటా టెక్నాలజీస్‌ సౌజన్యంతో ఈ ఏటీసీలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. 2025 ఆగస్టులో ప్రారంభం కావాల్సిన ఈ ఏటీసీలకు ప్రవేశాలను సెప్టెంబర్‌లోనే పూర్తి చేసినా డిసెంబర్‌ వరకు నిర్మాణాలు, మిషనరీ పూర్తిస్థాయిలో అమర్చకపోవడంతో ప్రవేశాలు పొందిన అభ్యర్థులు ప్రత్యామ్నాయ కోర్సులను ఎంచుకొని వెళ్లిపోయారు. మూడు ఏటీసీలలో మొత్తం 516 సీట్లుండగా, ప్రస్తుతం 367 మంది అభ్యర్థులు విద్యనభ్యసిస్తున్నారు. 149 మంది విద్యార్థులు ఇతర కోర్సులకు వెళ్లిపోయారు. పీఆర్‌ఎన్‌ జనరేషన్‌లో సాంకేతిక లోపాలు అభ్యర్థులు ఈ కోర్సులలో వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకునే క్రమంలో ఆధార్‌తో లింక్‌ అయిన వారి మొబైల్‌ నెంబర్‌ను దరఖాస్తులో నమోదు చేసుకోవాలి. అలా నమోదు చేసుకుంటేనే పర్మినెంట్‌ రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ (పీఆర్‌ఎన్‌) వస్తుంది. ఇతర మొబైల్‌ నెంబర్‌లను నమోదు చేయడంతో పలువురు అభ్యర్థులకు పీఆర్‌ఎన్‌ జనరేట్‌ కాకపోవడంతో వారి ప్రవేశాలు తీసుకోలేదు. దీంతో ఖాళీలు అధికమయ్యాయి. ఉపకార వేతనాలపై ప్రభుత్వం నిర్లక్ష్యం ఏటీసీల్లో విద్యార్థులకు ప్రతినెలా రూ.2,000 ఉపకార వేతనాలు ఇవ్వనున్నట్టు తొలుత రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ, మొదటి బ్యాచ్‌ విద్యార్థులు కోర్సు పూర్తి చేస్తున్నా ఉపకార వేతనాలను అందించకపోవడం గమనార్హం. వెంటనే ఉపకార వేతనాలను ఇచ్చి ఆర్థిక సాయం అందించాలని విద్యార్థులు కోరుతున్నారు.​

కోర్సుల ప్రారంభంలో జాప్యం..
2025 సెప్టెంబర్‌లో తరగతులు ప్రారంభం కావాల్సి ఉండగా.. నాలుగు నెలల జాప్యం జరిగింది. షెడ్‌ల నిర్మాణం పూర్తయినా పూర్తిస్థాయిలో అత్యాధునిక మిషనరీని అమర్చడంలో ఆలస్యం జరగడంతో ప్రవేశాలు పొందిన అభ్యర్థులు ఆందోళనకు గురై ఇతర కోర్సులకు వెళ్లారు.

వెబ్‌సైట్‌ ఓపెన్‌ కాక..
ఏటిసీల్లో 2026 అడ్మిషన్స్‌కు మే 14వ తేదీన నోటిఫికేషన్‌ విడుదల చేశారు. అయితే, వెబ్‌సైట్‌ ఓపెన్‌ కాకపోవడంతో మళ్లీ 20వ తేదీన దరఖాస్తు చేసుకోవాలని కోరారు. 20వ తేదీన కూడా వెబ్‌సైట్‌ ఓపెన్‌ కాలేదు. దీంతో ఈనెల 25వ తేదీన వైబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించారు. ఈనెల 25వ తేదీన కూడా వెబ్‌సైట్‌ ఓపెన్‌ అవుతుందా ? లేదా ? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రారంభంలోనే వెళ్లిపోయిన 
149 మంది విద్యార్థులు
ఏటీసీలలో ప్రారంభంలోనే పలువురు విద్యార్థులు ఇతర కోర్సుల్లో అడ్మిషన్లు తీసుకొని వెళ్లిపోయారు. మరికొందరికి ఈ కోర్సుల పట్ల అవగాహన లేక వదిలేశారు. ఇలా వరంగల్‌, హన్మకొండ, కాజీపేట ఏటిసీల్లోనే 149 మంది విద్యార్థులు అర్ధాంతరంగా వెళ్లిపోయారు. హన్మకొండ ఏటిసీలోనే అత్యధికంగా 61 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొంది మానేశారు. కాజీపేట ఏటీసీలో 56, వరంగల్‌ ఏటీసీలో 32 మంది విద్యార్థులు ఈ కోర్సులు మానేసి 
ఇతర కోర్సుల్లో చేరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -